Palamur Rangareddy Lift: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం-the central government has granted environmental clearances to the palamuru ranga reddy project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  The Central Government Has Granted Environmental Clearances To The Palamuru-ranga Reddy Project

Palamur Rangareddy Lift: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం

HT Telugu Desk HT Telugu
Aug 11, 2023 07:51 AM IST

Palamur Rangareddy Lift: పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న కరవుకాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజే దగ్గర్లోనే ఉన్నాయి. బీడు భూముల్ని తడుపుకుంటూ కృష్ణమ్మ బిరబిరా తరలి రానుంది. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు

Palamur Rangareddy Lift: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ కీలక పురోగతి సాధించింది. పాలమూరు జిల్లా వాసుల దశాబ్దాల కలను సాకారం చేసే తీపి కబురు కేంద్రం నుంచి అందింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ కేంద్ర జల్‌శక్తిశాఖకు సిఫారసు చేసింది. దీంతో అనుమతుల మంజూరు లాంఛనం కానుంది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈఏసీ సభ్యులు రకరకాల సందేహాలను లేవనెత్తుతుండటంతో అనుమతుల్ని వాయిదా వేస్తూ వచ్చారు.

ఒక దశలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను తిరస్కరించి ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కన పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం పట్టువిడవకుండా ఈఏసీ కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించింది. దీంతో ఎట్టకేలకు ఈ ఏడాది జూన్‌ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కూడా ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు. గత నెల 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి తెలంగాణ సర్కారు తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను బలంగా నొక్కి చెప్పారు. ప్రాజెక్టుకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని ఈఏసీకి తెలంగాణ సర్కారు గతంలో విజ్ఞప్తి చేసింది. మరోవైపు ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనాలను సమర్పించాలని ఈఏసీ గతంలో తెలంగాణకు సూచించింది.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఇరిగేషన్‌ అధికారులు పర్యావరణ ప్రభావానికి సంబంధించిన నివేదికలను ఈఏసీకి అందజేశారు. వాటన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది.

ఇది చారిత్రక విజయం..కేసీఆర్

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను ఇవ్వడానికి ఈఏసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పథకం తొలిదశ పనులు తుదిదశకు చేరుకున్న తరుణంలో పర్యావరణ అనుమతులు సైతం మంజూరు కానుండడంపై ఆనందం వ్యక్తం చేశారు.

పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండవ దశ పనులు కూడా చకచకా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో కేసులను ఎదుర్కొని, మరెన్నో అడ్డంకులను అధిగమించి, పోరాడి అనుమతులు సాధించామని, ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని సిఎం తెలిపారు.

ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకుందని తెలిపారు. ఇది తెలంగాణ సర్కారు సంకల్పానికి మరో నిలువెత్తు నిదర్శమని సిఎం వివరించారు. కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు ఆసన్నమైందని,పాలమూరుకు పర్యావరణ అనుమతుల సాధనకు కృషి చేసిన సాగునీటి శాఖ ఇంజినీరింగ్‌ అధికారులను సిఎం కేసీఆర్ అభినందించారు.

IPL_Entry_Point