Rain Alert Telugu States: మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
IMD Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ అయింది.
weather updates of telugu states: తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు మళ్లింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఫలితంగా ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ జిల్లాలకు హెచ్చరికలు...
మరో రెండు రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలోనూ వర్షాలు...
ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
సంబంధిత కథనం