IPL 2023 : మామిడి పండ్లతో నవీన్ ఉల్ హక్‌ను ట్రోల్ చేసిన ముంబయి ప్లేయర్స్
IPL 2023 : మే 24న చెన్నైలోని ఎంఏ చిదంబరం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత లక్నో ఆటగాడిని ముంబయి ప్లేయర్స్ ట్రోల్ చేశారు.
LSG Vs MI మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ప్రత్యర్థి లక్నో సూపర్‌జెయింట్‌కు 183 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో సూపర్‌జెయింట్స్ విఫలమై 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగుల భారీ విజయంతో రెండో క్వాలిఫయర్ ఆడే అవకాశం దక్కించుకుంది. అంతకుముందు తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓడిన గుజరాత్ టైటాన్స్ రెండో మ్యాచ్ మే 26 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది.
లక్నోతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆకాశ్ మధ్వల్ ఐదు వికెట్లు పడగొట్టగా, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నవీన్ ఉల్ హక్ 4 ఓవర్లు వేసి 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌లో బలమైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, కెమెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మల వికెట్లను నవీన్ ఉల్ హక్ తీశాడు.
ఆటలో ఎప్పుడూ ముందుండే నవీన్ ఉల్ హక్ నిన్నటి మ్యాచ్ లోనూ ప్రభంజనం సృష్టించాడు. మైదానంలో వికెట్ తీసుకున్న తర్వాత చెవులు మూసుకుని సంబరాలు చేసుకున్నాడు. ఇది రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ అభిమానుల అసంతృప్తికి దారితీసింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత, ముంబై ఇండియన్స్‌కు చెందిన కొందరు ఆటగాళ్ళు నవీన్ ఉల్ హక్‌ను ట్రోల్ చేశారు. విరాట్ కోహ్లీని ట్రోల్ చేయడానికి నవీన్ ఉల్ హక్ ఉపయోగించిన పద్ధతినే ఈ ఆటగాళ్లు కూడా ఉపయోగించారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన సందీప్ వారియర్ తన సహచరులు విష్ణు వినోద్, కుమార్ కార్తికేతో కలిసి చెవులు, కళ్ళు, నోరు మూసుకున్నారు. పక్కనే మామిడి పండ్లను టేబుల్ మీద పెట్టారు. ఇది 'మామిడి పండ్ల తీపి సీజన్' అని పోస్ట్ చేశారు. విరాట్ కోహ్లీ ఔట్ అయినప్పుడు ననీన్ కూడా మామిడి పండ్లను ఇలానే ఉంచి ట్రోల్ చేశాడు. ప్రస్తుతం సందీప్ వారియర్ ఈ పోస్ట్ ను డిలీట్ చేయగా, అభిమానులు తీసిన పోస్ట్ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.