కుదిరితే కప్ కాఫీ! ప్రతిరోజూ కాఫీ తాగేవారిలో క్యాన్సర్ ముప్పు తక్కువ, ఓ అధ్యయనం-drinking coffee may lower the risk for prostate cancer says a study
Telugu News  /  Lifestyle  /  Drinking Coffee May Lower The Risk For Prostate Cancer, Says A Study
Coffee Benefits
Coffee Benefits (Shutterstock)

కుదిరితే కప్ కాఫీ! ప్రతిరోజూ కాఫీ తాగేవారిలో క్యాన్సర్ ముప్పు తక్కువ, ఓ అధ్యయనం

28 December 2021, 8:13 ISTManda Vikas
28 December 2021, 8:13 IST

రోజూ కాఫీ తాగే వారు మరో కప్ అదనంగా చేర్చడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ముప్పును సుమారు 1 శాతం తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. చైనా మెడికల్ యూనివర్శిటీకి సంబంధించిన షెంగ్జింగ్ హాస్పిటల్ లోని యూరాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయయాన్ని నిర్వహించారు.

మీరూ కాఫీ ప్రియులా? కుదిరితే కప్ కాఫీ అంటూ ఎప్పుడు వీలైతే అప్పుడు కప్పుల కొద్దీ కాఫీలు తాగేస్తుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్. అదేంటంటే, రోజుకి కొన్ని కప్పులు కాఫీ తాగే వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

బీఎంజే ఓపెన్ జర్నల్‌లో ప్రచురించరితమైన ఓ అధ్యయనం ప్రకారం, రోజూ కాఫీ తాగే వారు ఒకరోజులో మరో కప్ అదనంగా చేర్చడం ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ముప్పును సుమారు 1 శాతం తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. చైనా మెడికల్ యూనివర్శిటీకి సంబంధించిన షెంగ్జింగ్ హాస్పిటల్ లోని యూరాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయయాన్ని చేపట్టారు. పెరిగిన కెఫిన్ వినియోగం శరీరంలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎదుగుదలను కొంతవరకు నివారిస్తున్నట్లు వారి అధ్యయనంలో పేర్కొన్నారు.

పురుషులకే ఎక్కువ..

మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్. చాలా మంది క్యాన్సర్ తో చనిపోయే మగవారిలో ఆరవ ప్రధాన కారణంగా ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతీ నాలుగు మరణాలలో దాదాపు మూడు కేసులు ప్రొస్టేట్ క్యాన్సర్ తో సంభవించినవే అయి ఉంటున్నాయి. జపాన్, సింగపూర్, చైనా సహా ఇతర ఆసియా దేశాలలో ప్రొస్టేట్ క్యాన్సర్ కు సంబంధించి కేసులు చాలా పెరుగుతున్నాయి.

కాఫీతో క్యాన్సర్ నుంచి ఉపశమనం..

ఈ వ్యాధికి సంబంధించి లోతైన అవగాహన చేసుకునే క్రమంలో, పరిశోధకులు ప్రొస్టేట్ క్యాన్సర్ సంబంధిత డేటాబేస్‌లను పరిశీలించారు. వారి అలవాట్లను తెలుసుకున్నారు, అందులో కాఫీ తక్కువ తాగే వారితో పోలిస్తే కాఫీ ఎక్కువ తాగే వారిలో క్యాన్సర్ ప్రమాద శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. సుమారు 1 మిలియన్ కు పైగా పురుషులపై ఈ అధ్యయనం చేశారు, వీరిలో దాదాపు 57 వేల మందికి పైగా మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌ అభివృద్ధి చెంది ఉంది. ఇందులో రోజుకి 2 నుంచి 9 కప్పుల కాఫీ తాగే వారిని ఒక గ్రూప్ కిందకు, 2 కప్పుల కంటే తక్కువ కాఫీ తాగే వారిని మరో గ్రూపుగా విభజించి వేర్వేరుగా పరిశీలనలు చేయగా , కాఫీ ఎక్కువ తాగే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం 9 శాతం వరకు తగ్గుముఖంపట్టింది. వారు తాగే కాఫీలో ప్రతి అదనపు కప్పు 1 శాతం ప్రమాదాన్ని తగ్గించడంలో కనెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

చివరగా పరిశోధకులు చెప్పిందేంటంటే, అధిక కాఫీ వినియోగం పలు రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కొంత వరకు తగ్గించడంలో తోడ్పాటు ఇవ్వవచ్చు అయితే అందుకు కచ్చితమైన ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నారు.

 

సంబంధిత కథనం