Telangana Early Elections ? : మరోసారి ముందస్తు ముచ్చట.. ఈ సారి అంత ఈజీ కాదా.. ?-telangana opposition parties predicts early elections in telangana interesting is what will kcr do ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Early Elections ? : మరోసారి ముందస్తు ముచ్చట.. ఈ సారి అంత ఈజీ కాదా.. ?

Telangana Early Elections ? : మరోసారి ముందస్తు ముచ్చట.. ఈ సారి అంత ఈజీ కాదా.. ?

Thiru Chilukuri HT Telugu
Jan 21, 2023 02:12 PM IST

Telangana Early Elections ? : ముందస్తు ఎన్నికలపై రాష్ట్రంలో మరోసారి చర్చ మొదలైంది. ఏ క్షణమైనా కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. తామూ సిద్ధమని ప్రకటిస్తున్నాయి. బీఆర్ఎస్ వ్యూహాలకు ధీటుగా... కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్ పెట్టాయి. అయితే.. 2018లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా ?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చ
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చ

Telangana Early Elections ? : రాష్ట్రంలో మరోసారి ముందస్తు ముచ్చట మొదలైంది. 2018 తరహాలోనే ఈ సారి కూడా ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి.. బీఆర్ఎస్ ఎన్నికలకు వెళుతుందనే చర్చ ఊపందుకుంది. కేబినెట్ తీర్మానంతో అసెంబ్లీని రద్దు చేయాలా ? లేక ఆరు నెలల్లోగా అసెంబ్లీని సమావేశపరచకుండా టెక్నికల్ గా రద్దయ్యేలా చేయాలా ? అనే విషయంపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 13న వానాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమయినా... బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించే పనిలో కేసీఆర్ నిమగ్నం కావటంతో... కుదరలేదన్న టాక్ వినిపించింది. దీంతో... అసెంబ్లీ సమావేశాలు ఆరు నెలల్లోపు నిర్వహించాలన్న గడువు .. మార్చి 15తో ముగుస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అసెంబ్లీ సెషన్స్ నిర్వహణపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రకటించిన తర్వాత.. రాష్ట్ర సర్కార్ నుంచి కూడా క్లారిటీ వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక వేళ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అదే స్తబ్దత కొనసాగిస్తే మాత్రం... ముందస్తు ఊహాగానాలు మరింత బలపడతాయి.

కేసీఆర్ ఆలోచనలు ఏంటో, ఆయన మదిలో ఏముందో ఊహించడం కష్టం. అయితే.. ఇటీవలి కాలంలో ఆయన వేస్తున్న అడుగుల ఆధారంగా వ్యూహాలను అంచనా వేస్తోన్న విపక్షాలు.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యం అని గట్టిగా చెబుతున్నాయి. నిర్ణీత సమయం ప్రకారం అయితే.. ఈ ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అయితే.. విపక్షాలు పూర్తిగా బలం కూడగట్టుకోకముందే.. ఎన్నికల సమరానికి శంఖారావం పూరించాలన్నది కేసీఆర్ ప్లాన్ గా ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ల నుంచి ఈ తరహా అంచనాలే వ్యక్తం అయ్యాయి. గులాబీ దళపతి ప్రణాళికలను పసిగట్టామని.. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి తామూ సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే... ఇన్నాళ్లుగా లోపించిన ఐక్యతను తిరిగి సాధించి... కలిసికట్టుగా సాగే దిశగా కాంగ్రెస్ లో అడుగులు పడుతున్నాయి. ముందే అభ్యర్థులను ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తద్వారా అధికార పార్టీని బలంగా ఢీకొట్టే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు.. కేసీఆర్ ఆలోచనలను ముందే ఊహించామంటున్న బీజేపీ... రాష్ట్రంలో మరింత దూకుడు పెంచింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా... ఆ పార్టీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా.. జనవరి 28, 29 తేదీల్లో కేంద్ర మంత్రి అమిత్ షా.. రాష్ట్రంలో పర్యటించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ టూర్ కూడా ఖారారైంది. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మిషన్ తెలంగాణలో భాగంగానే.. బీజేపీ పెద్దల పర్యటనలను రాష్ట్రంలో ఖరారు చేశారనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ఏ సమయంలో ఎన్నికలకు వెళ్లినా.. ధీటుగా ఎదుర్కొనే విధంగా క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు.. రానున్న రోజుల్లో మరిన్ని సభలు, సమావేశాలు జరుగుతాయని.. వీటికి అధిష్టాన పెద్దలు హాజరవుతారని కాషాయ నేతలు చెబుతున్నారు.

