Vande Bharat Trains: రైళ్ల అద్దాలు పగుల గొడితే ఐదేళ్ల జైలు..-five years imprisonment for breaking train mirrors says railway officials
Telugu News  /  Telangana  /  Five Years Imprisonment For Breaking Train Mirrors Says Railway Officials
పగిలిన వందే భారత్ రైలు అద్దం (ఫైల్)
పగిలిన వందే భారత్ రైలు అద్దం (ఫైల్)

Vande Bharat Trains: రైళ్ల అద్దాలు పగుల గొడితే ఐదేళ్ల జైలు..

29 March 2023, 7:06 ISTHT Telugu Desk
29 March 2023, 7:06 IST

Vande Bharat Trains: ఆకతాయితనంతో రైళ్ల అద్దాలు పగులగొడితే ఐదేళ్ళ జైలు శిక్ష తప్పదని రైల్వే శాఖ హెచ్చరించింది. రెండున్నర నెలల్లో 9సార్లు రైళ్ల అద్దాలను పగులగొట్టిన ఘటనలు జరిగాయని ఈ కేసుల్లో 39మంది అరెస్టైనట్లు ప్రకటించారు. నిందితులకు గరిష్టంగా 5ఏళ్ల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.

Vande Bharat Trains: రైళ్లపై రాళ్లు విసరడం, అద్దాలు పగుల గొట్టడం వంటి చర్యలకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్షలు తప్పవని రైల్వే అధికారులు హెచ్చరించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువ కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆకతాయితనంతో రైళ్లపై రాళ్లు విసరడం వంటి పనులు చేస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెచ్చరించారు.

ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ఇలాంటి ఘటనలపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు . ఇటీవలి కాలంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లపై రాళ్ల దాడులు జరుగుతుండటంపై రైల్వే అధికారులు నిఘా పెంచారు.

రైళ్లపై జరుగుతున్న దాడుల్ని నియంత్రించేందుకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. భువనగిరి, కాజీపేట, ఖమ్మం, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో జనవరి నుంచి ఇప్పటివరకు రైలు బోగీలపై రాళ్లు విసిరిన 9 ఘటనలు జరిగాయని, ఈ ఘటనల్లో 39 మందిని అరెస్టుచేసి జైలుకు పంపామని పేర్కొంది. ఈ దాడుల్లో అయిదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. రైల్వే ట్రాక్‌ల పక్కన నిలబడి ఆకతాయితనంతో ఈ దాడులు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి చర్యల్ని ఊపేక్షించేది లేదని, రైలు ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రారంభానికి ముందే దాడి…

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించడానికి ముందే రైల్వే యార్డులో ఆకతాయిలు అద్దాలను పగులగొట్టారు. నిందితులను రైలుకు ఉన్న కెమెరాలలో గుర్తించడంతో వారిని అప్పట్లోనే పట్టుకున్నారు. వందే భారత్‌ రైలుకు పరిమతంగా హాల్ట్‌లు ఉండటంతో వేగంగా దూసుకుపోతోంది. రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివసించే చిన్నారులు ఈ రైళ్లపై ఆకతాయితనంతో రాళ్లు విసురుతున్నట్లు ఆర్పీఎఫ్ సిబ్బంది చెబుతున్నారు.

విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసరడంతో రైలులోని 2 కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. రైలు ప్రారంభానికి ముందే ఘటన జరగడంతో అప్పటికప్పుడు చెన్నై నుంచి కొత్త అద్దాలను తెప్పించి వాటిని రైలుకు అమర్చాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఫిబవరిలో ఖమ్మంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆకతాయి పిల్లలు రాళ్లు విసరడంతో వందే భారత్ రైలు అద్దాలు పగిలిపోయాయి. దీంతో రైలును ఆలశ్యంగా నడపాల్సి వచ్చింది. ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఆకతాయిలు రాళ్లు విసిరినట్లు ఆర్పీఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. రాళ్లు విసిరిన మైనర్లను గుర్తించారు. ఈ ఘటనలో నిందితుల్ని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 3 వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలుపై ఖమ్మం రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ముస్తఫానగర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరారు. రాళ్లు విసరడంతో సీ12 బోగీలో అద్దానికి పగుళ్లు వచ్చాయి. శుక్రవారం రాత్రి విశాఖ చేరిన తర్వాత వాల్తేర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి లోకో మెయింటెయినెన్స్‌ షెడ్‌కు తరలించి, రైల్వే అధికారులు కిటికీ అద్దం మార్చారు. అద్దం మార్చడానికి దాదాపు 3 గంటల సమయం పట్టడంతో శనివారం ఉదయం 5.45 గంటలకు బయలు దేరాల్సిన రైలును 8.50 గంటలకు వెళ్లేలా మార్పు చేశారు. దీంతో రైలు మూడు గంటలు ఆలస్యంగా నడిచింది.

 

సంబంధిత కథనం