YS Sunitha Reddy: అవినాష్ తల్లికి సర్జరీ జరగలేదు.. చర్యలు తీసుకోవాలన్న సునీత
YS Sunitha Reddy: సిబిఐ విచారణ నేపథ్యంలో తల్లికి అనారోగ్యం అంటూ ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరైన నేపథ్యంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని సునీత రెడ్డి ఫిర్యాదు చేశారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మీకి ఎలాంటి శస్త్ర చికిత్స జరగలేదని కోర్టుకు ఫిర్యాదు చేశారు.
YS Sunitha Reddy: సిబిఐ విచారణకు హాజరు కాకుండా, తల్లికి అనారోగ్యమంటూ గైర్హజరైన ఎంపీ అవినాష్‌పై చర్యలు తీసుకోవాలని సునీతరెడ్డి కోర్టుకు ఫిర్యాదు చేశారు. అవినాష్ తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో సునీతారెడ్డి మెమో దాఖలు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి గత నెలలో సిబిఐ విచారణకు హాజరు కాలేదు. చివరి నిమిషంలో తల్లికి అనారోగ్యమని వెళ్లిపోయారు.
ఈ క్రమంలో విచారణకు హాజరు కాలేనంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని అవినాష్ రెడ్డి కోర్టుకు చెప్పారని, దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి బుధవారం తెలంగాణ హైకోర్టుకు మెమో సమర్పించారు.
తల్లికి గుండె కవాటాలు మూసుకుపోవడంతో శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది ఇచ్చిన హామీతో తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా అరెస్టు చేయరాదంటూ కోర్టు మే 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని సునీత పేర్కొన్నారు. ఈ ప్రకటన తప్పయితే చర్యలు తప్పవని పేర్కొందని గుర్తు చేశారు.
మరోవైపు హైదరాబాద్ ఏఐజి ఆస్పత్రి నుంచి అవినాష్ తల్లిని డిశ్చార్జి చేశారు. మీడియా కథనాల ప్రకారం ఆమెకు శస్త్రచికిత్స జరగలేదని తెలిసిందని, శస్త్రచికిత్స జరుగుతోందన్న న్యాయవాది ప్రకటన తప్పు అని, నిర్ధారించడానికి రికార్డులు లేనందున గత ఆదేశాల ప్రకారం అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతారెడ్డి తరఫు న్యాయవాది స్వేచ్ఛ న్యాయస్థానాన్ని కోరారు.
సునీత పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి సంబంధిత మెడికల్ రికార్డులు సమర్పించారు కదా అని ప్రశ్నించారు. అవినాష్ తరపున సమర్పించిన పత్రాల్లో శస్త్రచికిత్స జరిగినట్లు రికార్డులు లేవని న్యాయవాది తెలిపారు. సునీత దాఖలు చేసిన మెమోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని న్యాయవాది విజ్ఞప్తి చేయగా మెమోను న్యాయమూర్తి అనుమతించారు.