Liger Movie Review: లైగర్ మూవీ రివ్యూ - పాన్ ఇండియా లెవ‌ల్‌లో విజ‌య్‌కి హిట్ ద‌క్కిందా-vijay deverakonda puri jagannadh liger movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Puri Jagannadh Liger Movie Review

Liger Movie Review: లైగర్ మూవీ రివ్యూ - పాన్ ఇండియా లెవ‌ల్‌లో విజ‌య్‌కి హిట్ ద‌క్కిందా

Nelki Naresh Kumar HT Telugu
Aug 25, 2022 11:18 AM IST

Liger Movie Review: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ (puri jagannadh) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పాన్ ఇండియ‌న్ చిత్రం లైగ‌ర్‌ (Liger). ఈ ఏడాది విడుద‌ల‌వుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ఒక‌టైన ఈ సినిమా భారీ అంచ‌నాలు న‌డుమ‌ నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే..

అనన్యా పాండే, విజయ్ దేవరకొండ
అనన్యా పాండే, విజయ్ దేవరకొండ (Twitter)

Liger Movie Review: గ‌త నెల రోజులుగా లైగ‌ర్ మానియా దేశ‌మంతా ఆవ‌హించింది. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ క‌ల‌యిక‌లో రూపొందిన ఈ పాన్ ఇండియ‌న్ సినిమా కోసం టాలీవుడ్‌, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల ప్రేక్ష‌కులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూశారు.

లైగర్ సినిమాతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు విజయ్ దేవరకొండ. తొలి సినిమాకే బాలీవుడ్‌ స్ట్రెయిట్ హీరోల చిత్రాలకు ధీటుగా లైగ‌ర్ మూవీ ప్ర‌మోష‌న్స్‌కు భారీ స్థాయిలో ప్రేక్ష‌కులు హాజ‌రుకావ‌డంతో ఆస‌క్తిక‌రంగా మారింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యువ‌త‌రంలో ఉన్న ఫాలోయింగ్‌తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ లైగ‌ర్ మూవీ నిర్మాణంలో భాగం కావ‌డం ఈ సినిమా ప‌ట్ల భారీగా క్రేజ్ ఏర్ప‌డ‌టానికి కార‌ణ‌మైంది. క‌రోనా త‌ర్వాత అత్య‌ధిక అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగిన సినిమాల్లో ఒక‌టిగా లైగ‌ర్ నిల‌వ‌డంతో బాక్సాఫీస్ రిజ‌ల్ట్ పై ఉత్కంఠ నెల‌కొంది.

పూరి జ‌గ‌న్నాథ్ కు ఇదే తొలి పాన్ ఇండియ‌న్ సినిమా కావ‌డం, బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ తొలిసారి ఇండియ‌న్ స్క్రీన్‌పై క‌నిపించ‌నున్న సినిమా ఇదే కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి.

ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల న‌డుమ నేడు లైగర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ హిట్ కొట్టాడా లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే....

Liger movie review: లైగర్ కల ఇదే

తన కొడుకును మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ఛాంపియ‌న్‌గా చూడాల‌న్న‌ది బాలామ‌ణి (రమ్యకృష్ణ)క‌ల‌. లైగ‌ర్ ప‌ట్టుద‌ల‌, సంక‌ల్పం చూసి ఉచితంగా అతడికి కోచింగ్ ఇవ్వ‌డానికి క్రిస్టోఫ‌ర్ (రోనిత్ రాయ్)అంగీక‌రిస్తాడు. ఛాంపియ‌న్‌గా నిల‌వాలంటే అమ్మాయిల‌కు దూరంగా ఉండాల‌ని కోచ్ కండీష‌న్ పెడ‌తాడు.

లైగ‌ర్ టాలెంట్ చూసి ముగ్ధురాలైన తాన్య (అనన్యా పాండే)తొలిచూపుల‌తోనే అత‌డితో ప్రేమ‌లో ప‌డుతుంది. తాన్య‌ను లైగ‌ర్‌కూడా ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ లైగ‌ర్‌కు న‌త్తి స‌మ‌స్య ఉంద‌ని తెలిసిన తాన్య అత‌డికి దూర‌మ‌వుతుంది.

మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో నేష‌న‌ల్ లెవ‌న్‌లో తాన్య అన్న‌య్య సంజూతో (విష్) లైగ‌ర్ పోటీప‌డ‌తాడు. తాన్య‌పై కోపంతో ఆమె అన్న‌య్య‌ను లైగ‌ర్ ఏం చేశాడు? త‌ల్లి కోరిన‌ట్లుగా అత‌డు ఇంట‌ర్‌నేష‌నల్ ఛాంపియ‌న్ షిప్ గెలిచాడా? ఇండియ‌న్ స‌త్తాను ప్ర‌పంచం మొత్తం చాటిచెప్పాల‌నే లైగ‌ర్ క‌ల తీరిందా? తాను ఎంత‌గానో ఆరాధించే మార్క్ ఆండ‌ర్స‌న్‌ను(మైక్ టైసన్) లైగ‌ర్ ఎలా క‌లిశాడు అన్నదే ఈ సినిమా క‌థ‌.

liger: ఫార్మాట్ ఒక్కటే..

సాధార‌ణంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో విన్న‌ర్‌గా నిల‌వ‌డ‌మే హీరో టార్గెట్‌గా ఉంటుంది. విజేత‌గా నిలిచే ప్ర‌యాణాన్ని ఎమోష‌న్స్ మేళ‌వించి ఎంగేజింగ్‌గా చెప్ప‌డంపైనే సినిమా విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి. క్రీడాంశం ఏదైనా అల్టిమేట్‌గా ప్ర‌తి సినిమాలో ఇదే ఫార్మెట్ ఫాలో అవుతుంటారు. లైగ‌ర్ కూడా అలాంటి క‌థే

Liger Movie Review: లవ్ ప్లస్ మదర్ సెంటిమెంట్

మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో విన్న‌ర్ కావాలనే సంక‌ల్పాన్ని ఓ యువ‌కుడు ఎలా నేర‌వేర్చుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా మెయిన్ పాయింట్‌. ఈ అంశానికి ల‌వ్‌స్టోరీ, రివేంజ్ ఫార్ములా, మ‌ద‌ర్ సెంటిమెంట్ జోడించి ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ లైగ‌ర్ క‌థ‌ను రాసుకున్నారు. హీరో న‌త్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లుగా చూపించి ఓ సింప‌థీని క్రియేట్ చేస్తూ హీరోయిజాన్ని కొత్తగా ప‌డించేందుకు ప్ర‌య‌త్నించారు

క్లైమాక్స్ డిఫరెంట్‌గా లైగర్

రెగ్యుల‌ర్ ఫార్మెట్‌లో డైరెక్ట్‌గా క‌థ‌లోకి వెళ్ల‌కుండా ఓ స‌మ‌స్య‌లో చిక్కుకున్న హీరో త‌న గ‌తాన్ని చెబుతున్న‌ట్లుగా స్క్రీన్‌ప్లే మ్యాజిక్ ను ఉప‌యోగిస్తూ విజ‌య్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైగర్ క‌థ‌ను మొద‌లుపెట్టారు ద‌ర్శ‌కుడు. త‌ల్లితో క‌లిసి హీరో ముంబాయి రావ‌డం, మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ మ‌రోవైపు ప్రేమ స‌న్నివేశాల‌తో ఫ‌స్ట్‌హాఫ్ మొత్తం స‌ర‌దాగా సినిమాను న‌డిపించారు. హీరోలోని లోపాన్ని అవ‌హేళ‌న చేస్తూ ప్రియురాలు అతడికి దూర‌మ‌య్యే ట్విస్ట్ తో సెకండాఫ్ ప‌ట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఛాంపియ‌న్ షిప్ కోసం అమెరికాలో అడుగుపెట్టిన లైగ‌ర్ జ‌ర్నీని ఫుల్ యాక్ష‌న్ అంశాల‌తో సెకండాఫ్‌లో ఆవిష్కరించారు. అక్క‌డ కూడా తాన్య ఎందుకు ఉంది? లైగ‌ర్‌ను వ‌దిలిపెట్టి వెళ్లిపోవ‌డానికి కార‌ణ‌మేమిట‌నే చిన్న మ‌లుపుల‌తో మ‌ళ్లీ సినిమా ల‌వ్ ట్రాక్ ఎక్కుతుంది. రొటీన్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాల‌కు భిన్నంగా క్లైమాక్స్‌ను తెర‌కెక్కించారు పూరి జ‌గ‌న్నాథ్‌. తాను ఆరాధించే ప్లేయ‌ర్‌తో పోటీప‌డ‌టంలోనే నిజ‌మైన గెలుపు ఉంటుంద‌ని చూపించి సినిమాను ముగించారు.

