Secretariate: సచివాలయంలో హెలీప్యాడ్ నిర్మాణం-cm kcr reviews progress of telangana secretariat works at final stage ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Reviews Progress Of Telangana Secretariat Works At Final Stage

Secretariate: సచివాలయంలో హెలీప్యాడ్ నిర్మాణం

HT Telugu Desk HT Telugu
Nov 18, 2022 08:42 AM IST

Secretariate: తెలంగాణ నూతన సచివాలయంలో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

నిర్మాణంలో ఉన్న తెలంగాణ సచివాలయ భవన సముదాయం
నిర్మాణంలో ఉన్న తెలంగాణ సచివాలయ భవన సముదాయం

సచివాలయం ప్రాంగణంలో హెలీప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించిన సీఎం అనువైన చోట నిర్మాణం చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. వీఐపీల రాకపోకలకు, అత్యవసర పరిస్థితుల్లో యంత్రాంగం స్పందించేందుకు వీలుగా హెలిప్యాడ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

కాగా నూతన సచివాలయం అమరుల త్యాగ ఫలితమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడింపచేసే దిశగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంటున్నదని సీఎం తెలిపారు. తుది దశకు చేరుకుంటున్న తెలంగాణ సచివాలయ పనుల పురోగతిని కేసీఆర్ గురువారం పర్యవేక్షించారు.

సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర నుంచి పై అంతస్తు వరకు పరిశీలించిన ముఖ్యమంత్రి వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ప్రధాన ద్వారం ఎలివేషన్ సహా, ఇటీవల బిగించిన డోములను, దోల్ పూర్ స్టోన్‌తో రూపొందించిన వాల్ క్లాడింగ్ తదితర అలంకరణలను పరిశీలించారు.

సచివాలయానికి ఉత్తర దక్షిణ భాగాల్లో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారాలను, కాంపౌండ్ వాల్స్‌ను, వాటికి అమరుస్తున్న రైలింగ్స్, వాటర్ ఫౌంటేన్స్, లాన్స్ స్టేర్ కేస్ క్షుణ్ణంగా పరీక్షించారు. వాహనాల ప్రవేశ ద్వారాలను పార్కింగు స్థలాలను పరిశీలించారు.

మంత్రుల ఛాంబర్లను పరిశీలించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతూ, సమర్థవంతంగా గుణాత్మకంగా పనితీరును కనబరిచే విధంగా చాంబర్లు నిర్మితమౌతున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్లను, సమావేశ మందిరాలను పరిశీలించిన సీఎం తగు సూచనలు చేశారు. ఇటీవలే బిగించిన డోమ్‌లను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు.

అందరికీ అనువైన రీతిలో ఏర్పాటు చేస్తున్న డైనింగ్ హాల్స్, మంత్రులు అధికారులు కలెక్టర్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశ మందిరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. అడుగడుగునా కదలికలను పసిగట్టే సిసి కెమెరాల ఏర్పాటు, పటిష్టమైన భధ్రత ఏర్పాట్ల దిశగా చేపట్టిన చర్యలను పరిశీలించారు. రికార్డులను భధ్రపరిచే స్ట్రాంగు రూంల నిర్మాణాలను, జాతీయ అంతర్జాతీయ అతిథుల కోసం నిర్మించిన సమావేశ మందిరాలను సీఎం పరిశీలించారు.

గత వంద ఏండ్ల నుంచి ఇంతపెద్ద మొత్తంలో దోల్ పూర్ స్టోన్‌ను వాడిన కట్టడం దేశంలో తెలంగాణ సచివాలయమేనని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలో మరే రాష్ట్రంలోకూడా ఇంతటి గొప్ప స్థాయిలో సచివాలయ నిర్మాణం జరగలేదని తెలిపారు. పార్లమెంట్ తరహాలో నిర్మాణం చేస్తున్న లోపల బయట టెర్రకోటా వాల్ క్లాడింగును సీఎం పరిశీలించారు.

IPL_Entry_Point