Jio 5G : 1000 నగరాల్లో 5జీ.. జియో ‘ప్లాన్’ మామూలుగా లేదుగా!-jio completes 5g coverage planning in top 1 000 cities ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jio 5g : 1000 నగరాల్లో 5జీ.. జియో ‘ప్లాన్’ మామూలుగా లేదుగా!

Jio 5G : 1000 నగరాల్లో 5జీ.. జియో ‘ప్లాన్’ మామూలుగా లేదుగా!

Sharath Chitturi HT Telugu
Aug 09, 2022 10:49 AM IST

Jio 5G coverage planning : 1000 నగరాల్లో 5జీ కవరేజీ ప్లానింగ్​ని పూర్తి చేసింది జియో. 5జీని యూజర్లకు అందించే విషయంలో ఈ టెలికాం సంస్థ దూసుకెళుతోంది.

1000 నగరాల్లో 5జీ.. జియో ‘ప్లాన్’ మామూలుగా లేదుగా!
1000 నగరాల్లో 5జీ.. జియో ‘ప్లాన్’ మామూలుగా లేదుగా! (Bloomberg)

Jio 5G coverage planning : '5జీ' రేసులో జియో దూసుకెళుతోంది. ఇప్పటికే 5జీ వేలం బిడ్డింగ్​లో టాప్​ పొజిషన్​లో నిలిచిన రిలయన్స్​ జియో.. ఇక యూజర్లకు ఆ సాంకేతికతను అందించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు.. దేశవ్యాప్తంగా 1000 నగరాల్లో 5జీ కవరేజీ ప్లానింగ్​ను పూర్తి చేసేసింది!

1000 నగరాల్లో 5జీ కవరేజీ ప్లానింగ్​ని పూర్తిచేయడంతో పాటు.. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5జీ టెలికాం గేర్స్​ను క్షేత్రస్థాయిలో ట్రయల్స్​ కూడా నిర్వహించింది రిలయన్స్​ జీయో. 5జీని 100శాతం దేశీయ పరిజ్ఞానంతో సిద్ధం చేసేందుకు 2021-22లో తీవ్రంగా కృషిచేస్తున్నట్టు వివరించింది.

"కస్టమర్ల వినియోగం, ఆదాయ వనరులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుని.. దేశంలో 1000 నగరాల్లో ఇప్పటికే 5జీ కవరేజీ ప్లానింగ్​ని పూర్తిచేశాము. ఇందుకోసం హీట్​మ్యాప్​, 3డీ మ్యాప్​, రే ట్రేసింగ్​ టెక్నాలజీని ఉపయోగించాము," అని రిలయన్స్​ జియో ఆగస్టు 7న ఓ నివేదికను ప్రచురించింది.

ఇటీవలే ముగిసిన 5జీ వేలంలో జియో దుమ్మురేపిన విషయం తెలిసిందే. 5జీ వేలంలో జరిగిన బిడ్డింగ్​లో 58శాతం వాటా జియోదే కావడం గమనార్హం. వినియోగదారులకు త్వరితగతిన 5జీని అందించడంలో ఇతర టెలికాం సంస్థలతో పోల్చుకుంటే.. జియో ముందు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నెల రోజుల్లో 5జీ..!

ఇక దేశంలో 5జీ సేవలు ఎప్పుడు మొదలవుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 89శాతం మంది భారతీయులు.. 5జీకి మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓక్లా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. వారిలో 70శాతం మంది.. వీడియో స్ట్రీమింగ్​ వేగం పెరుగుతుందని ఆశిస్తున్నారు. 68శాతం మంది.. మొబైల్​ గేమింగ్​లో వేగం పెరుగుతుందని 5జీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్టు వివరించారు. 5జీ హార్డ్​వేర్​ ధరలు దిగొస్తే.. డిమాండ్​ కూడా పెరుగుతుందని సర్వే పేర్కొంది.

ఈ డిమాండ్​కు తగ్గట్టుగానే.. 5జీ సేవలను నెల రోజుల్లో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టెలికాంశాఖ వెల్లడించింది. ఇందుకోసం వేగంగా పనులు జరుగుతున్నట్టు పేర్కొంది.

"నెల రోజుల్లో 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా వివిధ రంగాల అభివృద్ధిలో 5జీ ప్రభావం చూపిస్తుంది. 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్స్​ గ్రూప్​ని కూడా ఏర్పాటు చేశాము. దేశీయ 6జీ స్టాక్​ అభివృద్ధి కోసం ఆ బృందం కృషిచేస్తోంది. 5జీ టెస్ట్​ బెడ్​ని మా సొంతంగా తయారు చేసుకున్నాము. 5జీ నెట్​వర్క టెస్టింగ్​కు అది ఉపయోగపడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ స్టాక్​ని ప్రవేశపెడతాము. ఇది 5జీ నెట్​వర్క్​కు ఉపయోగపడుతుంది," అని టెలికాంశాఖ సహాయక మంత్రి దేవుసిన్హ అన్నారు.

అయితే.. సెప్టెంబర్​29న.. ప్రధాని నరేంద్ర మోదీ.. ఇండియాలో 5జీ సేవలను ప్రారంభిస్తారని వార్తలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు దీనిని ఇంకా ధ్రువీకరించలేదు.

5జీ.. 4జీ కన్నా 10రెట్ల వేగంతో కనెక్టివిటీ, ఇంటర్నెట్​ సదుపాయాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్