ప్రతిపక్షాల అంచనాలు.. అందుకు అనుగుణంగా సన్నద్ధత ఎలా ఉన్నా.. అసలు కేసీఆర్ మదిలో ఏముందన్నదే పెద్ద ప్రశ్న ? ముందస్తు ఎన్నికల కోసమే ఇటీవల కేసీఆర్ పరిపాలనా పరమైన కార్యక్రమాల్లో వేగం పెంచారని... భారీ స్థాయిలో కంటి వెలుగు... నాలుగేళ్ల తర్వాత ఉపాధ్యాయ బదిలీలు.. ఏడున్నరేళ్ల తర్వాత టీచర్ల ప్రమోషన్లు... ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవం... వేగంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాల ఓపెనింగ్స్... వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు... తదితర ప్రోగ్రామ్స్ అన్నీ అందులో భాగమే అనే టాక్ వినిపిస్తోంది. ఆయా కార్యక్రమాలతో ఎలక్షన్ గ్రౌండ్ లో అనుకూల వాతావరణం సృష్టిస్తున్నారనే చర్చ నడుస్తోంది. అయితే... కేవలం వీటి ఆధారంగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారా ? అని చెప్పడం కష్టమే. ఎందుకంటే.. 2018లో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు.. ఇప్పుడు లేవనేది మరో వాదన.

గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే నాటికి సీఎం కేసీఆర్ నాడు ఇచ్చిన హామీలను దాదాపుగా పూర్తి చేశారు. కొత్తగా రైతు బంధు ప్రకటించి.. తిరుగులేని మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే.. రెండో టర్మ్ లో కొన్ని హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా రూ. లక్ష రైతు రుణ మాఫీ పూర్తి కాలేదని... నిరుద్యోగ భృతి ఊసే లేదనే ఆరోపణలు ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఆశించిన స్థాయిలో సాగడం లేదు అని... సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించని విషయాన్నీ ప్రస్తావిస్తున్నారు. ఇన్నాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులు... కేవలం నోటిఫికేషన్లతో శాంతించే పరిస్థితి లేదని... నియామక ప్రక్రియ పూర్తి చేసి.. అపాయింట్మెంట్స్ ఇస్తేనే.. బీఆర్ఎస్ సర్కార్ ని పూర్తిగా విశ్వసిస్తారనే వాదనా వినిపిస్తోంది. దళితబంధు పథకంలోనూ ఆరంభశూరత్వమే కనిపిస్తోందని.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ అందిస్తామన్న హామీ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గిరిజన బంధు కూడా ఇస్తామని ఇటీవల ప్రకటించిన సర్కార్.. ఆ దిశగా ఎలాంటి కసరత్తు చేయడం లేదనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో... ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళితే.. గతంలోలా అన్ని పూర్తి చేశామని కేసీఆర్ ప్రకటించే అవకాశాలు లేవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మొత్తం మీద.. మరోసారి మొదలైన ముందస్తు ముచ్చట .. గతంలో మాదిరిగా కొన్నిరోజులకి సైలెంట్ అవుతుందా.. ? లేక ఊహాగానాలు మరింత బలపడేలా కేసీఆర్ అడుగులు ఉండనున్నాయా ? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

IPL_Entry_Point