Dhoni vs Rinku vs Tewatia: చివరి ఓవర్లో ఎవరు గొప్ప.. ధోనీ, రింకు, తెవాతియాల సిక్స్‌ల రికార్డులు వైరల్
Dhoni vs Rinku vs Tewatia: చివరి ఓవర్లో ఎవరు గొప్ప.. ధోనీ, రింకు, తెవాతియాల సిక్స్‌ల రికార్డులు వైరల్ అవుతున్నాయి. గుజరాత్ టైటన్స్‌పై చివరి ఓవర్లో రింకు ఐదు సిక్స్ ల తర్వాత ట్విటర్లో వీళ్లను పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
Dhoni vs Rinku vs Tewatia: క్రికెట్ చరిత్రలోనే ఎమ్మెస్ ధోనీ ఓ గొప్ప ఫినిషర్. అతనితో పోల్చే స్థాయి రాహుల్ తెవాతియా, రింకు సింగ్ లాంటి యువ క్రికెటర్లకు ఇంకా రాలేదు కానీ.. రెండు, మూడు రోజులుగా ట్విటర్ లో వీళ్ల చివరి ఓవర్ రికార్డులను పోలుస్తూ చేస్తున్న ట్వీట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ రింకు సింగ్ ఐదు సిక్స్ ల సంచలన ఇన్నింగ్స్ తర్వాత చాలా మంది ఈ ట్వీట్లు చేస్తున్నారు.
క్రికెట్ లో గొప్ప ఫినిషర్ కావాలంటే ఆట కంటే ముందుగా ఒత్తిడిని చిత్తు చేసే సామర్థ్యం ఉండాలి. అది ధోనీలో మెండుగా ఉంది. ఈ మధ్య కాలంలో రాహుల్ తెవాతియా, రింకు సింగ్ లాంటి వాళ్లు కూడా చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తూ అద్భుతాలే చేస్తున్నారు. పైగా ఈ ముగ్గురూ చివరి ఓవర్లో సిక్స్ లు కొట్టే మ్యాచ్ లను ముగించడంలో దిట్టలు.
దీంతో చివరి ఓవర్లో ఎవరు ఎన్ని సిక్స్ లు కొట్టి మ్యాచ్ లను గెలిపించారో చెబుతూ కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ సహా కొందరు అభిమానులు ట్వీట్లు చేశారు. ధోనీ ఒక సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపిస్తే.. తెవాతియా 2, రషీద్ ఖాన్ 3, కార్లోస్ బ్రాత్‌వెయిట్ 4 సిక్స్ లు కొట్టి గెలిపించారని.. ఇక ఐదు సిక్స్ లు కొట్టి గెలిపించిన ఏకైక ప్లేయర్ రింకు సింగ్ అంటూ ఈ ట్వీట్లు చేయడం విశేషం.
అంతేకాదు 2020 ఐపీఎల్ నుంచి ఓ టీమ్ చేజ్ చేసి గెలిచిన సందర్భాల్లో అత్యధికసార్లు అజేయంగా నిలిచిన బ్యాటర్లనూ పోల్చుతూ ట్వీట్లు చేశారు. ఇందులో తెవాతియా 7 సార్లు అజేయంగా ఉండి టాప్ లో ఉండగా.. ధోనీ 6, దినేష్ కార్తీక్ 6, రాహుల్ త్రిపాఠీ 6 సార్లు అజేయంగా నిలిచారు. తెవాతియా గురువారం (ఏప్రిల్ 13) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ చివర్లో 2 బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా.. ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం