Elon Musk Twitter : ఎలాన్ మస్క్- ట్విట్టర్ డీల్ రద్దు.. అసలేం జరిగింది?
Elon Musk Twitter deal: ఊహించినదే జరిగింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ రద్దు అయ్యింది. దీనిపై ట్విట్టర్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
Elon Musk Twitter deal: అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ట్విట్టర్ డీల్ ముగిసింది. డీల్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు మస్క్. ఫేక్ అకౌంట్లపై ట్విట్టర్ సంస్థ సమాచారం ఇవ్వనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్
ట్విట్టర్‌పై దాదాపు ఏడాది కాలంగా మస్క్ తన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు ట్విట్టర్లో అవకాశాలు ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ ఏడాది తొలినాళ్లల్లో.. ట్విట్టర్లో దాదాపు 9శాతం వాటాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే.. ట్విట్టర్ మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇచ్చారు. ఎలాన్ మస్క్‌తో డీల్‌పై షేర్ హోల్డర్లు తెగ సంబర పడిపోయారు. ట్విట్టర్‌ను వెంటనే మస్క్ చేతిలో పెట్టాలని నిర్ణయించారు. ఫలితంగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ మధ్య 44బిలియన్ డాలర్ల డీల్ కుదిరింది.
అంతా సాఫీగా సాగిపోతోంది అనుకున్న సమయంలో.. ట్విట్టర్‌కు ఎదురుదెబ్బ తగలింది. ఫేక్ అకౌంట్లకు సంబంధించి సమస్య మొదలైంది. ట్విట్టర్ చెబుతున్న దాని కన్నా ఎక్కువ ఫేక్ అకౌంట్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని మస్క్ పట్టుబట్టారు. అందుకు ట్విట్టర్ నిరాకరించింది. ఈ వ్యవహారం దాదాపు రెండు నెలలు సాగింది.
చివరికి.. ట్విట్టర్‌తో డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
న్యాయ పోరాటం..
Elon Musk twitter deal cancelled : తాజా పరిణామాలు ఇరు వర్గాల మధ్య న్యాయ పోరాటానికి తెరతీశాయి. ఎలాన్ మస్క్ చర్యలకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతామని ట్విట్టర్ సంస్థ ఇప్పటికే తేల్చిచెప్పింది. తాము కూడా కోర్టుకు వెళ్లి ట్విట్టర్ చర్యలను ప్రతిఘటిస్తామని ఎలాన్ మస్క్ వర్గం చెబుతోంది. వీరి మధ్య సుదీర్ఘంగా న్యాయ పోరాటం జరిగే అవకాశం ఉంది.
వాస్తవానికి.. ట్విట్టర్‌తో ఒప్పందం నుంచి తప్పుకుంటే సంస్థకు ఎలాన్ మస్క్ 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని ముందే డీల్‌లో ఫిక్స్ అయ్యింది. దాదాపు 248 బిలియన్ డాలర్ల సంపద ఉన్న మస్క్.. 1 బిలియన్ చెల్లించడం పెద్ద కష్టమేమీ కాదు!
కాగా.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ రద్దు అవడంతో ఆ సంస్థ షేర్లు దాదాపు 5శాతం పతనమయ్యాయి.
వాస్తవానికి ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్‌పై విశ్లేషకులు ముందు నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ట్విట్టర్‌ను మస్క్ అసలు ఎందుకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ మధ్యలోనే ఆగిపోతుందని అనేక మంది జోస్యం చెప్పారు. చివరికి వారు అనుకున్నదే జరిగింది!
సంబంధిత కథనం