Visakha Vande Bharath : వందేభారత్‌ విశాఖ వయా విజయవాడ….-pm narendra modi will inaugurate secunderabad visakhapatnam vandebharath express on january 19 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Pm Narendra Modi Will Inaugurate Secunderabad Visakhapatnam Vandebharath Express On January 19

Visakha Vande Bharath : వందేభారత్‌ విశాఖ వయా విజయవాడ….

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 08:55 AM IST

Visakha Vande Bharath ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్‌ రైలు మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి రానుంది. జనవరి 19న ప్రధాని చేతుల మీదుగా వందేభారత్‌ రైలును లాంఛనంగా ప్రారంభించ నున్నారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వందేభారత్ రైలు మార్గాన్ని ఖరారు చేశారు. సీటింగ్ సదుపాయం మాత్రమే ఉండటంతో సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య ప్రయాణాలను ఖరారు చేస్తారని భావించినా అందరికీ అందుబాటులో ఉండేలా విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఖరారు చేశారు.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఫొటో)
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఫొటో) (PTI)

Visakha Vande Bharath ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ రైలు ప్రయాణాలకు సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా పలు రూట్లలో వందే భారత్ రైళ్లు ఇప్పటికే మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి రైలు 19వ తేదీన ప్రారంభం కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దురంతో రైలు కంటే వందే భారత్ వేగంగా గమ్య స్థానాలకు చేరనుంది.

ప్రస్తుతం సికింద్రాబాద్‌-విశాఖ మధ్య నడుస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ గరిష్టింగా 10గంటల్లో గమ్యస్థానాన్ని చేరుతోంది. వందే భారత్ రైలు 8 గంటల 40 నిమిషాల వ్యవధిలోనే గమ్య స్థానానికి చేరుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే గంటన్నర ముందే ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు వీలవుతుంది.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లతో పోలిస్తే మూడున్నర గంటల సమయం ఆదా అవుతుంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం ప్రయాణానికి గరీబ్‌రథ్‌ రైలులో 11గంటల 10 నిమిషాలు, ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లో 11.25 గంటలు, గోదావరిలో 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో 12.40గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో 12.45గంటల సమయం పడుతోంది.

వందే భారత్‌ రైలును వారంలో ప్రతి రోజూ నడపాలని నిర్ణయించారు. ఉదయం విశాఖపట్నంలో బయలుదేరి మధ్యాహ్నానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. 20నిమిషాల విరామం తర్వాత తిరిగి సికింద్రాబాద్‌లో బయలు దేరుతుంది. విజయవాడలో ఐదు నిమిషాల పాటు ఆగే రైలు, హాల్టింగ్ ఉన్న ప్రతి స్టేషన్‌లో రెండు నిమిషాల పాటు ఆగుతుంది.

విశాఖపట్నం నుంచి ఉదయం 5.45కు బయలుదేరే రైలు రాజమండ్రికి 8.08కు చేరుతుంది. రెండు నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయల్దేరి ఉదయం 9.50కు విజయవాడ చేరుతుంది. 9.55కు విజయవాడలో బయల్దేరి మధ్యాహ్నం 12.05కు వరంగల్ చేరుతుంది. మధ్యాహ్నం 2.25కు సికింద్రాబాద్ చేరుతుంది. మరోవైపు ఖమ్మంలో కూడా వందే భారత్ రైలుకు హాల్ట్ కల్పించారు. ఖమ్మం స్టేషన్‌కు వందే భారత్ చేరుకునే సమయాన్ని రైల్వే శాఖ ఖరారు చేయాల్సి ఉంది.

ఏలూరు, సామర్లకోట వంటి స్టేషన్లలో కూడా వందే భారత్ రైలును ఆపాలని భావించిన ఎక్కువ స్టేషన్లలో ఆగితే ప్రయాణ సమయం పెరుగుతుందనే ఉద్దేశంతో వాటిని విరమించుకున్నారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహత్నం 2.45కు రైలు బయల్దేరుతుంది. వరంగల్‌కు సాయంత్రం 4.25కు, విజయవాడకు రాత్రి 7.10కు, రాజమండ్రికి 9.15కు, విశాఖపట్నానికి 11.25కు చేరుతుంది.

వందేభారత్ రైలులో టిక్కెట్ల ధరలను రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు. ప్రధాని రైలును ప్రారంభించే రోజు సాధారణ ప్రయాణికులను అనుమతించరు. ప్రయాణికులకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది. ప్రయాణ ఛార్జీలను కూడా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. వందే భారత్‌‌ ట్రైన్‌లో ఛైర్‌ కార్‌ టిక్కెట్‌ ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్ల ధరలతో పోలిస్తే సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ప్రయాణానికి రూ.1770 వరకు ఉండే అవకాశం ఉంది. పన్నులతో కలిపి ఈ ధర పెరిగే అవకాశాలున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఛైర్‌ కార్‌లో ప్రయాణ టిక్కెట్ ధర రూ.3260కు పైగా ఉండే అవకాశాలున్నాయి.

IPL_Entry_Point