Telugu News  /  Lifestyle  /  Woman Becomes Oldest Living Person At 115 Shares Secrets Of Her Long Life
మారియా బ్రన్యాస్ మోరెరా.. ప్రపంచంలోనే ఇప్పుడు అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తి
మారియా బ్రన్యాస్ మోరెరా.. ప్రపంచంలోనే ఇప్పుడు అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తి (Instagram/@guinnessworldrecords)

115 ఏళ్ల దీర్ఘాయువుతో గిన్నిస్ రికార్డ్.. సీక్రెట్స్ ఇవేనంటున్న మారియా

20 January 2023, 11:03 ISTHT Telugu Desk
20 January 2023, 11:03 IST

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా, మహిళగా గిన్నిస్ రికార్డు సాధించిన మారియా బ్రన్యాస్ మోరెరా తన దీర్ఘాయువుకు సీక్రెట్స్ షేర్ చేశారు.

ప్రపంచంలోనే ప్రస్తుతం ఎక్కువ కాలం జీవించి ఉన్న వ్యక్తిగా, మహిళగా మరియా బ్రన్యాస్ మోరెరా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూఆర్)కు ఎక్కారు. ఇటీవలే గిన్సీస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సంగతి షేర్ చేసింది. మరియా బ్రన్యాస్ మెరెరా 1907 మార్చి మాసంలో అమెరికాలో జన్మించారు. ప్రస్తుతం ఆమె స్పెయిన్‌లో నివసిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘మోరెరాకు జనవరి 19, 2023తో 115 ఏళ్ల 321 రోజుల వయస్సు. మారియా బ్రన్యాస్‌ను ఇప్పుడు ప్రపంచంలోనే ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత ఎక్కువ వయస్సు గల మహిళగా, వ్యక్తిగా గుర్తించాం. 118 ఏళ్ల ల్యూసిల్ రాండాన్ (ఫ్రాన్స్) మరణంతో తరువాత ఈమెకు ఈ గుర్తింపు దక్కింది. మోరెరా శాన్‌ఫ్రాన్సిస్కో (క్యాలిఫోర్నియా)లో మార్చి 4, 1907న జన్మించారు. అంతకుముందు ఏడాదే ఆమె తల్లిదండ్రులు ఇక్కడికి వలస వచ్చారు. 8 ఏళ్ల తరువాత వారు స్పెయిన్‌కు తిరిగి వచ్చారు. అక్కడి కాటలోనియాలో సెటిల్ అయ్యారు. మారియాకు అప్పటి నుంచి ఈ ప్రాంతమే ఇల్లయ్యింది. ఇక్కడి రెసిడెన్సియా శాంటా మారియా డెల్ టూరా నర్సింగ్‌హోమ్‌లోనే గడిచిన 22 ఏళ్లుగా నివసిస్తున్నారు..’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన పోస్టులో సంబంధిత వివరాలు పంచుకుంది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ మారియా జీవిత ప్రయాణం గురించి బ్లాగులో మరికొన్ని విశేషాలు పంచుకుంది. మోరెరా దీర్ఘాయువుకు సంబంధించిన కోట్స్‌ను షేర్ చేసింది. ‘క్రమపద్ధతి, ప్రశాంతత, కుటుంబం, స్నేహితులతో మంచి అనుబంధం, ప్రకృతితో మమేకం అవడం, భావోద్వేగాల్లో స్థిరత్వం, చింతించకపోవడం, విచారించకపోవడం, సానుకూలతలు, విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండడమే దీర్ఘాయువుకు కారణం. ఆయురారోగ్యాలు కూడా అదృష్టమే అనుకుంటాను. అదృష్టం, అలాగే జన్యుప్రభావం కూడా..’ అని ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు చెప్పారు.

ఈ పోస్టు షేర్ చేసినప్పటి నుంచి 22 వేల లైక్స్ వచ్చాయి. చాలా మంది కామెంట్స్ చేశారు. ‘ఆమె చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. మరో 20 ఏళ్లకు పైగా ఆమె జీవిస్తారు..’ అని ఒకరు స్పందించారు. ‘అద్భుతం’ అని ఒకరు స్పందించగా.. 200 ఏళ్ల వరకు జీవించండి అని మరొకరు రాశారు.