World Happiness Day: లేఆఫ్స్‌ ఉన్నా సరే.. మీ సంతోషాన్ని ఇలా పెంచుకోండి-how to stay happy during layoffs experts share tips on world happiness day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Happiness Day: లేఆఫ్స్‌ ఉన్నా సరే.. మీ సంతోషాన్ని ఇలా పెంచుకోండి

World Happiness Day: లేఆఫ్స్‌ ఉన్నా సరే.. మీ సంతోషాన్ని ఇలా పెంచుకోండి

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 09:23 AM IST

March 20 International Day of Happiness: ఐక్య రాజ్యసమితి మార్చి 20వ తేదీని ఇంటర్నేషల్ డే ఆఫ్ హాపినెస్‌గా 2012లో ప్రకటించింది. ప్రజల జీవితంలో ఆనందం, సంతోషం ఎంత అవసరమో అవగాహన పెంచేందుకు దీనిని పాటిస్తున్నారు.

లేఆఫ్ కాలంలో మీ సంతోషాన్ని చెక్కు చెదరనివ్వొద్దంటున్న నిపుణులు
లేఆఫ్ కాలంలో మీ సంతోషాన్ని చెక్కు చెదరనివ్వొద్దంటున్న నిపుణులు

ఉద్యోగం నుంచి తొలగింపునకు గురికావడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఐటీ రంగం, ఎడ్యుటెక్, ఇతర స్టార్టప్ కంపెనీలు గత రెండు నెలల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ఇంకా చాలా మంది ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి రావొచ్చు. కష్టకాలంలో సానుకూలంగా, సంతోషంగా ఉండటం కష్టంగా మారవచ్చు. నాకే ఎందుకిలా జరుగుతోంది? అని ప్రతి వ్యక్తీ బాధలో కూరుకుపోతాడు. అయితే ఇదే మీకు మరొక రూపంలో వచ్చిన అవకాశంగా భావించవచ్చు.

నేడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను వివరించారు. ఆ సూచనలు పరిశీలించి, మీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించండి.

1) పరిస్థితిని ఉన్నదున్నట్టుగా అంగీకరించండి: కష్ట సమయాల్లో సంతోషంగా ఉండటానికి మొదటి అడుగు.. పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. దీనర్థం ప్రయత్నాలు వదులుకోమని కాదు. ఏం జరుగుతుందో గుర్తించడం, అలాగే పరిస్థితిని ఎదుర్కోవడానికి గల మార్గాలను కనుగొనడం అని గ్యాలప్ సర్టిఫైడ్ స్ట్రెంత్స్ కోచ్ ఫౌండర్ అభిషేక్ జోషి అన్నారు.

2) కృతజ్ఞతతో ఉండండి: మీ వద్ద ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండటం మీ దృష్టిని ప్రతికూలతల నుండి సానుకూలతల వైపు మార్చడానికి సహాయపడుతుందని అభిషేక్ జోషి చెప్పారు. ‘ఇతరుల పట్ల కూడా కృతజ్ఞతతో ఉండండి..’ అని సూచించారు. ‘కొత్త విషయాలను తెలుసుకోవడానికి, తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ పరిస్థితి(ఉద్యోగం కోల్పోవడం)ని చూడడం వంటి సానుకూలాంశాలపై దృష్టి పెట్టాలి. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తుల నుండి సపోర్ట్ తీసుకోండి. మీరు ముందుకు సాగడంలో వారి నుంచి సాయం పొందండి..’ అని ఆక్సేన్ పార్ట్‌నర్స్ కోఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సోని అన్నారు.

3) మీ బలాలను గుర్తించండి: ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రతిభ, సామర్థ్యాలు ఉన్నందున అవి ఏమిటో గుర్తించడమే సంతోషం కోసం మీ బలాన్ని ఉపయోగించడంలో వేసే మొదటి అడుగు అని జోషి సూచించారు. ‘మీ ఉద్యోగ స్థితి ద్వారా మీ విలువ నిర్వచించరని గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ నైపుణ్యాలు, ప్రతిభ, అనుభవం ఎప్పటికీ విలువైనవే. మీ కోసం చాలా అవకాశాలు వేచి ఉన్నాయి..’ అని విజ్‌కో సహ వ్యవస్థాపకులు ప్రేరణా గోయెల్ అన్నారు.

4) మీ బలాన్ని ఉపయోగించండి: ఇతరులకు సహాయం చేయడానికి మీ బలాన్ని ఉపయోగిస్తే అది మీకు రెట్టింపు ఆనందం ఇస్తుందని జోషి సూచించారు.

5) స్వీయ-సంరక్షణను ప్రాక్టీస్ చేయండి: ‘మీ గురించి మీరు పట్టించుకోవడం వల్ల మీరు మరింత సానుకూలంగా, సంతోషంగా ఉండగలుగుతారు. స్వీయ-సంరక్షణను అభ్యసించండి. ఇతరులను కూడా అలా చేయమని ప్రోత్సహించండి’ అని ఫౌండర్ స్ట్రెంత్స్ మాస్టర్స్ సూచించారు.

6) కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి: కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని మెరుగుపరచుకోవడానికి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని గోయెల్ సూచించారు. ‘మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మీ ఫీల్డ్‌లో ప్రస్తుతం అవసరమైన ఆన్‌లైన్ కోర్సు తీసుకోవడం లేదా వర్క్‌షాప్‌కు హాజరుకావడం గురించి ఆలోచించండి..’ అని సూచించారు.

7) నెట్‌వర్కింగ్: తొలగింపుల తర్వాత ఉద్యోగం కోసం వెతికే సమయంలో నెట్‌వర్కింగ్ కూడా కీలకం. కాబట్టి ఇండస్ట్రీ ఈవెంట్‌లకు హాజరయ్యేందుకు లేదా లింక్డ్‌ఇన్ లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మీ ఫీల్డ్‌లోని నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలని విజ్‌కో సహ వ్యవస్థాపకుడు చెప్పారు.

WhatsApp channel

సంబంధిత కథనం