TS Assembly : త్వరలో 1540 ఆశా పోస్టుల భర్తీ... 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్-telangana assembly sessions govt on intergrated markets and basti dawakhana and asha worker posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly : త్వరలో 1540 ఆశా పోస్టుల భర్తీ... 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్

TS Assembly : త్వరలో 1540 ఆశా పోస్టుల భర్తీ... 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్

HT Telugu Desk HT Telugu
Feb 12, 2023 03:19 PM IST

TS Assembly : శాస్త్రీయ విధానంలో.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్.... త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో 1540 ఆశా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు.

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

TS Assembly : శాస్త్రీయ విధానంలో.. అన్ని సౌకర్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో అధునాతన మార్కెట్లకు శ్రీకారం చుట్టామని... హైజెనిక్ గా వెజ్, నాన్ వెజ్ అమ్మకాలు జరిగే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లను చూసి ఇతర రాష్ట్రాల అధికారులు స్ఫూర్తి పొందుతున్నారని తెలిపారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా... పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో సరిపడా మార్కెట్లు లేవని... ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్తవి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించామని అన్నారు.

నిజాం కాలంలో మోండా మార్కెట్ శాస్త్రీయతతో ఏర్పాటైందన్న సీఎం కేసీఆర్... పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వెంటిలేషన్ తదితర అంశాలు సమగ్రంగా మార్కెట్ నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కనీస సౌకర్యాల అంశాన్ని విస్మరించాయని.. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు ఏర్పడ్డాయని చెప్పారు. నేలపై కూరగాయలు పెట్టి విక్రయిస్తే .. ప్రమాదకర బ్యాక్టీరియా ముప్పు ఉంటుందని... అలా కాకుండా భూమికి 3 ఫీట్ల ఎత్తులో ఉంచి విక్రయిస్తే మేలని అన్నారు. మోండా మార్కెట్ లో ఈ విధంగా ఏర్పాట్లు ఉన్నాయని... ఇదే తరహాలో రాష్ట్రంలో సమీకృత మార్కెట్ల నిర్మాణం జరుగుతోందని కేసీఆర్ తెలిపారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్ అయినా ఉండాలన్నదే తమ సంకల్పమని చెప్పారు.

రాష్ట్రంలో కల్తీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకా నకిలీ విత్తనాల సరఫరా జరుగుతోందన్న ఫిర్యాదులు వస్తున్నాయని... విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని... అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. కల్తీ విత్తనాల బెడద రాష్ట్రానికి లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.. కేసీఆర్.

త్వరలో 1540 ఆశా పోస్టుల భర్తీ : హరీశ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో త్వరలో 1540 ఆశా వర్కర్ పోస్టులు భర్తీ చేస్తామని... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా.. వైద్య ఆరోగ్య శాఖపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. బస్తీ దవాఖానాలతో పేద ప్రజల రోగాలు నయం అవుతున్నాయని... ఇప్పటి వరకు కోటి మంది ప్రజలు బస్తీ దవాఖానాల్లో చికిత్స పొందారని చెప్పారు. లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని... మార్చి ఆఖరకు 134 రకాల పరీక్షలు అందుబాటులోకి తెస్తామని వివరించారు. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలతో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై ఓపీ భారం తగ్గిందన్న ఆయన... క్రమంగా అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేస్తామని అన్నారు.

IPL_Entry_Point