New Car vs Used Car | ఏ కారు బెస్ట్‌? కొత్తదా లేక సెకండ్‌ హ్యాండా?-new car or used car which one is best ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Car Vs Used Car | ఏ కారు బెస్ట్‌? కొత్తదా లేక సెకండ్‌ హ్యాండా?

New Car vs Used Car | ఏ కారు బెస్ట్‌? కొత్తదా లేక సెకండ్‌ హ్యాండా?

Hari Prasad S HT Telugu
Feb 14, 2022 09:32 AM IST

తొలిసారి కారు కొంటున్నవారు కొత్త కారు కొనాలా? సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలా అన్నదానిపై తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఆర్థిక స్థోమత, అవసరం, కారు కొంటున్న కారణాలపై ఆధారపడి ఉంటుంది. కారు ఒకప్పటిలాగా లగ్జరీ కాకపోయినా.. ఇప్పటికీ కాస్త ఖరీదైన వస్తువే. అందుకే కొత్తగా కారు కొంటున్న వారు అన్ని రకాలుగా ఆలోచన చేసి ముందడుగు వేస్తున్నారు.

సెకండ్ హ్యాండ్ కారు
సెకండ్ హ్యాండ్ కారు

New Car vs Used Car.. కారు కొత్తదైనా, పాతదైనా ఇప్పుడు ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా రెండేళ్ల నుంచి కరోనా దెబ్బకు చాలా మంది రైళ్లు, బస్సుల్లాంటి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాడటానికి భయపడుతున్నారు. బైకులపై ఎక్కువ దూరాలు వెళ్లాలంటే కష్టం. దీంతో మధ్యతరగతి వాళ్లయినా సరే అప్పులు చేసి మరీ కార్ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కొత్త కారు కొనాలా? సెకండ్‌ హ్యాండా అన్నదానిపై మీకు అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ ఆర్టికల్‌.

కొత్త కారు vs సెకండ్‌ హ్యాండ్‌ కారు

కొత్త కారు, సెకండ్‌ హ్యాండ్‌ కారు.. నిజానికి దేనికి ఉండే లాభాలు దానికి ఉన్నాయి. ముందుగా చెప్పుకున్నట్లు ఎవరి ఆర్థిక స్థోమత, అవసరం, కారు ఎందుకు కొంటున్నారన్నదానిపై ఇవి ఆధారపడి ఉంటాయి. కొత్త కారుతో పోలిస్తే సెకండ్‌ హ్యాండ్‌ కారు ఖరీదు తక్కువ. లోను తీసుకున్నా.. ఈఎంఐల భారం పెద్దగా ఉండదు. అయితే కొత్త కారు విషయానికి వస్తే ఖరీదు ఎక్కువైనా.. మైలేజ్‌, మెయింటెనెన్స్‌, ఆధునిక టెక్నాలజీ, నచ్చిన రంగులు వంటి లాభాలు ఉంటాయి. సెకండ్‌ హ్యాండ్‌ కారు విషయంలో ఇవి ఉండవు. 

మైలేజ్‌ కాస్త తక్కువగానే ఉంటుంది. మెయింటెనెన్స్‌ ఎక్కువ. కొన్నేళ్ల కిందటిది కావడంతో ఆధునిక హంగులు ఉండవు. ఇక కలర్‌ విషయంలోనూ ఒక్కోసారి కాంప్రమైజ్‌ కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తొలిసారి కారు కొనేవాళ్లు, అందులోనూ మధ్యతరగతి వాళ్లు ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కారు కొనడానికి బడ్జెట్‌ ఎంత ఉంది? కారు ఎందుకు కొంటున్నాం? ఆ కారును రెగ్యులర్‌గా వాడతామా లేదంటే ఎప్పుడో అవసరమైన సమయంలోనేనా అన్న విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.

సెకండ్‌ హ్యాండ్‌ కారు ప్రయోజనాలు

ఒకప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలంటే చాలా కష్టంగా ఉండేది. కార్లే తక్కువగా ఉండేవి. అందులోనూ తెలిసిన వాళ్ల దగ్గర, నమ్మకమైన కారు దొరకడం అంత సులువయ్యేది కాదు. కానీ ఈ కాలంలో కొత్త కార్లలాగే సెకండ్ హ్యాండ్‌ కార్లు కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. వాటికోసం ప్రత్యేకంగా షోరూమ్‌లు ఉన్నాయి. ఆ షోరూమ్‌ల వాళ్లే లోన్లు కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇక అవసరం, అభిరుచికి తగినట్లుగా ఎన్నో రకాల కార్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. పైగా ఈ షోరూమ్‌లు అంతకుముందు యజమానులు చాలా బాగా మెయింటేన్‌ చేసిన కార్లనే కొని అందుబాటులో ఉంచుతున్నాయి. కొంతకాలం వారెంటీ ఇవ్వడంతోపాటు గరిష్ఠంగా ఏడు రోజుల వరకూ రిటర్న్‌ పాలసీలు కూడా ప్రకటిస్తున్నాయి. దీంతో క్రమంగా ఈ సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది.

