IPL 2023 Stats: టీ20 క్రికెట్ అంటే యువకులదే అన్న వాదన ఉంది. మూడు గంటల్లో ముగిసిపోయే ఈ మ్యాచ్ లో స్పీడ్ ఉండాలి. అందుకు తగిన ఫిట్‌నెస్ కావాలి అన్నది అందరూ అనుకునేది.
కానీ ఐపీఎల్ 2023 మాత్రం అది తప్పని నిరూపిస్తోంది. ఈ సీజన్ లో యువకుల కంటే సీనియర్ క్రికెటర్లే ఇరగదీస్తున్నారు. ఫాఫ్ డుప్లెస్సి, రహానే, ధావన్, పియూష్ చావ్లాలే దీనికి నిదర్శనం.
ఈ ఏడాది ఆయా టీమ్స్ విజయాల్లో ప్రభావం చూపిన ప్లేయర్స్ టాప్ 7 లిస్టులో ఈ నలుగురూ ఉండటం విశేషం. ఈ ఏడాది జులైతో 39 ఏళ్లు నిండనున్న డుప్లెస్సి.. ఆర్సీబీ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. ఏడు మ్యాచ్ లలో 405 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ అతని దగ్గరే ఉండటం విశేషం. అతని స్ట్రైక్ రేట్ 165 కాగా.. మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్స్ లిస్టులో టాప్ లో ఉన్నాడు.
ఇక పంజాబ్ కింగ్స్ టీమ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ హవా నడుస్తోంది. గాయం వల్ల మూడు మ్యాచ్ లకు దూరమైనా.. 66 బంతుల్లో 99 పరుగులు చేసిన అతని ఇన్నింగ్స్ లీగ్ కే హైలైట్. టీమ్ స్కోరు 143లో ధావనే 99 రన్స్ చేశాడంటే అతని జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్ లో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ధావన్ వయసు 37 ఏళ్లన్నది గుర్తుంచుకోవాలి.
అటు అజింక్య రహానే అయితే తన 2.0 వెర్షన్ ను చూపిస్తున్నాడు. ఈ సీజన్ లో రహానే ఏకంగా 199 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. కనీసం 30 బంతులు ఆడిన ప్లేయర్స్ లో రహానేదే అత్యధిక స్ట్రైక్ రేట్. రహానే ఈ జూన్ తో 35 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. ఈ సీజన్ లో అతడు 30కిపైగా స్కోర్లు చేసిన మూడు ఇన్నింగ్స్ లో 160కిపై స్ట్రైక్ రేట్.. 60కిపైగా రన్స్ చేసిన రెండు ఇన్నింగ్స్ లో 200కిపైగా స్ట్రైక్ రేట్ ఉండటం విశేషం.
ఇక అంతా అయిపోయిందనుకున్న స్పిన్నర్ పియూష్ చావ్లా.. ఈ సీజన్ లో చెలరేగుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ చావ్లానే. గత మూడు సీజన్లు కలిపి 21 మ్యాచ్ లలో 17 వికెట్లు తీసుకోగా.. ఈ సీజన్ లో ఇప్పటికే 11 వికెట్లు తీశాడు.
సంబంధిత కథనం