TRS MLA's Trap: రూ. 400 కోట్ల డీల్, 4 రోజుల ముందే స్కెచ్.. తెరవెనక జరిగింది ఇదే!-what happened behind the trap of four trs mlas ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  What Happened Behind The Trap Of Four Trs Mlas

TRS MLA's Trap: రూ. 400 కోట్ల డీల్, 4 రోజుల ముందే స్కెచ్.. తెరవెనక జరిగింది ఇదే!

HT Telugu Desk HT Telugu
Oct 27, 2022 09:40 AM IST

Telangana MLA's Trap Case: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా బేరసారాల కథ వెలుగులోకి వచ్చింది. వంద కోట్ల ఆఫర్ తో చేపట్టిన ఆపరేషన్ ను పోలీసులు భగ్నం చేయటం అధికార టీఆర్ఎస్ తో పాటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగినట్లు స్పష్టమవుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్... ఏం జరిగిందంటే...?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్... ఏం జరిగిందంటే...?

Four TRS MLA's Trap Case: టార్గెట్ నలుగురు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... ఒక్కో తలకు రూ. 100 కోట్లు..! మొత్తం డీల్ రూ. 400 కోట్లు..! ప్లాన్ సిద్ధం అయింది.. ఇక అమలు చేసే దిశగా పావులు కదిపింది ఢిల్లీకి చెందిన ఓ బృందం. సీన్ కట్ చేస్తే హైదరాబాద్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కుట్రను తమదైన స్టైల్ లో భగ్నం చేశారు. కూపీ లాగేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ పరిణామాల వెనక పెద్ద తతంగమే నడిచినట్లు తెలుస్తోంది. ఓ ప్లాన్ ప్రకారమే ఫాంహౌస్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. అసలు ఈ వ్యవహరమంతా ఎలా జరిగిందో చూస్తే....

ఏం జరిగిందంటే...

కొనుగోలు సూత్రదారులను పక్కా ప్లానింగ్‌తో పట్టుకోవడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. మునుగోడు బైపోల్ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు అధికార TRS పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారనే విషయం టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం దృష్టికి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన గూలాబీ నాయకత్వం... పలువురు ఎమ్మెల్యేలపై నిఘా పెట్టింది. ఇదే సమయంలో కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పెద్దస్థాయిలో ఆఫర్లు వచ్చాయి. భారీగా డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ ప్రలోభపెట్టారు. అయితే ఈ విషయాన్ని సదరు ఎమ్మెల్యేలు... పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

పక్కా ప్లాన్….

ఎమ్మెల్యేల సమాచారంతో అప్రమత్తమైన కేసీఆర్... కుట్ర విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... పక్కాగా ప్లాన్ చేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్ర భారతీ, తిరుపతికి చెందిన సింహాయాజీ స్వామీజీతో పాటు హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను మొయినాబాద్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌లో గల తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ కు రప్పించారు. అక్కడ ముందుగానే సీక్రెట్‌ కెమెరాలను అమర్చారు. డబ్బు లెక్కించే మెషీన్లు ముందుగానే సిద్ధం చేశారు. పంచనామా కోసం ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను అందుబాటులో ఉంచేశారు. ఈ వ్యవహారాన్ని గోప్యంగా చిత్రీకరించారు. దాదాపు గంటన్నరపాటు ఈ చిత్రీకరణ జరిగింది. ఆ తర్వాత పూర్తి ఆధారాలతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నగదు ఎంతవరకు పట్టుబడిందనే దానిపై ఓ క్లారిటీ రాలేదు. దీనిపై పోలీసులు కూడా స్పష్టమైన ప్రకటన చేయలేదు.

సూత్రదారులను అరెస్ట్ చేసిన తర్వాత... ఎమ్మెల్యేలు బయటికి వచ్చారు. రాత్రి 9.30 దాటిన తర్వాత ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి. రేగా కాంతారావు తమ వాహనాల్లో నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. రోహిత్‌రెడ్డి మాత్రం ఆలస్యంగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. పట్టుబడిన వారిని రాత్రి దాటిన తర్వాత పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసివచ్చింది. వీరిని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే దిశగా జరిగిన ఈ పరిణామంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే విచారణలో ఎవరి పేర్లు బయటికివస్తాయి..? అసలు సూత్రదారులు ఎవరు..? కథ అంతా ఎక్కడి నుండి నడిచింది..? ఇంకా ఎవరైనా అరెస్ట్ అవుతారా..? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

IPL_Entry_Point