Online Courses: ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు కావాలా? ఈ వెబ్‌సైట్‌లు చూడండి-education websites to teach you for free ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Education Websites To Teach You For Free

Online Courses: ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు కావాలా? ఈ వెబ్‌సైట్‌లు చూడండి

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 05:26 PM IST

కార్పొరేట్‌ విద్యాసంస్థలకు మించిన విద్య ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభిస్తుంది. ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఇప్పుడు పలు వెబ్‌సైట్‌ల ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులకు ఉచితంగా బోధన చేస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నాయి.

Online courses
Online courses

టెక్ట్స్‌బుక్‌లో ఉన్నవే చెప్పేవిధంగా కాకుండా ఒక విషయం పట్ల సరైన అవగాహన, నైపుణ్యాలు పెంపొందించే విధంగా విద్యా విధానాలు ఉంటే అవి విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇది అత్యవసరం కూడా! పిల్లలకు మంచి ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అందిస్తేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. అయితే విద్య అనేది వ్యాపారంగా మారిన నేటి సమాజంలో తమ పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులకు భారంగా పరిణమిస్తుంది.మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే? కచ్చితంగా ఉంది.

 కార్పొరేట్‌ విద్యాసంస్థలకు మించిన విద్య ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభిస్తుంది. ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఇప్పుడు పలు వెబ్‌సైట్‌ల ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులకు ఉచితంగా బోధన చేస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నాయి. ఇన్ఫర్మేటివ్ పాడ్‌క్యాస్ట్‌లు, వీడియోలు, నోట్స్‌తో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. మంచి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాలతో కూడిన బోధనలు చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తూ, మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇచ్చి ప్రోత్సాహిస్తున్నాయి.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే టాప్ టెన్ వెబ్‌సైట్‌ల జాబితా:

1. EdX: edx.org

2012లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, MIT సంయుక్తంగా ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించాయి. అన్‌లైన్ ద్వారా విద్యను అభ్యసించాలనుకునే చాలా మంది విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇది ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలకు చెందిన అత్యుత్తమ కోర్సులను అందిస్తోంది. హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్, MIT, కార్నెల్, IBMతో పాటు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ, హాంకాంగ్ పాలిటెక్నిక్‌లతో సహా టాప్ గ్లోబల్ ర్యాంకింగ్ కలిగిన 90 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల కోర్సులను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇందులో కొన్ని కోర్సులు ఉచితంగా లభిస్తుండగా మరికొన్ని కోర్సులకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా కోర్సులను బట్టి ఫీజులు రూ.3,750 నుంచి రూ. 22,500 వరకు ఉన్నాయి.

2. అకడమిక్ ఎర్త్ (academicearth.org)

సాంప్రదాయ కోర్సుల నుండి ప్రస్తుతం డిమాండ్ ఉన్న అకడమిక్ కోర్సుల వరకు అన్నింటినీ ఈ వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు నేర్చుకోవచ్చు. అకౌంటింగ్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్ వంటి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులకు ఈ వెబ్‌సైట్‌ ప్రత్యేకం. వీటితో పాటు బిహేవియరల్ సైకాలజీ లాంటి ఆధునిక కోర్సులకు సంబంధించిన మెటీరియల్‌ కూడా ఇక్కడ లభిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ లాంటి ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీల భాగస్వామ్యంతో విద్యార్థులకు ఆన్ లైన్ కోర్సులను అందిస్తున్నారు. కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులను వీడియోలు, పాడ్‌క్యాస్ట్‌ల ద్వారా బోధిస్తారు.

3. బిగ్ థింక్ (bigthink.com)

ఏదైనా కోర్సుకు సంబంధించి లోతైన పరిజ్ఞానం పొందడానికి బిగ్ థింక్ వెబ్‌సైట్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. బిగ్ థింక్‌లో దాదాపు 2,000కు పైగా వివిధ విభాగాల నిపుణులు ఉన్నారు. వారి సహకారంతో విద్యార్థులు సంబంధిత సబ్జెక్ట్‌‌లలో మంచి ప్రావీణ్యం పొందవచ్చు. ఈ సబ్జెక్ట్ నిపుణులు విద్యార్థులకు అవసరమయితే ఆర్టికల్స్, రికార్డ్ ట్యుటోరియల్‌లను కూడా అందిస్తారు. విద్యార్థులకు కచ్చితమైన ప్రమాణాలతో కూడిన బోధన ఉంటుంది. ఉన్నతమైన స్థానానికి ఎదగాలనే విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ను గొప్పగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఒక విషయంపై సమగ్రమైన వివరణలతో పాటు, నిపుణుల అభిప్రాయాలను అందిస్తుంది.

4. కోర్స్ఎరా (Coursera)

కోర్స్ఎరా ప్రపంచంలో ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ లెర్నింగ్ వెబ్‌సైట్స్‌లలో ఒకటి. ఇందులో ఐటీ దిగ్గజాలు గూగుల్, ఇంటెల్ సంస్థలకు చెందిన నిపుణులతో బోధనలు ఉంటాయి. ఈ వెబ్‌సైట్ ఫ్రీ కోర్సులతో పాటు పెయిడ్ కోర్సులు అందిస్తుంది. డిగ్రీ, మాస్టర్స్ కోర్సులతో పాటు సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ వరకు ఇందులో పొందవచ్చు. కోర్స్ఎరాలో 20 డిగ్రీలు, 30 సర్టిఫికెట్స్, 440 స్పెషలైజేషన్స్‌తో పాటు మెుత్తంగా 4,300 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

5. ఏలిసన్ (Alison)

 ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో కూడా ఫ్రీ కోర్సులతో పాటుగా పెయిడ్ కోర్సులు ఉంటాయి. దాదాపు 1,700 కోర్సులు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం