Rythu Bandhu : అన్నదాతలకు గుడ్ న్యూస్... మరో 10 రోజుల్లోనే 'రైతుబంధు'!-rythu bandhu scheme funds likely to release within 10 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu : అన్నదాతలకు గుడ్ న్యూస్... మరో 10 రోజుల్లోనే 'రైతుబంధు'!

Rythu Bandhu : అన్నదాతలకు గుడ్ న్యూస్... మరో 10 రోజుల్లోనే 'రైతుబంధు'!

Rythu Bandhu Scheme Funds Updates 2023: వర్షాకాలం సీజన్ కు సంబంధించిన రైతుబంధు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ముందస్తుగానే జమ చేయాలని చూస్తున్న సర్కార్… అన్ని కుదిరితే మరో 10 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి.

రైతుబంధు నిధులు 2023 (facebook)

Rythu Bandhu Scheme Funds 2023: వానకాలం సీజన్ వచ్చేస్తోంది. దీంతో రైతుబంధు నిధుల జమపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అయితే ఈసారి ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా రైతులకు ముందుగానే రైతు బంధు నిధులు జమ చేసి తీపి కబురు అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మరో పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వానకాలం సీజన్ కు సంబంధించి జూన్ చివర్లో లేదా జూలై మాసంలో నిధులను జమ చేస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. ఈసారి గతానికి భిన్నంగా... ముందుగానే ఈ వర్షాకాలం సీజన్ కు సంబంధించిన రైతు బంధు పెట్టుబడి సాయన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా వ్యవసాయ శాఖ ఏర్పాట్లును సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పంట సీజన్ల ను ముందుకు జరపాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. తద్వారా... అన్నదాతలను కూడా పంట సాగుకు సిద్ధం చేయవచ్చని కూడా సర్కార్ భావిస్తోంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా...ఈసారి సాగు ముందుకు జరపాలని ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

రైతు బంధు పథకం కింద ప్రతీ ఎకరానికి వానాకాలం, యాసంగి సీజన్లో రూ.5 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఈ సీజన్‌లో కూడా ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే పోడు భూముల పట్టాలను పంపిణీ చేయనుంది సర్కార్. వారికి కూడా ఇదే ఏడాది నుంచే రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు పోడు భూముల పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించనుంది. సంబంధిత రైతు బ్యాంకు ఖాతా నంబర్‌, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, లబ్ధిదారుడి మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలను అప్‌లోడ్‌ చే సేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది పోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచేపనిలో పడ్డారు.

పోడు భూములు లబ్ధిదారులు కాకుండా… ఇతర వ్యవసాయదారులు.. తమ పాస్ బుక్, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా పాస్ బుక్ తదితర పత్రాలతో సంబంధిత గ్రామ వ్యవసాయ అధికారిని గానీ, మండల రెవెన్యూ అధికారిని గానీ సంప్రదించి రైతుబంధు, రైతుబీమా దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ పథకం కింద లబ్ధి పొందిన రైతుల్లో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకం ప్రారంభమైన అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఇదే తరహాలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాయి.