TSRTC DA : ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. మరో విడత డీఏ చెల్లింపు-tsrtc announces da arrears for its employees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tsrtc Announces Da Arrears For Its Employees

TSRTC DA : ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు.. మరో విడత డీఏ చెల్లింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 01, 2023 03:48 PM IST

TSRTC Latest News: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది.

టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

TSRTC DA Arrears: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు సంస్థ తీపికబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు.

‘‘తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది.’’ అని వివరించారు.

‘హైదరాబాద్ దర్శన్’ ప్యాకేజీ…

గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. మరోవైపు పక్క రాష్ట్రాలకు కూడా సరికొత్త సర్వీసులను నడుపుతోంది. తాజాగానే రూట్ పాస్ సర్వీస్ ను తీసుకురాగా... మరో వినూత్న నిర్ణయాన్ని ప్రకటించింది. హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్రాంతాలన్నీ చూసేలా సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ఈ ప్యాకేజీ లో భాగంగా కేవలం 12 గంటల్లో హైదరాబాద్‌లోని టూరిస్ట్ ప్రాంతాలను చూడొచ్చు. ఏసీ, నాన్ ఏసీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. శని, ఆదివారాల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఉదయం 8గంటల 30నిమిషాల నుంచి రాత్రి 8గంటల 30నిమిషాల వరకు నగరంలోని పలు సందర్శనా స్థలాలను చూపిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర్లోని అల్పా హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. బిర్లామందిర్, గోల్కొండ, తారామతి, బారాదారి, చౌమొహల్లా ప్యాలెస్, చార్మినార్, లుంబినీ పార్కు ప్రాంతాలకు తీసుకెళ్తోంది. గైడ్ లు కూడా అందుబాటులో ఉంటారు. ఇక కాలనీలో 25మంది అంతకంటే ఎక్కువ ఉంటే బస్సును నేరుగా కాలనీకే పంపిస్తారు. www.tsrtconline.in వెబ్ సైట్ లో హైదరాబాద్ దర్శన్ టికెట్టు బుక్ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణాలు చేసే వారికి సరికొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. కొత్తగా ‘జనరల్ రూట్ పాస్’కు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా ‘జనరల్ రూట్ పాస్’కు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోన్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ రూట్ పాస్ కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్ పాస్ కు రూ.600గా, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 గా ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదటగా హైదరాబాద్ లోని 162 రూట్లలో ఈ పాస్ ను ప్రయాణికులకు ఇవ్వనుంది. ఈ రూట్ పాస్ దారులు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లైన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలువు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్ తో ప్రయాణించవచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం