Betel Leaves | సంప్రదాయాలలో తమలపాకుకు ప్రత్యేక స్థానం, తింటే ఎన్నో ప్రయోజనాలు!-betel leaves amazing health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Betel Leaves | సంప్రదాయాలలో తమలపాకుకు ప్రత్యేక స్థానం, తింటే ఎన్నో ప్రయోజనాలు!

Betel Leaves | సంప్రదాయాలలో తమలపాకుకు ప్రత్యేక స్థానం, తింటే ఎన్నో ప్రయోజనాలు!

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 04:36 PM IST

ఆయుర్వేదం ప్రకారం తమలపాకుల్లో అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి. ఈ ఆకులను ఉపయోగించి వ్యాధులను నయం చేసుకోవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చాలా మంది భోజనం చేసిన తరువాత తమలపాకుతో తాంబూలం వేసుకుంటారు. హిందువులు పలు పూజల్లో తమలపాకులను ఉపయోగిస్తుంటారు.

తమలపాకులు
తమలపాకులు

తమలపాకును మనం అనేక రకాలుగా ఉపయోగిస్తాం. పెళ్లి నుంచి కిళ్లీ దాకా ప్రతిచోటా ఈ ఆకు అవసరం ఉంటుంది. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం దగ్గర్నించీ పూజలు, ఇత్యాది సంప్రదాయ కార్యక్రమాలలో తమలపాకులు ఉపయోగిస్తాం. ఆంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేకంగా పూజ చేస్తాం.

హిందూ సంప్రదాయాలలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. తమలపాకులు క్షీర సాగర మథనంలో వెలువడ్డాయని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ ఆకులకు ఉన్న ఔషధ గుణాల దృష్ట్యా వీటిని మానవజాతికి అందించాలని శివపార్వతులు హిమాలయాల్లో తమలపాకు మొక్కలను నాటినట్లు పురాణ గాథల్లో ఉంది. పురాణాల ప్రకారం... ఈ ఆకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు, మధ్య భాగంలో సరస్వతీ దేవి, చివరలో మహాలక్ష్మి నివాసం ఉంటారట. తమలపాకు కాడకి, కొమ్మ మధ్యన జ్యేష్ఠాదేవి నివాసం,  కుడి భాగంలో భూమాత, ఎడమ వైపున పార్వతీదేవి, మాంగల్యదేవి నివసిస్తారు. సుబ్రహ్మణ్యుడు తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడని పురాణ కథనం.

ఇవన్నీ పక్కన పెడితే, తమలపాకు తినడం ద్వారా మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనేది కాదనలేని వాస్తవం. ఆయుర్వేదం ప్రకారం తమలపాకుల్లో అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి. ఈ ఆకులను ఉపయోగించి వ్యాధులను నయం చేసుకోవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చాలా మంది భోజనం చేసిన తరువాత జాజి లాంటి సుగంధ ద్రవ్యాలతో కలిపి తమలపాకుతో తాంబూలం వేసుకుంటారు. తాంబూలం వేసుకుంటే మానసిక తృప్తి, మంచి ఆరోగ్యమూ కలుగుతుందంటారు. ఇంకా ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకోండి.

తమలపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • తమలపాకుల రసం, తులసి ఆకుల రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కొద్ది కొద్దిగా తీసుకుని అన్నీ కలిపి పిల్లలకు తినిపించాలి. దీంతో సీజనల్ వ్యాధులయిన జలుబు, దగ్గు తగ్గుతాయి.
  • చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం తగ్గి తలనొప్పి నుంచి ఉపమశనం లభిస్తుంది.
  • రేచీకటి సమస్య ఉన్నవారు తమలపాకుల రసాన్ని రెండు కళ్లలోనూ చుక్కలుగా రోజూ వేస్తుండాలి. ఇందుకోసం ముందు డాక్టర్ల సలహా తీసుకోవాలి.
  • నోరు రుచిగా అనిపించకపోయినా, తినాలని లేకపోయినా రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది.
  • తమలపాకుల రసాన్ని ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్‌ చొప్పున తీసుకుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె అసాధారణ రీతిలో కాకుండా క్రమబద్దంగా కొట్టుకుంటుంది.
  • తల్లుల రొమ్ముల్లో పాలు గడ్డలుగా మారి నొప్పిని కలగజేస్తాయి. అలాంటప్పుడు తమలపాకులను వేడి చేసి రొమ్ముల మీద వేసి కట్టుకోవాలి. నొప్పి, వాపులు తగ్గిపోతాయి.
  • భోజనం చేసిన తర్వాత రోజూ రాత్రి తమలపాకుల తాంబూలం తింటే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలైన గ్యాస్‌, మలబద్దకం ఉండవు. అలాగే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీ, పురుషులకు శృంగారంపై ఆసక్తి కలుగుతుంది.
  • ప్రతిరోజూ తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అలానే డిప్రెషన్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు .
  • చిన్న గాయాలు, వాపు, నొప్పి ఉన్న చోట తమలపాకుని ఉంచితే సమస్య తగ్గుతుంది. తమలపాకుని నమిలి తిన్నా ఇదే ప్రయోజనం ఉంటుంది.

WhatsApp channel