CM KCR : వరంగల్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభించిన సిఎం కేసీఆర్-ts cm kcr inaugurated new medical college in warrangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Cm Kcr Inaugurated New Medical College In Warrangal

CM KCR : వరంగల్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభించిన సిఎం కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Oct 01, 2022 12:25 PM IST

CM KCR సమీప భవిష్యత్తులోనే తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తామని సిఎం కేసీఆర్ చెప్పారు. వరంగల్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. జిల్లాలో కొత్తగా నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ, క్యాన్సర్ ఆస్పత్రిని సిఎం ప్రారంభించారు. ఎన్నో త్యాగాలు, ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని కేసీఆర్‌ విద్యార్ధులకు పిలుపునిచ్చారు. దేశంలో ప్రజల మధ్య చీలిక తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు.

తెలంగాణ సిఎం కేసీఆర్
తెలంగాణ సిఎం కేసీఆర్

CM KCR ఏ దేశమైనా, సమాజమైనా చుట్టూ జరిగే పరిణామాలు గమనించి అందుకు తగ్గట్టుగా అప్రమత్తంగా ఉంటేనే అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అనుభవించిన కష్టాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రాన్ని కోల్పోయి అస్తిత్వాన్ని నిలుపుకోడానికి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చిందన్నారు. 2001లో ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు.

నవీన సమాచార విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అటంకాలు లేకుండా సమాచారం అందరికి చేరిపోతోందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌ స్థానంలో ఉందన్నారు.

రాజకీయ విమర్శలతో సంబంధం లేకుండా తెలంగాణ పురోగతి సాధించిందని, దేశంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందని, ముంబై కంటే జిఎస్‌డిపి వృద్ధి తెలంగాణలో ఎక్కువని, ఆర్ధికాభివృద్దిలో సైతం తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణలో రాష్ట్రాన్ని విమర్శించే కేంద్ర మంత్రులు ఢిల్లీలో అవార్డులు అందిస్తారని చెప్పారు.

తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యం వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధించ గలుగుతున్నట్లు చెప్పారు. తెలంగాణలోని 33జిల్లాల్లో జిల్లాకో మెడికల్ కాలేజీ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 2014 ముందు తెెలంగాణలో 2800 మెడికల్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు 6500 మెడికల్ సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని కాలేజీలు అందుబాటులోకి వస్తే 10వేల సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అప్పుడు రష్యా, చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం విద్యార్ధులకు ఉండదన్నారు.

పీజీ మెడికల్ సీట్లలో 1150 సీట్లు గతంలో ఉంటే ఇప్పుడు 2500 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని అన్ని రంగాల్లో పురోగమిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

మనకంటే 3రెట్లు విస్తీర్ణంలో పెద్దగా ఉన్న అమెరికాలో 28శాతం మాత్రమే వ్యవసాయ భూమి ఉందని, చైనాలో 16శాతం వ్యవసాయ భూమి ఉంటే భారత దేశంలో 50శాతం వ్యవసాయానికి అనువైన భూమి ఉందని కేసీఆర్ చెప్పారు. దేశంలో భూమి విస్తీర్ణం 83కోట్ల ఎకరాలైతే 41కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా ఉన్నాయని, 70వేలకు పైగా టిఎంసిల నీటి లభ్యత దేశంలో ఉందని చెప్పారు. దేశంలో ఉన్నన్ని వనరులు వేరే ఏ దేశంలోను లేవని కేసీఆర్‌ చెప్పారు. వాటిని సద్వినియోగం చేసే సమర్ధ నాయకత్వం అవసరమన్నారు.

దేశంలో అపార అవకాశాలు ఉన్నావాటిని సద్వినియోగం చేసుకోవడంలో వెనుకబడి పోతున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఏమి జరుగుతుందో అంతా గమనించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో గొప్ప సహనశీలత ఉందని, అందరిని కలుపుకుపోయే దేశంలో, కొద్ది మంది విషబీజాలు నాటే కుట్రలు చేస్తున్నారని, దేశాన్ని నిలువున విడదీసే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని కేసీఆర్ సూచించారు. తన వయసు 68ఏళ్లు దాటాయని, యువతరం ముందుకు వచ్చి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని చెప్పారు.

వరంగల్ ములుగు, కరీం నగర్ సిరిసిల్ల జిల్లాల ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఒక్కి మౌస్ క్లిక్‌తో వారి పూర్తి వివరాలు కంప్యూటర్ మీద ప్రత్యక్షమవుతాయన్నారు. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లా ప్రజలకు హైదరాబాద్‌ రావాల్సిన అవసరం ఉండదని కాకతీయ మెడికల్‌ కాలేజీ, జైలును కలిపి వరంగల్ మెడికల్ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు కొత్త నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 2వేల పడకలతో 24అంతస్తులతో మెడికల్ సిటీ నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. నిర్మాణం పూర్తయ్యాక వరంగల్ ప్రజలు హైదరాబాద్‌ రావాల్సిన అవసరం లేదని, హైదరాబాద్‌ నుంచి వరంగల్ వస్తారని చెప్పారు. సమాజం చైతన్య వంతంగా ఉంటే అభివృద్ధి వేగంగా సాధించవచ్చనికేసీఆర్ చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్