సెకండ్‌ హ్యాండ్‌ కారు తరుగుదల తక్కువ

కొత్త కారుతో పోలిస్తే సెకండ్‌ హ్యాండ్‌ కారు విలువ చాలా త్వరగా తగ్గిపోతుంది. నిజానికి ఓ కొత్త కారు కొని షోరూమ్‌ నుంచి బయటకు వచ్చిందంటే చాలు దాని విలువలో 20 నుంచి 25 శాతం కోల్పోతుందంటే నమ్ముతారా? క్రమంగా దాని వయసు పెరుగుతుంటే.. విలువ తగ్గుతూ వస్తుంది. అదే సెకండ్‌ హ్యాండ్‌ కారు విషయంలో ఈ తరుగుదల తక్కువగా ఉంటుంది. అప్పటికే 20-25 శాతం విలువ కోల్పోయి ఉంటుంది కాబట్టి.. సెకండ్‌ హ్యాండ్‌ కారును ఆ తర్వాత తిరిగి అమ్మాలనుకుంటే.. కొత్త కారు స్థాయి తరుగుదల ఉండదు. 

అందువల్ల బడ్జెట్ కాస్త తక్కువగా ఉండి, ఈఎంఐల భారం పెద్దగా ఉండకూడదు అనుకుంటే వాడిన కార్లే ఉత్తమం. పైగా ఈ కాలంలో టెక్నాలజీ వాడకం పెరిగిపోయిన కొద్దీ.. రోజుకో కొత్త మోడల్‌, కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు కొన్న కొత్త కారులో లేని ఫీచర్‌.. రేపు రాబోయే మరో కారులో ఉంటోంది. అందుకే ఈ మధ్య మొబైల్‌ ఫోన్లు ఇలా కొని అలా అమ్మేస్తున్నట్లు.. చాలా మంది కార్లను కూడా ఎక్కువ కాలం నడపకుండానే మళ్లీ అమ్మకానికి పెడుతున్నారు. అలా చూసుకుంటే.. సెకండ్‌ హ్యాండ్‌ కారే చాలా బెటర్‌.

తక్కువ ధరలో లగ్జరీ

ఐదారేళ్ల కిందటి నుంచి కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్‌, రివర్స్‌ పార్కింగ్ సెన్సర్లు వస్తున్నాయి. వీటిని సెకండ్‌ హ్యాండ్‌లో కొంటే తక్కువ ధరకే ఇలాంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను అనుభవించవచ్చు. ఇంటీరియర్‌, మ్యూజిక్‌ సిస్టమ్‌ పరంగానూ ఐదారేళ్ల వయసున్న కార్లు మెరుగ్గానే ఉన్నాయి. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కొత్త కారుతో పోలిస్తే సెకండ్‌ హ్యాండ్‌ కారుకు చాలా తక్కువగా ఉంటుంది. కారు తరుగుదలను బట్టి ఇన్సూరెన్స్‌ ప్రీమియంను లెక్కగడతారు. కారు చేతులు మారినప్పుడల్లా ఇది మారుతూ ఉంటుంది. తొలిసారి కారు కొంటున్నవారికి, కారు కొత్తగా నేర్చుకుంటున్న వారికైతే సెకండ్‌ హ్యాండ్‌ కారుకు మించిన ఆప్షన్‌ మరొకటి లేదు. 

కారు నేర్చుకుంటున్న వాళ్లు అప్పుడో, ఇప్పుడో కారుకు కొన్ని గాయాలు చేయడం సహజమే. కొత్త కారుపై ఓ చిన్న గీత పడిన మనసు చివుక్కుమంటుంది. అదే సెకండ్‌ హ్యాండ్‌ అయితే పెద్దగా బాధపడాల్సిన పని ఉండదు. మైలేజ్‌ తక్కువ, మెయింటెనెన్స్‌ ఎక్కువే అయినా.. తక్కువ బడ్జెట్‌ ఉన్నప్పుడు, కారును రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు అవసరం అయినప్పుడే వాడతామని అనుకునే వాళ్లు ఈ సెకండ్‌ హ్యాండ్‌ కారు వైపు చూడటమే అన్ని విధాలా మంచిది. చివరిగా కారు అనేది ఆస్తి కాదు. అదొక లయబిలిటీ. ఇల్లు, భూమిలాగా కారు విలువ రోజురోజుకూ పెరగదు. తగ్గుతూ వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం