TS Cabinet Decisions: సొంత జాగలో ఇళ్ల నిర్మాణం కోసం 'గృహలక్ష్మి పథకం'.. కేబినెట్ నిర్ణయాలు ఇవే
telangana cabinet decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా… ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్ రావ్ వెల్లడించారు.
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సొంత జాగ ఉన్నవారు ఇళ్లు కట్టుకునేందుకు గృహ లక్ష్మీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద నియోజకవర్గానికి 3వేల ఇండ్లను మంజూరు చేయనున్నారు.లబ్ధిదారుడికి రూ.3లక్షల గ్రాంట్ ఇస్తారు. వీటితో పాటు దళితబంధు, పోడు భూముల పట్టాలతో పాటు పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రి హరీశ్ రావ్ వెల్లడించారు.
Gruha Lakshmi Scheme: గృహా లక్ష్మీ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు మూడు విడతల్లో రూ. 3 లక్షలు ఇస్తామని మంత్రి హరీశ్ రావ్ వెల్లడించారు. హౌసింగ్ బోర్డు ద్వారా గతంలో ఇళ్లు నిర్మించుకున్న వారి ఇంటి అప్పులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జీవో 58, 59 ఒక్క రూపాయి లేకుండా పేదలకు ఇంటిపై హక్కును కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కటాప్ డేట్ నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయిచింది. జీవో 59 కింద 42వేల మంది లబ్ధి పొందినట్టు పేర్కొంది. కాశీతో పాటు శబరిమలలోనూ 25 కోట్లతో వసతి గృహం నిర్మించాలని మంత్రివర్గం తీర్మానించింది. ట్యాంక్ బండ్ దగ్గర కొత్తగా నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించాలని నిర్ణయించింది.
రెండో విడుతలో 1.30లక్షల మందికి దళితబంధు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలోని 4 లక్షల ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు 1, 55, 393 మందికి 4 లక్షల 903 ఎకరాలకు సంబంధించి పట్టాలు ప్రింటై.. పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంత్రి హరీశ్ రావ్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలోని 7.31లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇక మావేశంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరిని ఖరారు చేయడంతో పాటు కవిత కేసు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.