Workaholics Day | జీవితంలో వృత్తి ఒక భాగం మాత్రమే, కానీ జీవితమే వృత్తి కాకూడదు!-workaholics day take a break from work and celebrate the holiday ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Workaholics Day | జీవితంలో వృత్తి ఒక భాగం మాత్రమే, కానీ జీవితమే వృత్తి కాకూడదు!

Workaholics Day | జీవితంలో వృత్తి ఒక భాగం మాత్రమే, కానీ జీవితమే వృత్తి కాకూడదు!

Manda Vikas HT Telugu
Jul 05, 2022 11:02 AM IST

కష్టపడి పనిచేయటం మంచిదే కానీ కష్టపడుతూ పనిచేయడం మంచిది కాదు. ఈ రెండింటికీ తేడా ఉంటుంది. వృత్తికి- జీవితానికి తేడా ఉంటుంది. ఇక్కడ సమతుల్యత అనేది ముఖ్యం. మీరు పని రాక్షసులైతే ఈ స్టోరీ చదవండి.

workholics
workholics (Unsplash)

కొందరికి తినడం, తాగటం అంటే ఇష్టం, మరికొందరికి ఆడుకోవటం అంటే ఇష్టం, ఇంకొదరికి తిరగటం అంటే ఇష్టం. అయితే వీరందరికీ భిన్నంగా కొంతమంది ఉంటారు. వారికి ఇవేమి పట్టవు. కేవలం వారికి వారి పనే ముఖ్యం. వృత్తినే పరమావధిగా భావించి బాగా కష్టపడి పనిచేస్తారు, తీవ్రంగా శ్రమిస్తారు. వారితో పాటు ఇతరులను కష్టపడి పనిచేసేలా చేస్తారు. అందుకే వీరిని పని రాక్షసులు అంటారు. ఇంగ్లీషులో స్టైల్‌గా వర్క్‌హాలిక్స్ అంటారు. ఇలా వర్క్‌హాలిక్‌గా ఉండటం అంటే అది ఆల్కాహాలిక్ వారికంటే ప్రమాదకరం.

ఇప్పటికీ చాలామంది వ్యక్తులు తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను కోల్పోతున్నారు. జీవితంలో వృత్తి ఒక భాగం మాత్రమే, కానీ జీవితమే వృత్తి కాకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉండాలని చెప్పేందుకే ప్రతీ ఏడాది జూలై 05న పని రాక్షసుల దినోత్సవం అనగా Workaholics Dayగా నిర్వహిస్తున్నారు.

వర్క్‌హాలిక్‌గా ఉండటం ఎందుకు ప్రమాదకరం?

వృత్తివిషయంలో నిబద్ధత కనబరచడం. కష్టపడి పనిచేయడం మంచి లక్షణమే. అయినప్పటికీ అది మోతాదును మించకూడదు. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా ఇతరుల వ్యక్తిగత జీవితానికి హాని చేస్తుంది. అది కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. వర్క్‌హాలిక్‌గా ఉండటం వల్ల మీ సంబంధాలు తెగిపోవచ్చు. అలాగే మానసికంగా, శారీరకంగా వ్యక్తులను కుంగదీస్తుంది. ఆందోళన, అసంతృప్తి, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఒత్తిడితో కూడుకున్న పని నిర్వహిస్తున్నప్పుడు అది ఉత్తమమైన ఫలితాలను ఇవ్వదు. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది. కష్టపడి పనిచేసినా ఫలితాలు రానప్పుడు అది నిరాశను కలిగిస్తుంది. ఈ రకంగా ఇటు వృత్తిపరంగా, అటు వ్యక్తిగతంగా రెండు వైపులా నష్టం వాటిల్లుతుంది.

వర్క్‌హాలిక్ దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?

వర్క్‌హాలిక్స్ తమ వర్క్ నుంచి విరామం తీసుకుని ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవాలి. వర్క్‌హోలిక్స్ ధోరణులను వదిలివేసి, వ్యక్తులకు విశ్రాంతి ప్రాముఖ్యత, ఒత్తిడి లేని జీవనవిధానం అనుసరించడంపై అవగాహన కల్పించాలి.

ఒక రోజు సెలవు తీసుకోండి

కష్టపడే మనస్తత్వం కలిగిన వారు ఒక రోజు సెలవు తీసుకుంటేనే అది మన కెరీర్‌పై ప్రతికూల పరిణామాలు చూపుతుందని నమ్ముతారు. కానీ వృత్తి-జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడమే అతిపెద్ద పని. కాబట్టి ఒకరోజు సెలవు తీసుకుంటే తప్పులేదు. అలాగే ఒకరోజు కాస్త తక్కువ పనిచేసినా తప్పులేదు. ఈ విషయంలో మీకు మీ సీనియర్ అధికారులతో ఇబ్బంది ఉంటే.. మీ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సరైన విభాగానికి మీ అవసరాన్ని తెలయజేసి విరామం తీసుకోవచ్చు.

సృజనాత్మకంగా ఏదైనా చేయండి

వృత్తి నుంచి స్వల్ప విరామం తీసుకున్నప్పుడు వేరే పనులు కాకుండా మీ సృజనాత్మక నైపుణ్యాలను బయటకు తీయండి. మీ అభిరుచులకు తగినట్లుగా కొత్తగా ఏదైనా ప్రయత్నించండి. ఫోటోగ్రఫీ, పెయింటింగ్ లేదా సంగీతం ఇలా ఏదైనా ప్రయత్నించవచ్చు. ఇది మీ మనస్సుకు విశ్రాంతినిచ్చి, ఒత్తిడిని మాయం చేస్తుంది. ఆ మరుసటి రోజు మీరు హుషారుగా పనిచేస్తారు.

ఆఫీస్ ఎపిసోడ్స్ చూడండి

ఓటీటీలో లేదా టీవీలో ఎక్కడైనా ఆఫీసుకు సంబంధించిన ఎపిసోడ్స్ చూడండి. ఇవి చాలా సరదాగా ఉంటాయి. అందులో కొన్ని మీకు దగ్గరగా ఉంటాయి. వర్క్‌ప్లేస్ కామెడీని ఎంజాయ్ చేయవచ్చు. హాయిగా నవ్వుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్