Renovation of Chennai Srivari Temple: చెన్నై శ్రీవారి ఆలయం పునర్నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. త్వరలోనే పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. చెన్నై నగరంలోని జిఎన్ చెట్టి వీధిలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం జరిగిన విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ఉదయం 9 నుంచి 9.45 గంటల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిందని తెలిపారు. ప్రఖ్యాత సినీనటి శ్రీమతి కాంచనతోపాటు వారి కుటుంబ సభ్యులు రూ.40 కోట్లకు పైగా విలువైన ఈ స్థలాన్ని టీటీడీకి విరాళంగా అందించారని వెల్లడించారు. దాతలతోపాటు చెన్నై భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ స్థలంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించినట్టు చెప్పారు. రూ.10 కోట్లతో టీటీడీ ఈ ఆలయ నిర్మాణం చేపట్టిందన్నారు. దీంతోపాటు చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, సభ్యులు స్మిత ఇతర సభ్యుల ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో గాలిగోపురం, కలశాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
ఆలయంలో శుక్రవారం ఉదయం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి సమక్షంలో ప్రాణప్రతిష్ట, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని ప్రకటించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తరహాలోనే ఇక్కడ నిత్య కైంకర్యాలు, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తామన్నారు. కాగా, గురువారం ఉదయం చతుష్టానార్చన, మూర్తిహోమం, ప్రాయశ్చిత్తం, పూర్ణాహుతి, ధ్వజస్తంభ ఛాయ జలాధివాసం, బింబ నయనోన్మీలనం నిర్వహించారు. సాయంత్రం శయనాధివాసం చేపట్టారు. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Tirumala : మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉగాది రోజు ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్ధు చేసింది. ఈ కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ వెల్లడించింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
సంబంధిత కథనం