కొత్తదనం మిస్ అయిన లైగర్

మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ అనే పాయింట్ త‌ప్పితే పూరి ఎంచుకున్న క‌థ‌లో ఎంలాంటి కొత్త‌ద‌నం లేదు. ఈ పాయింట్‌తో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. అదే దారిలోలైగ‌ర్ న‌డుస్తుంది. ల‌క్ష్య‌సాధ‌న‌లో హీరోకు ఎదుర‌య్యే ఛాలెంజెస్ అన్ని సిల్లీగా ఉంటాయి. నేష‌న‌ల్‌, ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఛాంపియ‌న్ షిప్‌లో సింపుల్‌గా గెలిచిన‌ట్లుగా చూపించారు. ల‌వ్‌స్టోరీ పూర్తిగా డ‌బుల్‌మీనింగ్ డైలాగ్స్ తో సాగుతుంది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌లో డెప్త్ లేదు. అందులో డ్రామా స‌రిగా పండ‌లేదు.

మైక్ టైసన్ ఉన్నా..

ఫ‌స్ట్‌హాఫ్ ఓకే అనిపించిన సెకండాఫ్ పూర్తిగా నిరాశ‌ప‌రిచింది. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట్ సీక్వెన్స్‌ల‌తోనే న‌ల‌భై నిమిషాల వ‌ర‌కు టైమ్ పాస్ చేశారు.. క్లైమాక్స్ డిఫ‌రెంట్ గా ప్లాన్ చేయాల‌న్నా పూరి ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. మైక్ టైస‌న్ లాంటి లెజెండ‌రీ బాక్స‌ర్‌తో కామెడీ ఫైట్ చేయించ‌డం బాగాలేదు.పూరి సినిమాల్లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించ‌డంలో డైలాగ్స్ కీల‌కంగా నిలుస్తాయి. లైగ‌ర్ లో హీరోకు న‌త్తి స‌మ‌స్య పెట్టి ఆ మ్యాజిక్ మిస్స‌యింది. న‌త్తి స‌మ‌స్య‌ను కేవ‌లం బూతు డైలాగ్స్ కోస‌మే వాడుకున్న‌ట్లుగా ఉంది.

విజయ్ లోని మాస్ కోణాన్ని...

న‌టుడిగా విజ‌య్‌ దేవరకొండలోని మాస్ కోణాన్ని పూర్తిస్థాయిలో చూపించిన సినిమా లైగర్ మూవీ. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ప్లేయ‌ర్ కోసం టాన్స్‌ఫార్మ్ అయిన తీరు మెప్పిస్తుంది. త‌న దైన శైలి యాటిట్యూడ్‌, యాక్టింగ్ స్టైల్‌తో సినిమాను నిల‌బెట్టేందుకు చాలా ప్ర‌య‌త్నించారు. కానీ క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డంతో కుద‌ర‌లేదు. అన‌న్యా పాండే (ananya pandey) గ్లామ‌ర్ ప‌రంగా ఒకే కానీ యాక్టింగ్‌లో మాత్రం చాలా ఇంప్రూవ్ కావాలి. బాల‌మ‌ణిగా ర‌మ్య‌కృష్ణ (ramya krishnan)క్యారెక్ట‌ర్ ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్‌గా నిలిచింది. విజ‌య్‌, ర‌మ్య‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్స్ కొన్ని బాగున్నాయి. రోనిత్‌రాయ్‌, చుంకీపాండే, అలీ, విష్ క్యారెక్ట‌ర్స్ ఒకే అనిపిస్తాయి.

విజయ్ యాక్టింగ్ కోసం చూడొచ్చు...

పూరి సినిమాల్లో క‌నిపించే హీరోయిజం ఇందులో చాలావరకు మిస్స‌యింది. క‌థ విష‌యంలో నిరాశ‌ప‌రిచాడు. కోక పాట ఒక్క‌టే మాస్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లుగా లేదు. ఓవ‌రాల్‌గా లైగ‌ర్ ఎబోవ్ యావ‌రేజ్ సినిమాగా చెప్ప‌వ‌చ్చు. విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్టింగ్ కోసం సినిమాను ఓ సారి చూడొచ్చు.

రేటింగ్ : 2.5/ 5

IPL_Entry_Point