Ponguleti Jupally :కాషాయ కండువా కప్పుకుంటారా, హస్తం గూటికెళ్తారా? పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరతారో తేలేది అప్పుడే!-khammam senior leaders ponguleti jupally discussion with bjp congress leaders on party change announcement on may 14th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponguleti Jupally :కాషాయ కండువా కప్పుకుంటారా, హస్తం గూటికెళ్తారా? పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరతారో తేలేది అప్పుడే!

Ponguleti Jupally :కాషాయ కండువా కప్పుకుంటారా, హస్తం గూటికెళ్తారా? పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరతారో తేలేది అప్పుడే!

Bandaru Satyaprasad HT Telugu
May 05, 2023 10:44 AM IST

Ponguleti Jupally Party Change : సీనియర్ నేతలు పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరతారని సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ ఇద్దరితో భేటీ నిర్వహించి తమ పార్టీల్లోకి ఆహ్వానించాయి. ఈ నెల 14న జరిగే సభలో ఏ పార్టీలో చేరతారో చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.

పొంగులేటి, జూపల్లితో బీజేపీ , కాంగ్రెస్ నేతలు చర్చలు
పొంగులేటి, జూపల్లితో బీజేపీ , కాంగ్రెస్ నేతలు చర్చలు (Twitter )

Ponguleti Jupally Party Change : ఏ పార్టీలో చేరితో కేసీఆర్ ను గద్దెదించడం కుదురుతుందో అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్ లో ఉన్న ఈ నేతలు ఏ పార్టీలో చేరతారో చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అవతరణ దినోత్సవరం జూన్ 2న ఏ పార్టీలో చేరేది అధికారంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం లేదా రంగారెడ్డి, మహిబూబ్ నగర్ లో భారీ సభ పెట్టి ప్రకటించాలని భావిస్తున్నారు.

ఈ నెల 14న భారీ బహిరంగ సభ

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పొంగులేటి, జూపల్లిపై బీఆర్ఎస్ అధిష్ఠానం ఇటీవల సస్పెన్షన్ వేటు వేసింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మీయ సమావేశాలతో ఈ ఇద్దరు నేతలు బిజీ అయ్యారు. బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో భేటీ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పొంగులేటి 9 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. భద్రాచలం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, వైరా నుంచి పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. ఖమ్మంలో ఈ నెల 14న ఆత్మీయ భేటీ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పొంగులేటి, జూపల్లి సిద్ధమవుతున్నారు. ఈ సభ తెలంగాణ ఆత్మ గౌరవ పొలికేక సభగా మారనుందని పొంగులేటి, జూపల్లి అనుచరులు చెబుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు

పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ చేరాలని దిల్లీ నుంచి రాహుల్ గాంధీ టీమ్ వచ్చి పొంగులేటితో ఈ మధ్య చర్చలు కూడా జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో రెండు తప్ప మిగిలిన ఎనిమిది సీట్లు పొంగులేటి సూచించిన అభ్యర్థులకు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ప్రచారం కూడా జరిగింది. తాజాగా బీజేపీ చేరికల కమిటీ, ఈటల రాజేందర్ నేతృత్వంలో ఓ బృందం పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది సీట్లు ఆయనకే ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ హైకమాండ్ నుంచి స్పష్టత రాకపోయేసరికి ఇద్దరు నేతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఈ సందిగ్ధంలో మే 14న నిర్వహించే బహిరంగ సభ కీలకం కానుంది. ఈ వేదికపై ఏ పార్టీలో చేరతానే స్పష్టత వస్తుందని వారి అనుచర గణం చెబుతున్నారు. ఏ పార్టీలో చేరినా తాను చెప్పిన అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలని ఇద్దరు నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం.

IPL_Entry_Point