బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి? ఏయే వ్యాధులకు ఈ చికిత్స అవసరం-what is bone marrow transplantation which diseases will require this treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Is Bone Marrow Transplantation Which Diseases Will Require This Treatment

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి? ఏయే వ్యాధులకు ఈ చికిత్స అవసరం

HT Telugu Desk HT Telugu
May 04, 2023 12:39 PM IST

బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి? ఇది ఏయే వ్యాధుల్లో చికిత్సగా ఉపయోగపడుతుంది? వంటి వివరాలపై క్యాన్సర్ వైద్య నిపుణుల వివరణ ఇక్కడ చూడండి.

బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై నిపుణులు అందించిన వివరాలు
బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై నిపుణులు అందించిన వివరాలు

బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారికి వైద్యులు సూచించే చికిత్సా విధానం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి ఈ చికిత్స ద్వారా కొత్త జీవితాన్ని అందించవచ్చని విజయవాడ లోని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ జి.కృష్ణారెడ్డి వివరించారు. డాక్టర్ జి. కృష్ణరెడ్డి విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్‌‌లో గత 13 సంవత్సరాలుగా బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ లేదా మూలకణాల మార్చిడి చికిత్సని విజయవంతంగా అందిస్తున్నారు.హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో ఆయన ఈ చికిత్స సంబంధిత అంశాలు పంచుకున్నారు. సరైన రీతిలో ఈ చికిత్స తీసుకోవడం వల్ల బ్లడ్ క్యాన్సర్ నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొందవచ్చని చెబుతున్నారు. అయితే అసలు బోన్ మ్యారో అంటే ఏంటి? దాని చికిత్స విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బోన్‌ మ్యారో మార్పిడి చికిత్స అంటే ఏమిటి?

మానవుని శరీరంలో మూలకణాలు ఎముకల అంతర్భాగంలో వుంటాయి. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలతో పాటు ప్లేట్‌లెట్‌ కణాలు ఉంటాయి. నిరంతరం శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. పాత కణాలు చనిపోతాయి. మూలకణాల నుండి నిత్యం కొత్త కణాల పుట్టుక జరుగుతుంది.కొత్త కణాల పుట్టుక లోపం సరిచేయడానికి లేదా వివిధ రకాల క్యాన్సర్లలో ముఖ్యంగా రక్త క్యాన్సర్‌ నిర్మూలించడానికి ఈ చికిత్సా పద్ధతిని వాడుతుంటారు.

సాధారణంగా మూలకణాలను ఎముకల నుంచి సేకరిస్తారు. ప్రస్తుతం అధునాతన పద్ధతిలో కొన్ని మందులు ఇవ్వటం ద్వారా మూల కణాలను ఎముకల అంతర్భాగం నుండి రక్తంలోనికి రప్పించి, వాటిని సేకరించ గలుగుతున్నారు. సరైన మోతాదులో మూలకణాల సేకరణ జరిగిన తరువాత, రోగికి జబ్బుకు సంబంధించిన చికిత్సను అందిస్తారు. ఈ సేకరించిన కణాలను వారికి రక్తనాళాల ద్వారా ఎక్కిస్తారు.

మూలకణ చికిత్స పద్ధతులు

ఆటోలోగస్‌ మూలకణ మార్పిడి చికిత్స:

మల్టిపుల్ మైలోమా, తిరగబెట్టిన లింఫోమా క్యాన్సర్లును నిర్మూలించడానికి బోన్ మ్యారో చికిత్సా పద్ధతిని ఉపయోగిస్తారు. దీనిలో భాగంగా పేషెంట్ దగ్గర నుంచి తగిన మోతాదులో మూలకణాలను సేకరించి వాటిని భద్రపరుస్తారు. తదనంతరం అధిక మోతాదులో కీమోథెరపీ ఇస్తారు. ఈ కీమోథెరపీల వలన క్యాన్సర్‌ కణాలతో పాటు శరీరంలో ఉన్న మూలకణాలు కూడా చనిపోతాయి. తిరిగి కణాల ఉత్పత్తిని పునరుద్ధరించడానికి భద్రపరచిన మూలకణాలను ఎక్కిస్తారు.

అల్లోజెనిక్‌ మూలకణ మార్పిడి చికిత్స:

ఈ చికిత్సా పద్ధతిలో మూలకణాలను దాతల నుంచి సేకరిస్తారు. సాధారణంగా తోబుట్టువుల నుంచి తీసుకుంటారు. ఈ సమయంలో కొన్ని కీలక పరీక్షలు నిర్వహించి (హెచ్ఎల్ఏ పరీక్ష) కి పరీక్ష పేషంట్‌కి సరిపోతాయో లేదో నిర్ధారిస్తారు. ఈ చికిత్సలో పేషంట్‌ జబ్బుని దాతల నుంచి సేకరించి ఎక్కించిన మూలకణాలు తగ్గిస్తాయి.

మూలకణాలు ఎవరి నుంచి సేకరిస్తారు?

ఆటోలోగస్‌ మూలకణాల చికిత్సలో మూలకణాలను పేషంట్‌ దగ్గర నుంచి సేకరిస్తారు. అల్లోజెనిక్‌ మూలకణాల చికిత్సలో మూలకణాలను ఈ క్రింద పేర్నొన్న విధంగా సేకరిస్తారు.

a) HLA మ్యాచ్‌ ఉన్న తోబుట్టువుల నుంచి

b) HLA మ్యాచ్‌ ఉన్న బయటి వారి నుంచి (అన్‌ రిలేటెడ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌)

c) HLA మ్యాచ్‌ ఉన్న పిల్లల బొడ్డు తాడు నుంచి

d) తల్లిదండ్రుల నుండి గాని, పిల్లల నుంచి గాని (దీనినీ హాప్లో ట్రాన్స్‌ప్లాంట్‌ అంటారు) (HAPLO)

మూలకణ మార్పిడి చికిత్స అవసరమైన వ్యాధులు :

బ్లడ్‌ క్యాన్సర్‌, సంబంధిత వ్యాధులు:

  • మల్టీపుల్‌ మైలోమా
  • అక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా (AML)
  • అక్యూట్‌ లింపోబ్లాస్టిక్‌ లుకేమియా (ALL)
  • క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా (CML)
  • క్రానిక్‌ లింఫోసైటిక్‌ లుకేమియా (CLL)
  • తిరగబెట్టిన నాన్‌ -హడ్మిన్స్‌ లింఫోమా (NHL)
  • తిరగబెట్టిన హడ్పిన్స్‌ లింఫోమా (HL)
  • మైలో డిస్సాస్టిక్‌ సిండ్రోమ్‌ (MDS)

సాలిడ్‌ ట్యూమర్స్‌:

  • తిరగబెట్టిన బీర్జ (Testis) క్యాన్సర్‌
  • న్యూరోబ్లాస్తోమా
  • తిరగబెట్టిన ఎవింగ్స్‌ సార్మోమో
  • తిరగబెట్టిన విల్మ్స్‌ (WILMS) క్యాన్సర్‌

ఇతర రుగ్మతలు

  • అప్లాస్టిక్‌ అనీమియా
  • తలసేమియా
  • సికిల్‌ సెల్‌ అనీమియా
  • జన్యుపరమైన న్యూట్రోపెనియా
  • ఇమ్యూనో డెఫిషియెన్సి సిండ్రోమ్‌ (వ్యాధి నిరోధక శక్తి లోపం)

- డా .జి .కృష్ణరెడ్డి – కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ నిపుణులు

డాక్టర్ జి.కృష్ణారెడ్డి – కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
డాక్టర్ జి.కృష్ణారెడ్డి – కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
WhatsApp channel

టాపిక్