MLC Kavitha: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని కోరిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha Enquiry: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేదు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు చేయాల్సిందిగా ఈడీ అధికారులకు లేఖను పంపారు. కవిత అభ్యర్థనపై ఈడీ ఎటూ తేల్చకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
MLC Kavitha Enquiry: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ మేరకు కవిత తరపు న్యాయవాదులు ఈడీకి సమాచారం అందించారు. రెండో సారి ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో గురువారం ఉదయం నుంచి ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ఉదయం నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ లతోపాటు ఎంపీలతో కలిసి కార్యాచరణపై చర్చించారు. అనంతరం న్యాయ నిపుణులతో చర్చించిన కవిత విచారణకు హాజరు కాలేకపోవడానికి వివరణ ఇచ్చారు.
ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కవిత లేఖతో న్యాయవాదుల బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. అడ్వకేట్ సోమా భరత్ నేతృత్వంలోని న్యాయ నిపుణుల బృందం 11:40కు ఈడి అధికారులను కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీస్ ఎస్కార్ట్ వాహనం కెసిఆర్ నివాసం నుంచి బయటకు వెళ్లి పోయింది.
నిబంధనల ప్రకారం విచారణ జరగట్లేదు….
బిఆర్‌ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే ఈడీ దర్యాప్తు పేరుతో వేధిస్తోందని కవిత తరపు న్యాయవాది ఆరోపించారు. కవిత తరపున పలు ఈడీ కోరిన పలు డాక్యుమెంట్లను సమర్పించినట్లు సోమా భరత్ చెప్పారు. కవితను ఇబ్బంది పెట్టడానికే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50లో నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేయడాన్ని ప్రశ్నించినట్లు అడ్వకేట్ తెలిపారు. ఈడీ కేసుల్లో నిందితులుగా, సాక్ష్యులుగా విచారించడానికి ఉన్న వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించి ప్రస్తుతం విచారణ జరిపారన్నారు. గతంలో పలు కేసుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు, చట్టాలను ధిక్కరించి ఈడీ అధికారులు వ్యవహరించారని, 15ఏళ‌్లలోపు పిల్లలు ఉన్న మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఈడీ ఇచ్చిన నోటీసులపై చట్ట ప్రకారం ఇంటి వద్దే విచారణ జరపాలని కోరినా, ఆమెకు గడువు ఇవ్వలేదన్నారు. 11వ తేదీన చట్టానికి సహకరించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో చట్ట ప్రకారం విచారణకు హాజరయ్యారని చెప్పారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశామని, 24న ఆ కేసు విచారణకు రానుండటంతో ఈడీకి వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత వారం అడిగిన 12సెట్ల పత్రాలను అధికారులకు సమర్పించినట్లు సోమాభరత్ చెప్పారు.ఈడీ నమోదు చేసిన అక్రమ కేసును చట్టబద్దంగా ఎదుర్కొంటామని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కాకపోవడానికి అనారోగ్యం కారణం కాదని సోమా భరత్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ జరగడం లేదని, చట్టబద్దంగా తమకు ఉన్న హక్కులని అమలుచేయాలని తాము కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఈడీకి తెలియచేసినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని కోరినట్లు విజ్ఞప్తి చేశామన్నారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారించాలని ఈడీ అధికారులను కోరినట్లు తెలిపారు. కవిత సెల్‌పోన్‌ను కూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని కవిత లేఖలో పేర్కొన్నారు.
కవిత విజ్ఞప్తిపై ఈడీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కవిత పిటిషన్‌పై విచారణ జరిగే వరకు ఈడీ వేచి ఉంటుందా, లేకుంటా చర్యలకు దిగుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు సిఆర్‌పిసి 160 ప్రకారం ఇచ్చే నోటీసులకు మనీలాండరింగ్ కేసుల్లో వర్తించవని న్యాయనిపుణులు చెబుతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే మినహాయింపులు ఉండవని గతంలో మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కవిత విచారణకు గైర్హాజరు కావడంతో ఈడీ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందోనని ఉత్కంఠ బిఆర్‌ఎస్ వర్గాల్లో నెలకొంది.