Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో లొల్లి.. లొల్లి.. సోనియా వద్దకు కోమటిరెడ్డి?-komatireddy venkat reddy and shashidhar reddy seek sonia gandhi appointment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Komatireddy Venkat Reddy And Shashidhar Reddy Seek Sonia Gandhi Appointment

Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో లొల్లి.. లొల్లి.. సోనియా వద్దకు కోమటిరెడ్డి?

Anand Sai HT Telugu
Aug 18, 2022 10:16 PM IST

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామం ఎక్కువ. టీపీసీసీలో మాత్రం ఇంకా ఎక్కువ. అందుకే ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు బయటకు వచ్చాయనుకోండి అది వేరే విషయం. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో మరో విషయం ఆసక్తికరంగా మారింది.

వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి(ఫైల్ ఫొటో)
వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి(ఫైల్ ఫొటో)

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు చల్లారే పరిస్థితి లేనట్టుగా ఉంది. ఎవరు ఉంటారో.. ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోతారో అనే ఆసక్తి సహజంగానే అందరికీ ఉంది. పార్టీలో అంతటి అంతర్గత యుద్ధం నడుస్తుందన్న మాట. ఓ వైపు మునుగోడు పోరు దగ్గర పడుతుంటే.. మరోవైపు ఇలా పార్టీలో కుమ్ములాటలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యనేతలు పార్టీని వీడుతున్నారు. వెళ్తూ.. వెళ్తూ.. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మెుదలైన లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు.., అధినేత సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఎలాగైనా కలిసి తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి వివరించాలనుకుంటున్నారు. పార్టీలో సీనియర్లకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే రేవంత్ తీరుపై సీనియర్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నీ సోనియా గాంధీ చెప్పనున్నారు నేతలు.

చుండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్‌ తనపై చేసిన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్రంలోని పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ రెడ్డిపై దయాకర్ చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. మరోవైపు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కంగోలుపై ఘాటైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి ఏజెంట్లుగా ఉన్నారన్నారు. ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంలో స్థానిక నేతలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్టీ పట్ల నిబద్ధతతో, అంకితభావంతో పని చేస్తున్న సీనియర్లు, విధేయులపై రేవంత్ రెడ్డి హోంగార్డుల వంటి పదజాలాన్ని ఎలా ప్రయోగిస్తారని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు.

ఇంకోవైపు మునుగోడు సీటును ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. ముందుగానే రంగంలోకి దిగింది. కానీ ఓ వైపు ఈ అంతర్గత కుమ్ములాటలు నడుస్తూనే ఉన్నాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అన్న వెంకట్ రెడ్డి ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

IPL_Entry_Point