Komatireddy Venkatreddy : అక్కడ రక్తపాతం జరిగితే కేసీఆరే కారణం.. జీవో 246పై వెంకట్ రెడ్డి సీరియస్-komatireddy venkatreddy comments on cm kcr over go 246 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Komatireddy Venkatreddy Comments On Cm Kcr Over Go 246

Komatireddy Venkatreddy : అక్కడ రక్తపాతం జరిగితే కేసీఆరే కారణం.. జీవో 246పై వెంకట్ రెడ్డి సీరియస్

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 09:18 PM IST

జీవో 246పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నల్గొండ రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని వ్యాఖ్యానించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జీవో 246ను వెంటనే రద్దు చేయాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే.. దీక్షకు దిగుతానని హెచ్చరించారు. నల్గొండ జిల్లా ప్రజలకి నష్టం కలిగించే చర్యలకు సీఎం కేసీఆర్ పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్ఎల్బీసీకి కేటాయించబడిన నీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం నల్గొండ జిల్లా ప్రజలకు, రైతాంగానికి తీవ్ర నష్టం కలుగజేస్తుందని పేర్కొన్నారు.

'1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ జిల్లా ప్రజలకు ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీలు కేటాయింపులు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా నల్గొండ జిల్లా రైతులకు అన్యాయం చేస్తోంది. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 246ని తెచ్చింది.' అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరేనని వ్యాఖ్యానించారు. ఫ్లోరైడ్ రూపుమాపింది తామేనని, ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల కెనాల్స్ బాగున్నాయని వెంకట్ రెడ్డి అన్నారు.

తమ దగ్గర కెనాల్స్ లైనింగ్ పూర్తిగా దెబ్బతిందని, బాగు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వెంకట్ రెడ్డి ఆరోపించారు. జీవో నెంబర్ 246ని వెంటనే రద్దు చేయాలన్నారు. రద్దు చేయకుంటే జిల్లా కేంద్రంలో దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. జీవో రద్దు చేయాలనీ సీఎంకి లేఖ రాస్తానని, అవసరమైతే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తానని చెప్పారు. ఎస్ఎల్బీసీ 30టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 40టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 20టీఎంసీలు కేటాయించాలన్నారు.

IPL_Entry_Point