Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతారా? ఈ మొక్కలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవట!-some plants are believed to bring good luck harmony and prosperity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతారా? ఈ మొక్కలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవట!

Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతారా? ఈ మొక్కలు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవట!

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 04:29 PM IST

ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకుంటే ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచైనా బయటపడతారట. ఈ మొక్కలు ఒత్తిడి, ఆందోళనలు తగ్గించి పాజిటివ్ వైబ్రేషన్స్ కలగజేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది, ఎలప్పుడూ ఉత్సాహంగా ఉంటారని వారంటున్నారు.

స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్ (pexels)

ఆదాయం బాగానే ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు చాలా మందే ఉంటారు. వ్యాపారంలో లాభాలు ఎన్ని వచ్చినా ఏదో రూపంలో డబ్బు ఖర్చు అయిపోయి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ఈ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని దేవుడ్ని పార్థిస్తుంటారు. దేవుడిపైనే భారం వేస్తుంటారు. 

అయితే వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకుంటే ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుంచైనా బయటపడతారట. ఈ మొక్కలు ఒత్తిడి, ఆందోళనలు తగ్గించి పాజిటివ్ వైబ్రేషన్స్ కలగజేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎలప్పుడూ ఉత్సాహంగా ఉంటారని వారంటున్నారు.

మరి ఆ మొక్కలేంటి, వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉంటే ఎంతో మేలు

జమ్మి మొక్క:  మన పురాణ గాథల ప్రకారం జమ్మి చెట్టు ప్రాముఖ్యత ఎలాంటిదో మనకు తెలిసిందే. ఇంట్లో కూడా జమ్మి మొక్క ఉండటం అనేది చాలా శుభప్రదంగా చెప్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం జమ్మి మొక్క ముందు ప్రతిరోజూ ఆవాల నూనెతో దీపం వెలిగిస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.

మనీ ప్లాంట్: చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ ని పెంచుకోవడం మనం చూస్తాం. ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది, ఆ ఇంటికి ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. పైగా ఈ మొక్క ఇంటికి ప్రత్యేక అలంకరణగా ఉంటుంది, అంతేకాకుండా ఇది చాలా సులువుగా ఏ చోటనైనా పెరుగుతుంది.

తులసి మొక్క: హిందువులకు సంబంధించి తులసి మొక్క లేని ఇళ్లంటూ ఉండదు. ప్రతి ఇంటి గుమ్మం ముందు తులసి మొక్క ఉండాల్సిందే. తులసి చెట్టును దేవతల ప్రతిరూపంగా భావిస్తారు. రోజూ ఆ మొక్కకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కూడా, కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

వెదురు మొక్క: ఇంటి ఆవరణలో వెదురు మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెదురు మొక్క కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

స్నేక్ ప్లాంట్: స్నేక్ ప్లాంట్ గాలిని శుద్ధి చేస్తుంది. రోడ్డు పక్కన ఇళ్లు ఉన్న వాళ్లు ఈ మొక్కను పెంచుకోవడం వల్ల బయట నుంచి వచ్చే కాలుష్యమైన గాలిని శుద్ది చేసి మంచి గాలిని ప్రసరింపజేస్తుంది. వాస్తు ప్రకారంగా చూస్తే, స్నేక్ ప్లాంట్ ఇళ్లల్లో ఉంటే వారికి ఆర్ధిక సమస్యలు ఉండవు.

తూజా ప్లాంట్: ఈ మొక్కను రకరకాల పేర్లతో పిలుస్తారు. మన వద్ద ఇది మోర్ పంఖ్ అనే పేరుతో పాపులర్. దీనికి ఆకులు నెమలి ఈకళ్లగా విచ్చుకున్నట్లుగా ఉంటాయి. అందుకే దీనికాపేరు వచ్చింది. ఈ మొక్కలను గార్డెన్ లలో వివిధ ఆకృతుల్లో చూడవచ్చు. ఇది మనీ ప్లాంట్ తరహా మొక్క. ఇంట్లో పెంచుకుంటే అదృష్టం కలిసి వచ్చి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మక.

ఎరికా పామ్: ఇది కూడా అలంకరణ కోసం ఉపయోగించే మొక్క. ఇళ్లల్లో, కార్యాలయాలలో గుమ్మం ఎదురుగా స్వాగతం పలుకుతున్నట్లుగా కుండీలలో వీటిని పెంచుతారు. ఇవి చూడటానికి చిన్న కొబ్బరి చెట్లలా ఉంటాయి. ఈగ్ మొక్కలు ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి.

పైన పేర్కొన్న మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంటికి అందంతో పాటు ఆర్థిక వృద్ధిని చేకూరుస్తాయి. అయితే ఈ మొక్కలను ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఎండిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కను నాటాలి కానీ, వాటినే పెంచరాదు.

WhatsApp channel