Monday Motivation : మనుషుల్ని మనుషుల్లాగా చూడడం నేర్చుకోండి.. సమాజం బాగుపడుతుంది-monday motivation on no color no religion no nationality should come between us ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monday Motivation On No Color No Religion No Nationality Should Come Between Us

Monday Motivation : మనుషుల్ని మనుషుల్లాగా చూడడం నేర్చుకోండి.. సమాజం బాగుపడుతుంది

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 25, 2022 08:00 AM IST

సమాజంలో అతిపెద్ద లోపం ఏంటంటే మనుషుల్ని మనుషుల్లా చూడకపోవడం. వారి ప్రాంతం, కులం, మతం, రంగు అనే వివక్షలు చాలా మంది మనసులోతుల్లో నాటుకుపోయాయి. పైకి ఎంత డిగ్నిటిగా కనిపించినా.. వీటిల్లో ఏదొక ప్రశ్న అడిగి.. ఎదుటివారిని ఇబ్బందులకు గురిచేస్తారు. అలా ఎప్పటికీ జరగకూడదు. ముందు మీ మనసులోనుంచి ఈ వివక్ష భావాలను తీసివేయాలి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : రంగు, రుచి, వాసన, చిక్కదనం అంటూ ఓ టీపౌడర్ యాడ్ ఉంటుంది. వాళ్ల బ్రాండ్​ని ప్రమోట్ చేయడం కోసం ఆ సంస్థ వాళ్లు ఎంచుకున్న మార్గం అంది. అలాగే జాతి, మతం, కులం, రంగు, ప్రాంతం అనే వివక్షలు చాలా మంది మనసుల్లో ఉన్నాయి. అవి మా బ్రాండే గొప్ప అనుకునేలా చేస్తాయి. మీరు కూడా అలానే అనుకుంటున్నారేమో కానీ కాదు. అప్పుడెప్పుడో పూర్వాకాలంలో మనిషి స్వార్థం కోసం పెట్టుకున్న ఈ వివక్షలను ఇప్పటికీ మనం ముందుకు తీసుకెళ్తున్నామంటే ఎంత దుర్మార్గం. ఇవి ఎలాంటివంటే మనలో మెల్లగా విషాన్ని నింపేస్తాయి. తర్వాత ఎవరిని మనుషుల్లా కూడా చూడలేము. కాబట్టి అలాంటి విషాన్ని శరీరం అంతా నింపేసుకోకుండా బయటకు పంపేయండి. ఇది మీకు అస్సలు మంచిది కాదు. ఏదొక రోజు ఆ విషం మిమ్మల్ని కబళించవచ్చు. లేదా ఇతరులను దారుణంగా ఇబ్బంది పెట్టవచ్చు.

ఇతరులను సొంత సోదరులు, సోదరీమణుల్లా చూడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనిషి లాగా చూస్తే చాలు. ఇతరులతో భిన్నంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది. సరే మీ జాతి, మతం, కులం అంటే మీకు గౌరవం ఎక్కువ ఉందా? అప్పుడు మీవాళ్లు అనిపించే వాళ్లని ఎలానో మంచిగా చూస్తారు. మరి ఇతరులతో వివక్ష ఎందుకు. జస్ట్ వారిని కూడా మనుషుల్లా చూస్తే చాలు కాదు. మీకు సాయం చేయాలని లేకపోతే.. కుదరదనో లేదా వేరే వాళ్లు ఆ సాయం మీకు చేస్తారనో చెప్పి పంపిస్తే అయిపోద్ది. అంతేకానీ పరస్పరం పక్షపాతాలు చూపిస్తే మీకు ఏమొస్తుంది?

ఒక తండ్రికి పుట్టిన బిడ్డల్లోనే రంగు, రూపుల్లో చాలా తేడాలు ఉంటాయి. కాస్త భిన్నంగా ఉండే పిల్లవాడు నా పిల్లవాడు కాదు అని ఏ తండ్రి, తల్లి అనుకోదు కదా. మిగిలిన పిల్లలను చూసినట్లే.. అంతే ప్రేమగా ఆ పిల్లవాడిని చూస్తారు. ఇద్దరు కవలపిల్లలు అయినా సరే ఒకేలాగా ఉండరు. రూపు, రంగు ఒకటే అయినా.. నడవడిక వేరుగా ఉంటుంది. అలాంటిది ఇంతమంది ఉన్న సమాజంలో రంగు, రూపుల్లో తేడాలు కచ్చితంగా ఉంటాయి. ఆ తేడాలను పట్టుకుని వేలాడితే.. మీరే సమాజంలో అందరికంటే తేడాగా మారిపోతారు జాగ్రత్త.

కొందరు ఎలా ఉంటారంటే.. వీటిని వేలిత్తి చూపి అవతలివారిలో అభద్రతా భావాన్ని పెంచేస్తారు. వారు ఎంత మంచిగా చదువుకున్నా.. ఎంత మంచి పనులు చేసినా.. ఈ రంగు, మతం, కులం అనేవి తీసుకువచ్చి వారిని తక్కువగా చూడడం ప్రారంభిస్తారు. ఇలాంటి మాటలతో అవతలి వారిలో తెలియకుండానే అభద్రతా భావం పెరిగిపోతుంది. ఎవరూ కావాలని ఓ వర్గంలోనో, కులంలోనో, రంగులోనో పుట్టరు కదా. పుట్టలేరు కూడా. ఒకవేళ మీరు చనిపోయి మీకు కావాల్సిన కమ్యూనిటిలోనే పుడతారా? అలాంటి ఇంపాజిబుల్​ థింగ్స్​ని పక్కన పెట్టి మనుషుల్ని మనుషుల్లా చూడడం నేర్చుకోండి.

ఇతరులను సమానంగా చూస్తారో లేదో మీ ఇష్టం. కానీ ఇతరులను వేరు చేసి మాట్లాడే హక్కు ఏమాత్రం మీకు లేదనే విషయం గుర్తించుకోండి. కానీ మనం అందరినీ సమానంగా చూడడం, సమానత్వాన్ని విశ్వసించడం ప్రారంభించిన రోజు.. శాంతి, సామరస్యంతో ముందుకు వెళ్తాం. మీరు ఇలా చేస్తే.. మీరు నమ్మే దైవం కూడా సంతోషిస్తుంది. దేవుడు ఒక్కడే అని ప్రతి మతం చెప్తుంది. నిజమే దేవుడు ఒక్కడే కానీ వివిధ రూపాల్లో, వివిధ పేర్లతో పిలుచుకుంటున్నాం అంతే. అలాగే మనుషులంతా ఒక్కటే. వివిధ రూపాల్లో.. వివిధ ప్రాంతాల్లో, వివిధ జాతుల్లో, మతాల్లో తిరుగుతున్నామంతే. అంతకు మించి తేడా ఏమి లేదు. మీకు ఏమున్నాయో.. వారికి అవే ఉన్నాయి. కోట్ ఆఫ్ ద డే

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్