TSRTC Bill : టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీ ఇస్తామన్న కేసీఆర్
TSRTC Bill : టీఎస్ఆర్టీసీ బిల్లును మంత్రి పువ్వాడ అజయ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
TSRTC Bill : తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. గవర్నర్ తమిళిసై ఆమోదంతో ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుపై చర్చ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల బకాయిలను చెల్లిస్తామని, ఆర్టీసీ కార్పొరేషన్, ఆస్తులు అలాగే ఉంటాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించి అనంతరం పదవి విరమణ ప్రయోజనాలు నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. బిల్లు ఆమోదంతో టీఎస్ఆర్టీసీ 43,055 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని చెప్పారు. అయితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఆర్టీసీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కొనసాగుతారని మంత్రి పువ్వాడ అజయ్ తెలియజేశారు.
ప్రతి ఏడాది రూ.3 వేల కోట్ల భారం
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం శాసనసభలో టీఎస్ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఈ బిల్లును ప్రవేశపెడుతూ తీర్మానం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఖజానాపై ప్రతి ఏడాది రూ.3000 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి తెలిపారు. ఆర్టీసీ బిల్లుపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. గవర్నర్ ఈ విషాయాన్ని అనవసరంగా వివాదం చేశారన్నారు. ఆర్టీసీ కాలక్రమంలో నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. తాను రవాణాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆర్టీసీ రూ.14 కోట్ల నష్టాల్లో ఉండేదన్నారు. ఆ నష్టాన్ని తగ్గించి మరో రూ.14 కోట్ల ఆదాయం తెచ్చామన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీకి భారంగా మారిందన్నారు. ఆర్టీసీలో రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ పరిస్థితిపై కేబినెట్‌లో 5 గంటలకు పైగా చర్చించామన్న సీఎం... చివరికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించామన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులుక పీఆర్సీ
ఆర్టీసీలో యువ ఐఏఎస్ ఆఫీసర్లను నియమించి గాడిలో పెడతామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొందరు ఆరోపిస్తున్నారని, అది పూర్తిగా అవాస్తవం అన్నారు. ప్రభుత్వ పరంగా ఆర్టీసీని మరింత అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పీఆర్‌సీ ఇస్తామని ప్రకటించారు. వీరందరికీ ఉద్యోగ భద్రత వస్తుందన్నారు. గవర్నర్ పనిపెట్టుకొని 96 వివరణలు అడిగారన్నారు. చివరికి గవర్నర్ జ్ఞానోదయమై ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపారన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన, తన పక్షాన గవర్నర్ కు ధన్యవాదాలు అని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. సభను మరో రెండ్రోజులు పొడిగిస్తారని వార్తలు వచ్చినా... ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందడంతో సభను వాయిదావేశారు.