Night Shifts | నైట్​షిప్ట్​తో జాగ్రత్త.. క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట-a nutritionist says lack of sleep is causes cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  A Nutritionist Says Lack Of Sleep Is Causes Cancer

Night Shifts | నైట్​షిప్ట్​తో జాగ్రత్త.. క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట

Vijaya Madhuri HT Telugu
Mar 01, 2022 10:29 AM IST

మారుతున్న కాలంతోపాటు కొలువులూ, వాటి పనివేళలూ మారాయి. చాలా రంగాల్లో ఉద్యోగులు షిప్టుల వారీగా పనిచేస్తున్నారు. కొందరు రాత్రి వేళల్లో కూడా పని చేస్తున్నారు. ఇలా రాత్రి పూట పనిచేసే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి షిప్టుల వల్ల నిద్ర చక్రానికి ఇబ్బంది కలుగుతుందని.. ఇది క్యాన్సర్​కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

నైట్ షిఫ్ట్​తో క్యాన్సర్
నైట్ షిఫ్ట్​తో క్యాన్సర్

Sleeping Sickness | మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి విషయానికి వస్తే.. పరిగణించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. తినే ఆహారం, వ్యాయమం, రోజూ వారి దినచర్య. వీటితో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిద్ర. అవును నిద్రే మరి. రాత్రి నిద్ర సరిగా లేకపోతే ఉదయం దినచర్యపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మనిషి 8 గంటలు కచ్చితంగా పడుకోవాలని వైద్యులు ఊరికే చెప్పరు మరి. నిద్రలేకపోతే వచ్చే సమస్యలు ఒకటా రెండా.. చాలానే ఉన్నాయి. తాజాగా ఆ సమస్యల్లో క్యాన్సర్ కూడా చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం.. రాత్రిపూట పనిచేయడం క్యాన్సర్​కు కారణం కావచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ప్రముఖ పోషకాహార నిపుణురాలు మున్మున్ గనేరివాల్ వెల్లడించారు.

దీర్ఘకాలిక వ్యాధులు నయం

నిద్ర అనేది బరువు తగ్గడానికి, మానసిక ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి నయం చేయడానికి సహాయపడుతుంది. వాస్తవానికి సరైన నిద్రలేకపోతే అది మన ఫిట్​నెస్​పై ప్రభావం చూపిస్తుంది. సరిగా నిద్రలేని వారి నిద్రను ట్రాక్​ చేయడానికి ఎలాంటి గాడ్జెట్ అవసరం లేదని.. వారి నిద్రలేవగానే ఎలా భావిస్తారో వారి కళ్లలోనే తెలుస్తుందని మున్మున్ అన్నారు. నిద్రలేని వారిని రెండు రకాలుగా విభజించి పలు సూచనలు చేశారు.

నిద్రలేని వాళ్లు రెండు రకాలు

ఒకటి వృత్తి పరంగా నిద్రలేని వారు. మరొకరు నిద్రరావట్లేదు అనే విషయాన్ని మరిచి తమని తాము నైట్​పీపుల్​గా పిలుచుకునేవాళ్లుగా విభజించారు. మొదటి వారు వీలైనంత తొందరగా కెరీర్​ను లేదా ఉద్యోగాన్ని మార్చుకోవాలని సూచించారు. ఎందకంటే ఎక్కువ కాలం నైట్​ షిఫ్టులు చేస్తే.. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. మన శరీరానికి సిర్కాడియన్ రిథమ్ ఉంటుందని.. దాని ప్రకారం మధ్యాహ్నం, రాత్రి నిద్రపోవాల్సి ఉంటుంది. కానీ నైట్​ షిఫ్టుల వల్ల ఆ వ్యవస్థ దెబ్బతింటుందని మున్మున్ వెల్లడించారు. ఇది క్యాన్సర్​కు దారి తీస్తుందని హెచ్చరించారు. ఇక రెండో రకం వారు.. ఈ నైట్​పీపుల్​ అనే బౌండరీ నుంచి బయటకు వచ్చి వైద్యుల సలహాతో రాత్రులు నిద్రపోవాలని సూచించారు.

మంచి నిద్రవల్ల ఉపయోగాలు..

మంచం మీద పడుకున్న 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో పడుకుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క అన్ని మున్మున్ వెల్లడించారు. అర్ధరాత్రి నిద్రలేవకపోయినా.. మంచి నిద్రను పొందుతున్నట్లేనని స్పష్టం చేశారు. మంచి నిద్రను పొందితే ఇది దీర్ఘకాలిక సమస్యల నుంచి మనల్ని తప్పిస్తుందని.. మానసిక ఆరోగ్య వ్యాధుల నుంచి కోలుకోవడానికి సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. మంచినిద్ర కోసం కొన్ని చిట్కాలు తెలిపారు.

మంచి నిద్ర కోసం కొన్ని చిట్కాలు

*రాత్రి నిద్రపోవాలంటే పగటిపూట కూడా నిద్రపోవాలి. కానీ అది 20 నిమిషాలు మించకూడదు.

*దిండు బాగా ఎత్తుగా లేదా కిందభాగంలో ఉండకుండా సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే చక్కని నిద్రవస్తుంది.

*బెడ్​రూమ్​ను కేవలం నిద్రకే పరిమితం చేయాలి.

*మొబైల్​, ఇతర గ్యాడ్జెట్​లను నిద్రపోయే ముందు దూరంగా ఉంచుకోవాలి.

*గదిలో ఉష్ణోగ్రత ఎప్పుడు ఒకేలా ఉండేలా చూసుకోవాలి.

*రాత్రి పదిగంటలకు నిద్రపోవాలి అంటే.. రాత్రి 8-9 గంటల మధ్య గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

WhatsApp channel