Nature Conservation Day 2022 : సహజ వనరులు వృధా చేసింది చాలు.. ఇలా సేవ్ చేద్దాం..
మనం ప్రకృతిని సంరక్షించే ముందు.. దానిని మనం ఎలా ప్రభావితం చేస్తున్నామో కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే సరైన చర్యలు తీసుకోగలము. మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయి.. ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి మనం ఏమి చేయగలము అనే అంశాల గురించి అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం జూలై 28న తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నాము.
World Nature Conservation Day 2022 : ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అనేది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ ప్రాముఖ్యత, ప్రకృతి గురించి అవగాహన పెంచే అంతర్జాతీయ దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం జూలై 28న నిర్వహిస్తున్నారు. మనకు ప్రకృతి ఇచ్చిన సహజ వనరులను కాపాడుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించడం అనే లక్ష్యంతో ఈ డేని నిర్వహిస్తున్నారు.
అంతరించిపోవడానికి అంచున ఉన్న మొక్కలు, జంతువులను రక్షించడమే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ప్రధాన లక్ష్యం. ఈ రోజు మన వనరులను, పర్యావరణాన్ని పెద్ద మొత్తంలో సేవ్ చేయడానికి తీసుకోగల వ్యక్తిగత చర్యపై దృష్టి పెట్టడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా పర్యావరణాన్ని రక్షించడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం
పర్యావరణానికి పెద్ద ముప్పు ప్లాస్టిక్. ఇది నిజ జీవితంలో ఉపయోగించడానికి అనుకూలమైనదే అయినా.. ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులు పునర్వినియోగించలేము కాబట్టి.. పర్యావరణ పరిరక్షణ కోసం చేయాల్సిన మొదటి పనిలో ప్లాస్టిక్కు నో చెప్పడమే. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పర్యావరణ అనుకూల పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించండి.
2. కార్బన్ రహిత జీవనశైలి
మీరు తినే భోజనం పర్యావరణ అనుకూల పద్ధతిలో సరఫరా చేయకపోతే గణనీయమైన కార్బన్ విడుదల అవుతుంది. ఇంట్లో కాలానుగుణ, స్థానిక మొక్కల ఆధారిత వస్తువులకు మారండి. జంతు ఆధారిత భోజనం, ఉత్పత్తులను వదులుకోవడం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. పైగా జీవహింస కూడా ఉండదు.
3. శక్తిని ఆదా చేసే ఉపకరణాలను ఉపయోగించండి
సాధ్యమైనప్పుడల్లా శక్తిని ఆదా చేసే ఉపకరణాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి. LED లైట్ బల్బులకు మారండి. ఎందుకంటే అవి తక్కువ శక్తిని వినియోగిస్తాయి. కాలక్రమేణా మీ విద్యుత్ ఖర్చు కూడా తగ్గుతుంది.
4. నీటిని ఆదా చేయండి
వాతావరణ మార్పులకు ప్రధాన కారణంలో ఒకటి తాగునీటి స్థాయి క్షీణించడం. నీటిని వృథాగా ఖర్చు చేయకుండా చూసుకోండి. నీటి కుళాయిలను ఆపడం, నీరు వృధాగా పోతున్నట్లు గమనిస్తే.. దానిని కంట్రోల్ చేయడం.. వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం చాలా మంచిది. ఇలా చేస్తే ఏటా వేల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు.
5. కంపోస్టింగ్ ప్రారంభించండి
కంపోస్టింగ్ అనేది మీ పెరటి తోటకు ప్రయోజనం చేస్తుంది. అంతేకాకుండా భూమిసారాన్ని పెంచుతుంది. ల్యాండ్‌ఫిల్‌కి వెళ్లే చెత్త మొత్తాన్ని తగ్గించడానికి సులభమైన, సమర్థవంతమైన సాంకేతికత ఇది. గుడ్డు పెంకులు, కూరగాయల స్క్రాప్‌లు, టీ బ్యాగ్‌లతో సహా దాదాపు అన్ని వంటగది వ్యర్థాలను దీనికోసం ఉపయోగించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్