Fasting Diet | ఫాస్ట్ ఫుడ్ వద్దు ఫాస్టింగ్ సమయంలో ఇలాంటి ఆహారాలు తీసుకోండి!-say no to fast food include these foods when you are on fasting ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Say No To Fast Food, Include These Foods When You Are On Fasting

Fasting Diet | ఫాస్ట్ ఫుడ్ వద్దు ఫాస్టింగ్ సమయంలో ఇలాంటి ఆహారాలు తీసుకోండి!

HT Telugu Desk HT Telugu
Apr 10, 2022 02:03 PM IST

ఉపవాసం ఉంటున్నప్పుడు శరీరం నీరసంగా అనిపిస్తుంది. చాలా గంటలుగా ఆహారం తీసుకోకుండా ఒక్కసారి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. తరచూ ఉపవాసం ఉంటే మలబద్ధకం సమస్య ఉంటుంది. కాబట్టి శక్తివంతమైన ఇలాంటి ఆహారాన్ని తీసుకోండి.

Fasting Diet
Fasting Diet (Pixabay)

రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నారా? చాలా మంది మతపరమైన కారణాల వల్ల లేదా వ్యక్తిగత కారణాల వలన అనేక సందర్భాలలో ఉపవాసం ఉంటారు. కొంతమంది బరువు తగ్గించుకోవడానికి కూడా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఉండే రోజుల్లో నీరసంగా అనిపించకుండా ఉండాలంటే శరీరానికి శక్తిని అందించించే బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. 

ఇక, బయటి నుంచి తెప్పించుకునే చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఏ సమయంలోనైనా తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.

ఉపవాసం ఉన్నా లేదా ఉండాల్సి వచ్చినా ఈ 5 రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే మీకు నీరసంగా అనిపించదు. ఎంతో ఆరోగ్యం కూడా. కాబట్టి మీ డైట్ లో చేర్చుకోండి.

బెర్రీ పండ్లు:  

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీలు మొదలైన బెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఎక్కువ శక్తినిచ్చి, తక్కువ ఆహారాన్ని తినాలని కోరుకునేవారు ఎక్కువమంది బెర్రీ పండ్లను తినడానికి ఇష్టపడతారు.

నట్స్: 

శరీరం తన ముఖ్యమైన విధులను నియంత్రించడానికి కొవ్వులు ఎంతో అవసరం. గిణ్జలు, పలుకుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే ఆకలి తీరుతుంది, కావాల్సిన శక్తి లభిస్తుంది. బాదం, వాల్‌నట్, వేరుశెనగ మొదలైనవి తీసుకోవాలి. ఇలాంటివి ఇప్పుడు మరింత రుచికరంగా న్యూట్రిషన్ బార్ ల రూపంలో కూడా లభ్యమవుతున్నాయి.

క్రూసిఫరస్ వెజిటేబుల్స్:

 తరచూ ఉపవాసం చేస్తూ ఉంటే జీర్ణ సమస్యలు, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆకుపచ్చని కూరలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెల్సిందే. ఆకుపచ్చని కూరల్లో గ్లూకోసినోలేట్‌లు, బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధనలు తెలిపాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచైనా శరీరాన్ని కాపాడతాయి. మీ జీర్ణక్రియను మెరుగుపరిచి ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ లాంటివి తినాలి.

ఎముకల పులుసు: 

దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకల పులుసు తీసుకోవాలి. ఎక్కువ గంటలు ఆహారం తినకుండా ఉండాల్సి వచ్చినపుడు ఎముకల పులుసు తీసుకుంటే శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఎండాకాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం నుంచి రక్షిస్తుంది. ఎముకలను బాగా ఉడకబెట్టి పాయా రూపంలో తీసుకుంటే రుచికిరుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

సీఫుడ్:

 శరీరానికి అవసరమైన ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి సీఫుడ్ మంచి ఆహారం. ఇతర మాంసాహార ఉత్పత్తులతో పోలిస్తే సీఫుడ్ ఎంతో మేలైన ఆహారం. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులోని పోషకాలు శరీరానికి ఎన్నో విధాలుగా తోడ్పడుతాయి. మితంగా తీసుకోవడం వల్ల బహుళ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చేపలు, రొయ్యలు, పీతలు మొదలగునవి తీసుకోవాలి. అయితే మితంగా తీసుకుంటేనే ఉత్తమం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్