Pawan Kalyan : తెలుగు వారి సత్తా దిల్లీ వరకు చాటిన మహానేత ఎన్టీఆర్- పవన్ కల్యాణ్-janasena chief pawan kalyan pays tribute to ntr on centenary birthday celebrations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Janasena Chief Pawan Kalyan Pays Tribute To Ntr On Centenary Birthday Celebrations

Pawan Kalyan : తెలుగు వారి సత్తా దిల్లీ వరకు చాటిన మహానేత ఎన్టీఆర్- పవన్ కల్యాణ్

Bandaru Satyaprasad HT Telugu
May 28, 2023 11:39 AM IST

Pawan Kalyan : తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో దిల్లీ వరకు తెలుగు జాతి ఖ్యాతి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని పవన్ కల్యాణ్ అన్నారు. శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan : ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తు్న్నారు అభిమానులు. ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్నారు నేతలు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్‌ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు అంజలి ఘటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. చరిత మరువని నటనా కౌశలం, తెలుగు నుడికారంపై మమకారం, పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం ఇలా మాట్లాడుకుంటే గుర్తొచ్చే వచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు అని పవన్ అన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రారంభించిన రూ.2 లకే కిలో బియ్యం పథకం ఎందరికో అనుసరణీయమైందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

తెలుగు వారి సత్తా దిల్లీ దాకా చాటారు

దిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న సమయంలో తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఎన్టీఆర్ ఎన్నికల బరిలో నిలిచారని పవన్ గుర్తుచేసుకున్నారు. అఖండ విజయం సాధించి తెలుగువారి సత్తా గల్లీ నుంచి దిల్లీ దాకా చాటారన్నారు. అటు సినిమా ఇటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌ తెలుగు బిడ్డగా జన్మించడం అందరికీ గర్వకారణం అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి నాడు ఆ మహనీయుడికి జనసేన తరఫున, తన నీరాజనాలు అర్పిస్తున్నానని పవన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మానవతావాది ఎన్టీఆర్ - చంద్రబాబు

అధికారానికి సరైన నిర్వచనం మానవసేవే అని నమ్మి, ఆచరించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పేదరికం విధిరాత కాదని, పాలనా లోపమని, చిత్తశుద్ధి ఉంటే పేదరిక నిర్మూలన సాధ్యమే అని తన సంక్షేమ పాలనతో నిరూపించిన అసలు సిసలైన మానవతావాది ఎన్టీఆర్ అన్నారు. అటువంటి మహామనీషి మన తెలుగు నేలపై కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా నిలిచి వెలగడం తెలుగువారి అదృష్టం అనితెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి వేళ ఆ మహానుభావుని ఆశయాలను స్మరించుకుందామన్నారు.

నూటికో కోటికో ఒక్కరు- చిరంజీవి

నూటికో కోటికో ఒక్కరు... వందేళ్లు కాదు...చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారని, చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుందని, అలాంటి కారణ జన్ముడు ఎన్టీఆర్ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావుతో అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం అని తెలిపారు. ఎన్టీ రామారావు శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నానన్నారు.

IPL_Entry_Point