TRS Left Parties Alliance: ఆ సీట్లపై కన్నేసిన కామ్రేడ్లు..! టీఆర్ఎస్ ఆలోచనేంటి?-left parties looks on few assembly seats over alliance with trs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Left Parties Alliance: ఆ సీట్లపై కన్నేసిన కామ్రేడ్లు..! టీఆర్ఎస్ ఆలోచనేంటి?

TRS Left Parties Alliance: ఆ సీట్లపై కన్నేసిన కామ్రేడ్లు..! టీఆర్ఎస్ ఆలోచనేంటి?

HT Telugu Desk HT Telugu
Nov 12, 2022 02:35 PM IST

TRS - CPI CPM Alliances: కారుతో కమ్యూనిస్టులు కలిశారు. మునుగోడులో విక్టరీ కొట్టారు. తమ దోస్తీ జాతీయ స్థాయిలోనూ ఉంటుందని కేసీఆర్ తో పాటు ఇరు పార్టీల నేతలు కూడా చెప్పుకొచ్చారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... తెలంగాణలోని పలు స్థానాలపై కన్నేశారు కమ్యూనిస్టులు. అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం ఉండేలా... పావులు కదిపే పనిలో పడ్డారు.

కమ్యూనిస్టు నేతలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)
కమ్యూనిస్టు నేతలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

TRS and CP CPM Alliance in Telangana: మునుగోడు అసెంబ్లీ(Munugode Assembly) ఉపఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇచ్చాయి సీపీఐ, సీపీఎం. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే వెళ్లాలని ఆలోచనలో ఉన్నాయి. కేసీఆర్ సైతం.. ఈ పొత్తు ఇప్పటికీ మాత్రమే కాదు.. భవిష్యత్ లోనూ అని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి కమ్యూనిస్టులు కీలకంగా మారారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ కూడా ఓ రకంగా ఒప్పుకుంటోంది. 2018 తర్వాత... పూర్తిగా దెబ్బతిన్న కమ్యూనిస్టు పార్టీలు... వచ్చే ఎన్నికల్లో కొన్నిస్థానాలను గెలిచి... మళ్లీ లైన్ లోకి రావాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ తో పొత్తుతో కలిసివచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారట..! ఈ క్రమంలోనే పలు జిల్లాలోని సీట్లపై కన్నేశారనే వార్తలు బయటికి వస్తున్నాయి.

ఈ సీట్లపై కన్ను...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసే స్థానాలపై కూడా ఓ స్పష్టత కోరుతున్నాయట కమ్యూనిస్టు పార్టీలు. ఈ నేపథ్యంలో... గులాబీ బాస్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే ఓట్లు ఉన్నప్పటికీ... సొంతంగా పోటీ చేసే గెలిచే పరిస్థితి కమ్యూనిస్టుల్లో కనిపించటం లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ, మదిర, పాలేరు సీట్లను సీపీయం... హుస్నాబాద్, కొత్తగూడెంతో పాటు మునుగోడు, దేవరకొండ సీట్లను కూడా సీపీఐ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని బరిలో ఉంటారని... పాలేరు నుంచి తమ్మినేని, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి, హుస్నాబాద్ నుంచి చాడా వెంకట్ రెడ్డి బరిలో ఉంటారనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం కమ్యూనిస్టులు ఆశిస్తున్న స్థానాలు గతంలో వారు గెలిచినవే. ప్రస్తుతం కూడా ఇక్కడ ప్రభావితం చేసే ఓట్లు ఉన్నాయి. దీనికి తోడు పోత్తులో భాగంగా టీఆర్ఎస్ తమకు కేటాయిస్తే... ఆయా స్థానాలను గెలిచే అవకాశం ఉంటుందని కమ్యూనిస్టులు లెక్కలు వేస్తున్నారట. నిజానికి 2004 నుంచి కమ్యూనిస్టు పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ వస్తున్నాయి. 2004లో కాంగ్రెస్ తో దోస్తీ ఉండగా... 2009లో మహాకూటమి పేరుతో బరిలోకి దిగారు. 2014, 2018లోనూ పలు పార్టీలతో మద్దతు పెట్టుకున్నాయి. 2018లో సీపీయం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో పలు స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేదు.

కమ్యూనిస్టుల తాజా ప్రతిపాదనల విషయంలో టీఆర్ఎస్ కూడా సీరియస్ గానే చర్చిస్తుందట. పొత్తుతో చాలా స్థానాల్లో తమకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుందనే చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కు వారి మద్దతు తీసుకోవటంలోనూ అడుగుపడినట్లు అవుతుందని చూస్తోందట. మరోవైపు ఆయా స్థానాల్లో కూడా టీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పొత్తుల ఫార్ములతో స్థానిక ఎమ్మెల్యేలు కూడా తెగ టెన్షన్ పడుతున్నారట.! పొత్తుల్లో భాగంగా తమ సీటుకు ఎసరు వస్తుందేమో అన్న భయం వెంటాడుతుందట..!

మొత్తంగా అసలు కమ్యూనిస్టులు ఆశిస్తున్న సీట్లను టీఆర్ఎస్ వదులుకుంటుందా..? లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point