YV Subbareddy : ఆ పేర్లు బయటకెలా వచ్చాయో విచారణ చేయాలన్న సుబ్బారెడ్డి…
YV Subbareddy ఏప్రిల్‌లోపు పరిపాలనా రాజధాని విశాఖపట్నం తరలింపు ఖాయమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుగుతుందని, ఉద్యోగుల తరలింపుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజధాని తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. మరోవైపు అవినాష్ కాల్ డేటా వ్యవహారంలో పేర్లు బయటకు ఎలా వచ్చాయో విచారణ జరపాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
YV Subbareddy కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు పరిపాలనా రాజధాని విశాఖ తరలిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి చెప్పారు. మార్చి 3,4తేదీల్లో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు జరుగుతుందని ఈ నేపథ్యంలో పరిపాలనా రాజధానిని విశాఖ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లోపు విశాఖకు రాజధాని తరలిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాజధాని తరలింపు నేపథ్యంలో విశాఖపట్నం వచ్చాక ఎక్కడ ఉంటామనేది పెద్ద సమస్య కాదని, విశాఖలో చాలా ప్రభుత్వ భవనాలు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాము గతంలో నిర్వహించిన విశాఖ గర్జన సమయంలోనే స్పష్టమైన ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు.
ఎన్నో సందర్భాల్లో రాజధాని తరలింపు చేస్తామని ప్రకటించారని, ఏప్రిల్ నెలలోపు తప్పకుండా న్యాయపరమైన సమస్యలు పరిష్కారించుకుని ఏ మేరకు వీలైతే, ఆ మేరకు విశాఖ నుంచి పాలన సాగించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు చాలా ఉన్నాయని, అవసరమైతే ప్రైవేట్ భవనాలను కూడా అద్దెకు తీసుకుంటామన్నారు. భీమిలీ రోడ్డులో చాలా ప్రభుత్వ భవనాలు, ఐటీ భవనాలు ఉన్నాయని, ఐటీ సంస్థలు పరిమితంగా ఉన్నందున వాటిని కూడా రాజధాని కోసం వినియోగించుకోవచ్చన్నారు. అద్దె భవనాలు, ఖాళీ స్థలాలకు ఎలాంటి కొరత ఉండదన్నారు.
మరోవైపు ఉడా, విఎంఆర్‌డిఏ పరిధిలో భవనాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సినంత చోటు విశాఖలో అందుబాటులో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, నివాసం ఎక్కడో చోట ఏర్పాటు చేయవచ్చన్నారు. ఎన్నికల్లోపు పరిపాలనా రాజధాని నిర్ణయాన్ని అమలు చేయాలనే దానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. విద్యా సంవత్సరం పూర్తై, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు రాజధాని తరలింపు కొలిక్కి తీసుకువస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు కట్టుబడి ఉందని, ఎన్నికలకు ముందే చెప్పిన విధంగా రాజధాని తరలింపు ఉంటుదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
ఆ విషయం విచారించాలి…..
వైఎస్ అవినాష్‍రెడ్డి కాల్ డేటాపై వార్తలు వెలువడటంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇంట్లో మనం అనుకున్న వాళ్లు ఫోన్లు తీయకుంటే కొన్నిసార్లు సన్నిహితులు, పనివాళ్లకు కాల్ చేస్తామని, అవినాశ్ కూడా నవీన్ అనే వ్యక్తికి కాల్ చేశారన్నారు. తాను కూడా భారతమ్మ ఫోన్ తీయకపోతే నవీన్‍కు కాల్ చేస్తానని సుబ్బారెడ్డి చెప్పారు. ఫోన్ కాల్స్ విషయాలు పేపర్లకు ఎలా తెలుస్తున్నాయని, దానిపై విచారణ చేయాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
టాపిక్