Opinion Column: పొడిచేనా... పొత్తుల కాలమ్‌!-opinion column analysis of alliances in andhra pradesh politics ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Opinion Column Analysis Of Alliances In Andhra Pradesh Politics

Opinion Column: పొడిచేనా... పొత్తుల కాలమ్‌!

HT Telugu Desk HT Telugu
Oct 27, 2022 02:44 PM IST

Opinion column: ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో పొత్తులపై సీనియర్ జర్నలిస్ట్ ఆర్.దిలీప్ రెడ్డి విశ్లేషణ.

ఇటీవల విజయవాడలో చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్
ఇటీవల విజయవాడలో చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ (HT_PRINT)

Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కోయిల ముందే కూస్తోంది. తమ శక్తియుక్తుల్ని మోహరిస్తూ రాజకీయ పక్షాలు ఇప్పట్నుంచే క్రియాశీలమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే, తదుపరి సర్కారు ఎవరిది? అన్న చర్చ జనక్షేత్రంలోనూ మొదలైంది.

ట్రెండింగ్ వార్తలు

ఇందుకు మీడియాను మాత్రమే తప్పుబట్టలేము. ప్రధాన ప్రత్యర్థులైన పాలక వైఎస్సార్సీపీ, విపక్ష టీడీపీలూ కారణమే! ‘ఈ సర్కారు మళ్లీ రాదు, ఎప్పుడు దింపేద్దామా? అని రాష్ట్ర ప్రజానీకం కసితో ఎదిరిచూస్తున్నార’ని టీడీపీ నిత్యజపం చేస్తోంది. ‘ఈసారి 175 సీట్లలో గెలవాలి, గెలుస్తాం’ అని సాక్షాత్తూ సీఎంతో సహా అధికారపక్షం నిరంతర ఎన్నికల రాగాలాపన అందుకుంది.

మిగతా రాజకీయ పక్షాల్లో జాతీయ పార్టీలయిన కాంగ్రెస్‌, బీజేపీలతోపాటు కమ్యూనిస్టులు, ఉప ప్రాంతీయ పార్టీ జనసేన రాష్ట్రంలో పరిస్థితుల్ని గమనిస్తున్నాయి. నాయకుడైన పవన్‌కల్యాణ్‌ దూకుడు కారణంగా జనసేన ఒకింత క్రియాశీలమవుతూ వస్తోంది. దానివల్ల... ఈ సారి టీడీపీ, జనసేన కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కానీ కలిసి పోటీచేస్తాయేమో? అన్న చర్చ తరచూ తెరపైకి వస్తోంది.

సమకాలీన రాజకీయాల్లో పొత్తులు సాధాణ విషయమే అయినా... పొత్తులు ఫలించడం, వికటించడం అన్నది అంత తేలిగ్గా అర్థం కాని ఓ బ్రహ్మపదార్థమే! అందుకు అనేక కారణాలున్నాయి. అన్ని కాలాల్లోను పొత్తులకూ స్వరూప స్వభావాలు, శాస్త్రీయత, ప్రోటోకాల్‌ వగైరా వగైరా ఉన్నాయి. అవి సమగ్రంగా అర్థమయితే తప్ప రాజకీయ పార్టీల మధ్య విజయవంతమైన పొత్తు పొడవదు. పొత్తులు కుదిరి కూటమి ఏర్పడటంతోనే సరిపోదు.

రెండు, అంతకు మించి రాజకీయ పార్టీల మధ్య బయటకు కనిపించే ఫిజిక్స్‌ మాత్రమే కాదు, అంతర్లీనమైన కెమిస్ట్రీ కూడా కలవాలి. సదరు వాస్తవాన్ని ఆయా పార్టీలు గ్రహించి, అందుకనుగుణంగా నడుచుకుంటే తప్ప పొత్తు తాలూకు ఫలితం వారికి దక్కదు. అది గ్రహించడమే రాష్ట్రంలోని పాలక, విపక్ష పార్టీల ముందున్న ప్రధాన కర్తవ్యం.

