Kovalam beach tour: కోవలం బీచ్ టూర్.. న్యూఇయర్‌లో ఫారినర్స్‌తో సందడి
Kovalam beach tour: క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వరుస పండగలు వస్తున్నాయి. మీరు మీమీ ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఎదుర్కొంటున్న స్ట్రెస్ తగ్గించుకునేందుకు హాలిడే ప్లాన్ చేస్తున్నట్టయితే కోవలం బీచ్ ఎంచుకోవచ్చు.
కోవలం బీచ్ ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షిస్తున్న ఇండియన్ బీచ్‌లలో ఒకటి. కేరళ రాజధాని తిరువనంతపురం శివార్లలోలోనే ఈ కోవలం బీచ్ ఉంటుంది.
ఇక్కడికి యురోపియన్ దేశాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. మూన్ షేపులో ఉండే మూడు బీచ్‌లతో ఈ కోవలం బీచ్ పర్యాటకులను అలరిస్తుంది. విదేశీ పర్యాటకులు ఇక్కడ మరీ ముఖ్యంగా సన్‌బాతింగ్ కోసం వస్తారు.
ఇక్కడ సన్ బాతింగ్‌తో పాటు, స్విమ్మింగ్, విశ్రాంతికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే విభిన్న రకాల మసాజ్ సేవలు, ముఖ్యంగా హెర్బల్ బాడీ టోనింగ్ మసాజ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. కేరళ ఆయుర్వేద రిస్టార్టులు, యోగా కేంద్రాలూ ఉన్నాయి. క్రూజింగ్ సేవలు కూడా ఇక్కడ లభిస్తాయి. బీచ్‌లో 11 గంటల నుంచే సందడి మొదలవుతుంది. రాత్రి వరకూ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. బీచ్ సమీపంలోనే వసతి గృహాలు, బడ్జెట్ కాటేజీలు, విలాసవంతమైన హోటళ్లూ ఉన్నాయి. ఇక షాపింగ్ సెంటర్లకు కొదవేం లేదు. భోజనం కూడా అన్ని రకాలుగా లభిస్తుంది. దక్షిణాది వంటకాలు మొదలు అంతర్జాతీయ శ్రేణిలో ఆహారం లభిస్తుంది.
కోవలం బీచ్ వద్ద చూడాల్సిన ప్రదేశాలు
కోవలంలో సేద తీరాక పక్కనే ఉన్న తిరువనంతపురం వెళ్లి అక్కడ గడపొచ్చు. తిరువనంతరపురంలో పద్మనాభ స్వామి దేవాలయం, నేపియర్ మ్యూజియం ప్రముఖ పర్యాటక కేంద్రాలు. అలాగే శ్రీ చిత్ర ఆర్ట్స్ గ్యాలరీ, రాష్ట్ర ప్రభుత్వ హస్తకళల ఎంపోరియం కూడా పర్యాటకులను అలరిస్తుంది.
కోవలం బీచ్ ఎలా చేరుకోవాలి?
ఫ్లైట్‌లో వెళ్లాలంటే త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగాలి. ఇక్కడి నుంచి 10 కి.మీ. దూరంలోని కోవలం బీచ్ ఉంటుంది. అలాగే ఈ బీచ్‌కు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ తిరువనంతపురం సెంట్రల్. ఈ స్టేషన్‌లో దిగితే 16 కి.మీ. దూరంలో కోవలం బీచ్ ఉంటుంది.
సికింద్రాబాద్ నుంచి అయితే తిరువనంతపురం చేరుకునేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంటుంది. దీనిలో 30 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకరికి టికెట్ ధర థర్డ్ ఏసీ టికెట్ అయితే రూ. 1700, సెకెండ్ ఏసీ టికెట్ అయితే రూ. 2,470, స్లీపర్ క్లాస్ అయితే రూ. 640 చెల్లించాలి. ఇక వరంగల్లు, విజయవాడల మీదుగా అయితే కేరళ ఎక్స్‌ప్రెస్, రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్, కేఆర్‌బీఏ-కేసీవీఎల్ ఎక్స్‌ప్రెస్ వంటివి అందుబాటులో ఉంటాయి.
కోవలం బీచ్‌లో వాతావరణం సెప్టెంబరు మాసం నుంచి మార్చి వరకు బాగుంటుంది. ముఖ్యంగా డిసెంబరు, జనవరి మాసాల్లో పర్యాటకులు బాగా వస్తుంటారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో కూడా భారీగా వస్తుంటారు.