TSPSC Exams : ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్... ఈ పరీక్షల తేదీల్లో మార్పులు
TSPSC Latest News:పలు పోస్టుల నియామక పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నిర్ణయించిన తేదీలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
TSPSC Rescheduled Polytechnic Lecturer Exam:టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.... మరిన్ని విషయాలను బయటికి లాగే పనిలో పడింది. దాదాపు 22 మందికిపైగా అరెస్ట్ చేసింది. మరోవైపు ఈడీ కూడా విచారిస్తోంది. భారీగా నగదు చేతులు మారినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఇదిలా ఉంటే పరీక్షల తేదీలపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు పరీక్షల తేదీలను కూడా ప్రకటించగా... తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. పలు పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
రీషెడ్యూల్ తేదీలివే...
ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షను తిరిగి సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్షను కూడా రీషెడ్యూల్ చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ ఎగ్జామ్ ను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
సిట్ దర్యాప్తు ముమ్మరం…
TSPSC Paper Leak: సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో నగదు లావాదేవీలపై సిట్ దృష్టిసారించింది. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగిటనట్టు గుర్తించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుల మధ్య రూ.33.4 లక్షలు చేతులు మారినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఈ కేసులో కొందరు ప్రశ్నాపత్రాలను విక్రయించి నగదు తీసుకుంటే, మరికొందరు బ్యాంకు ఖాతాలలోకి బదిలీ చేయించుకున్నట్లు గుర్తించారు. మరోవైపు పేపర్ల లీకేజీ వ్యవహారంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ కుమార్, అతని సోదరుడు రవికుమార్‌ను సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. తన తమ్ముడు రవికుమార్ కోసం డాక్యా నాయక్ నుంచి భవంత్ కుమార్ ఏఈ పేపర్‌ను కొనుగోలు చేశాడు. ఏఈ పేపర్ కోసం డాక్యా నాయక్ రూ.2 లక్షలు అడగగా...భగవంత్ కుమార్ రూ.1.75 లక్షలు ఇచ్చారు. డాక్యా నాయక్ బ్యాంక్ లావాదేవీలను సిట్ అధికారులు పరిశీలించగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో భగవంత్ రావు, అతడి సోదరుడు రవికుమార్ ను సిట్ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తన తమ్ముడు రవికుమార్ కోసమే పేపర్ కొనుగోలు చేసినట్లు భగవంత్ కుమార్ ఒప్పుకున్నట్లు సమాచారం. వీరి అరెస్ట్‌తో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 22కు చేరింది.