ధీమాకు ముందు గ్రహింపే ముఖ్యం

‘మా విజయం నల్లేరుపై బండి నడక’ అనే ధీమాతో ఉండేంత సానుకూల పరిస్థితి ఏపీలో పాలక వైఎస్సార్సీపీకి లేదు. రాష్ట్రంలో విపక్షాల పొత్తులేం ఉడకవు అన్న అతి విశ్వాసం కూడా వారికి పనికిరాదు. పాలకులెప్పుడూ తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అధికార పీఠం చుట్టూ కేంద్రీకృతమయ్యే సమాచారం రంగు, రుచి, వాసన ఎవరికి తెలియదు? చుట్టూ చేరే వారు, నిజం కన్నా రాజుకు నచ్చేదే చెబుతారన్నది యుగాలుగా ఆచరణలో ఉన్న సత్యం!

ప్రజాక్షేత్రంలో వాస్తవ పరిస్థితులు, సగటు జనాభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం పాలకులకు ఉంటుంది. రాజకీయ సమీకరణాలెలా మారుతున్నాయి, ప్రత్యర్థి పార్టీల స్థితిగతులెలా ఉన్నాయో వాస్తవికంగా తెలుసుకోవడం వారికి కనీస కర్తవ్యం అవుతుంది. వాడే పరికరం, యంత్రాంగం, ఎంచుకునే మార్గం ఏదైనా... వాస్తవ సమాచారం తెప్పించుకోవడం ముఖ్యం. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా కిందటి ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠం నేర్చుకొని, తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంటుంది.

తాము పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నట్టే ప్రజలు వారంతట వారే ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపేసి, గద్దె మీద తమను కూర్చోబెడతారనే అతి విశ్వాసం వారికీ పనికిరాదు. ఒంటరిగా ఎదుర్కోవడమా? కలిసివచ్చే శక్తులతో బలం పెంచుకోవడమా? అన్నది వాస్తవికత ఆధాంగా టీడీపీ తేల్చుకోవాలి. ఒక్క జనసేనతోనే పొత్తా, జనసేనతో పాటు బీజేపీతోనూ జట్టు కట్టి పాలక వైసీపీని ఢీకొట్టడమా? అందుకు ఆయా పార్టీలు కలిసి వస్తాయా? ప్రస్తుతానికి ఇవన్నీ రాజకీయ ఊహాగానాలే! పార్టీలు ఏవైనా, వాటి అభీష్టాలు ఏమైనా... పొత్తంటూ పెట్టుకుంటే అది ఫలించడానికి కొన్ని కనీస పరిస్థితులు, ఎన్నో కొన్ని త్యాగాలు, ఇచ్చిపుచ్చుకునే దోరణులు, కనీస ఉమ్మడి కార్యక్రమం, పొత్తు ప్రతిపాదనకు జనామోదం వంటివి తప్పనిసరి.

ఒఠ్ఠి ఫిజిక్స్‌ మాత్రమే సరిపోదు...

ఎన్నికల ఫలితాలు ఒక రాజకీయ వాతావరణానికి పుట్టే ఉత్పత్తుల వంటివి. వాతావరణాన్ని ఎలా తయారు చేసి, వృద్ది చేస్తున్నారన్నదాన్ని బట్టి ఫలితాలుంటాయి. పొత్తులు అందులో భాగమే! ఓట్ల శాతాలు, సీట్ల వాటాలు, గెలిచాక అధికారం పంచుకునే అంగీకారాలు... ఇలా పొత్తు అంటే, బయట కుదుర్చుకునే పరస్పర భౌతిక ఒప్పందాలు మాత్రమే అంటే సరిపోదు.లోపల కెమిస్ట్రీ కలవాలి. పొత్తు పెట్టుకునే భాగస్వాముల మధ్య లక్ష్య సారూప్యత అవసరం. కనీస ఉమ్మడి కార్యక్రమం ఉండాలి. ఆయా పార్టీల శ్రేణులు అందుకు మానసికంగా సంసిద్దపడాలి. కార్యకర్తల సయోధ్యతో పాటు ఒకరికొకరి ఓటు బదిలీ జరగాలి. ఇచ్చిపుచ్చుకునే దోరణితో పరస్పర త్యాగాలకు సిద్దపడాలి. స్థూలంగా ప్రజల ఆకాంక్ష, ఆమోదం లభించాలి. ఇవి అన్నీనో, ఇందులో కోన్నో లేకుండా పొత్తులు పొడవవు, పొడిచినా ఫలించవు.

ఉదాహరణకి... 2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో జరిగిన విపక్షాల పొత్తుల్లో ఇవన్నీ కుదిరినందునే సానుకూలంగా ఫలితాలు లభించాయి. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌ పార్టీతో సహజ రాజకీయ వైరం ఉన్నప్పటికీ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 1999 నుంచి 2004 వరకు వారు కలిసి చేసిన ప్రజా ఉద్యమాలు సదరు పొత్తులకు ప్రాతిపదిక అయ్యాయి. ఉమ్మడి లక్ష్యం ఏర్పడింది. దానికి జనామోదం లభించింది.

2004-09 మధ్య కేంద్రంలో పనిచేసిన యూపీఏ-1 విజయవంతం కావడానికి, పొత్తు కుదిరిన భాగస్వాముల మధ్య ఏర్పడి, అమలైన కనీస ఉమ్మడి కార్యక్రమం ఎంతో దోహదపడింది. అందువల్లే, ఆ కాలంలో సమాచార హక్కు, గ్రామీణ ఉపాధి హామీ, కనీస వేతనాలు... ఇలా చాలా మంచి చట్టాలు వచ్చాయి.

అదే, 2009లో ఏపీలో టీడీపీతో కుదుర్చుకున్న విపక్ష పొత్తులు ‘మహా కూటమి’గా ఏర్పడ్డా, అంతర్గతంగా కెమిస్ట్రీ కుదరక, అంతిమంగా అది ఫలించలేదు. సానుకూల, ప్రతికూల కారణాలతోనే ఎన్నోమార్లు జాతీయ స్థాయిలోనూ పొత్తులు ఫలించడం, వికటించడం జరుగుతూ వస్తోంది.

సామాజికవర్గాల పరంగా సగానికి పైగా జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఎస్పీ- బీఎస్పీలు 2019 పార్లమెంటు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా కనీస ఉమ్మడి కార్యక్రమం లేక అది ఫలించలేదు. ఒకోసారి అంకెలు, సంకెల కన్నా ప్రధానంగా ఒక గెలుపు వాతావరణం సృష్టించేందుకు కూడా రాజకీయ పక్షాలు పొత్తులకు ఉబలాటపడతాయి.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో తనకు బలమైన ప్రజామద్దతు ఉన్నప్పటికీ, ఉందనే విశ్వాసం బీజేపీకి ఉన్నా, అప్నాదళ్‌ వంటి చిన్న పార్టీతో పొత్తు వెనుక వారి ఉద్దేశం అదే!

1983 లో తెలుగుదేశం పార్టీతో ప్రభంజనంలా దూసుకువచ్చిన ఎన్టీయార్‌, కమ్యూనిస్టులు కలిసి రాకుంటే, వెనుకాడకుండా ‘సంజయ్‌ విచార్‌ మంచ్‌’ వంటి చిన్న పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం ఇటువంటిదే!

అదే ఎన్టీరామారావు 1994లో, ఒంటరిగానే తిరిగి అధికారంలోకి వస్తానన్న ధీమా ఉన్నప్పటికీ, గెలుపు వాతావరణం పుట్టించేందుకే కమ్యూనిస్టులతో పొత్తు కుదుర్చుకొని కాంగ్రెస్‌ను 26/294 కు పరిమితం చేయగలిగారు.

రాజీతోనే రాజ(కీయ)బాటలు...

అర్థం తెలిసి అన్నారో, అందంగాఆకర్శణీయంగా ఉంటుందని చెప్పారో కానీ, ‘ఈ సారి విపక్షాల ఓట్లు చీలనివ్వను’ అని పవన్‌ కల్యాణ్‌ గంభీరంగా చెప్పారు ఒక సందర్భంలో!

ఉద్యమ కాలంలో ఎదిగిన ఓ ఉద్యమ పార్టీని అధికారం వచ్చాక ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి నడిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాజకీయవైఖరి..‘రాక్షసితోనైనా రాజీపడు, కానీ లొంగకు’ అన్న కారల్‌ మార్క్స్‌ మాటకు అచ్చంగా సరిపోతుంది. దానికి నిదర్శనమే... ముందు ప్రకటించినా, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకపోవడం.

ఇపుడు ఏపీలో టీడీపీ జనసేనల పొత్తు ప్రచారానికి ఓ నేపథ్యం ఉంది. అంకెల పరమైన గణిత శాస్త్రమే కాకుండా సామాజిక సమీకరణాల పరమైన సాంఫీుక శాస్త్రమూ ముఖ్యమే! వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రూపంలో ఉన్న బలమైన ప్రత్యర్థిని కొట్టడానికి బలసమీకరణ ఇప్పుడు టీడీపీ బాధ్యత.

2019 ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం, అంటే దాదాపు సగం ఓట్లు నికరంగా దక్కాయి. టీడీపీ‌కి 39.17 శాతం ఓట్లు రాగా జనసేన‌కు 5.53 శాతం ఓట్లు దక్కాయి. జనసేనకు లభించిన ఓటు శాతం, జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌ (1.17 శాతం), బీజేపీ (0.84 శాతం) ల కన్నా చాలా ఎక్కువ. గడచిన మూడున్నరేళ్లలో.. ప్రభుత్వ వైఫల్యాలు ఒకవైపు, తాము జరిపిన ప్రజాందోళనలు మరోవైపు తమకు జనాదరణ పెంచాయని టీడీపీ, జనసేన బలంగా విశ్వసిస్తున్నాయి.

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జనసేనకు మద్దతు ఇదివరకటి కన్నా మెరుగుపడ్డట్టు ఓ జనాభిప్రాయం ఉంది. విడిగానే, గెలుపోటములను ప్రభావితం చేయగలిగేంత యువశక్తి మద్దతు తమకుంటుందని జనసేన వర్గాలు చెప్పుకుంటాయి. పాలకావిపక్షాల మధ్య పోటీ నువ్వానేనా అన్నంత సమీపంగా వస్తే, అయిదారు వేల ఓట్లు లభించే నియోజకవర్గాలన్నింటా తప్పకుండా తుది ఫలితాల్ని జనసేన ప్రభావితం చేస్తుంది. అందుకే, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే రాజకీయంగా ఎంతో ప్రయోజనం అని ఉభయపక్షాలూ అంగీకరిస్తున్నాయి. కులపరమైన ప్రచారాలు తారాస్థాయికి చేరి కిందటి ఎన్నికల్లో కమ్మ, కమ్మ వ్యతిరేకులుగా వేర్వేరు కులాలు సమీకృతమయ్యాయనే పరిశీలన ఒకటుంది.

రెడ్డి సామాజికవర్గానికి ఎలాగూ వైసీపీ నేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తారనుకున్నా... మరో రెండు బలమైన సామాజిక వర్గాలు కమ్మ, కాపులను బలంగా సమీకరించుకునే అవకాశం, ప్రచారంలో ఉన్న పొత్తు కుదిరితే కూటమికి లభిస్తుంది.

ఏ మాటను జనం నమ్ముతారో...

జనామోదాన్ని బట్టే పొత్తుల విజయం ఉంటుంది. జనం ఎవరి మాటను నమ్ముతారన్న విశ్వసనీయతే రాజకీయ విజయానికి గీటురాయి. జనాన్ని ప్రలోభపెట్టడానికి డబ్బు, మద్యం వంటివి ఎంత విచ్ఛలవిడిగా పంపిణీ చేసినా, అంతిమంగా ఆయా పాజకీయ పార్టీలు, కూటములపైన, వారి మాటలపైన ఉండే విశ్వాసమే ప్రజానిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని ఎన్నిక రాజకీయాల్లో పలుమార్లు రుజువయింది. ‘ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది, జనం కోరుకునే ప్రత్యామ్నాయం మేం అందిస్తామ’ని విపక్షం విడి విడిగానో, పొత్తులు పొడిస్తే ఉమ్మడిగానో చెప్పుకోవాలి. ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టుకోవడంతో పాటు విపక్షాల అనైక్యతను సొమ్ము చేసుకోవడమో, కూటమిగా ఏర్పడితే సదరు పొత్తులు అపవిత్రమనో పాలకపక్షం ఎండగట్టాలి. అవే వారి ప్రచారాస్త్రాలవుతాయి. అప్పుడు ఎవరి మాటను జనం నమ్ముతారు? జనక్షేత్రంలో ఎవరి విశ్వసనీయత ఎంత? అన్నదాన్ని బట్టే ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయమవుతాయి.

వ్యాసకర్త: ఆర్.దిలీప్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి

(ఇక్కడ తెలియపరిచిన అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతమైనవి.)

ఆర్. దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
ఆర్. దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
IPL_Entry_Point