TSPSC Paper Leak Case : బండి సంజయ్ ఇంటికి సిట్ అధికారులు.. మరోసారి నోటీసులు
SIT Notice to Bandi Sanjay: పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ కి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 26వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
TSPSC Paper Leak Case Updates:టీఎస్పీఎస్పీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు విచారణలో తవ్వే కొద్దే అక్రమాలు బయటికి వస్తున్నాయి. తాజాగా వచ్చిన రిమాండ్ రిపోర్టులో కూడా పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 12 మందిని అరెస్ట్ చేయటంతో పాటు 19 మందిని సాక్షులుగా పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధమున్న ఉద్యోగులతో పాటు పలువురు అభ్యర్థులకు కూడా నోటీసులు ఇచ్చింది సిట్.
కేసు విషయంలో ఆరోపణలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నోటీసులు అందుకున్న రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే బండి సంజయ్ హాజరుకాలేదు. సిట్ పై నమ్మకం లేదంటూ కామెంట్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే శనివారం మరోసారి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చింది సిట్. ఆదివారం(మార్చి 26) తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
స్వయంగా ఇవాళ ఆయన నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు… నోటీసులు అందజేశారు. పేపర్ లీక్ పై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆధారాలను కూడా సమర్పించాలని నోటీసుల్లో ప్రస్తావించారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు సిట్ మంగళవారం తొలిసారిగా నోటీసులు జారీ చేసింది. మార్చి 24వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని అందులో కోరింది. అయితే విచారణకు హాజరుకాలేనంటూ బండి సంజయ్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా సిట్ విచారణకు హాజరు కాలేనని చెప్పారు. పార్లమెంట్ సెషన్ ముగిసిన తరువాత హాజరవుతాని పేర్కొన్నారు. సిట్‌ను విశ్వసించడం లేదు.. సిట్‌పై తనకు నమ్మకం లేదని కామెంట్స్ చేశారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదల్చుకోలేదని… సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనకు నమ్మకమున్న సంస్థలకే సమాచారం ఇస్తానని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో మరోసారి సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో… బండి సంజయ్ హాజరవుతారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ నిరసన కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సంబంధిత కథనం