Tollywood Young Heroes Shelved Movies: సినిమాల్ని ఒప్పుకొని తప్పుకుంటున్నారు - దర్శకులకు షాక్ ఇస్తోన్న యంగ్ హీరోలు
Tollywood Young Heroes Shelved Movies: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో యంగ్ హీరోల తీరు వివాదాస్పదమవుతోంది. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత ఆయా సినిమాల నుంచి వైదొలుగుతూ దర్శకనిర్మాతలకు షాక్ ఇస్తోన్నారు. ఇటీవల కాలంలో అలా ఆగిపోయిన సినిమాలు ఏవంటే...
Tollywood Young Heroes Shelved Movies: గతంలో హీరోలు కమిట్‌మెంట్‌తో సినిమాలు చేసేవారు. ఓ సినిమా ఒప్పుకున్న తర్వాత దర్శకుడికి విలువనిస్తూ ఎన్ని అవరోధాలు ఎదురైనా దానిని పూర్తిచేసేవారు. అంగీకరించిన సినిమాల నుంచి హీరోలు అర్ధాంతరంగా తప్పుకోవడం అరుదుగా జరిగేది.
కానీ ప్రస్తుతం యంగ్ హీరోల తీరు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. సినిమాల్ని ఒప్పుకున్న తర్వాత వాటి నుంచి ఈజీగా వైదొలుగుతున్నారని కొందరు అభిప్రాయపడుతోన్నారు.
ఓపెనింగ్ జరిగి సెట్స్‌మీదకు వెళ్లేలోపు ఆయా సినిమాలకు ప్యాకప్ చెప్పేస్తోండటంతో యంగ్ హీరోల తీరు వివాదాస్పదమవుతోందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు హీరోలు ఇలా సినిమాల్ని ఒప్పుకొని తప్పుకున్న సందర్భాలున్నాయి.
శర్వానంద్ - కృష్ణచైతన్య మూవీ
శర్వానంద్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ ప్రేమకథా చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. త్రివిక్రమ్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే ఆగిపోయింది.
డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో కృష్ణచైతన్య సినిమా నుంచి శర్వానంద్ తప్పుకోన్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో మరో యంగ్ హీరోతో ఈ సినిమా చేసేందుకు కృష్ణచైతన్య సన్నాహాలు చేస్తోన్నట్లు తెలిసింది.
కృష్ణచైతన్యకు శర్వానంద్‌తో పాటు మరో యంగ్ హీరో నితిన్ కూడా హ్యాండిచ్చాడు. కృష్ణచైతన్యతో పవర్‌పేట పేరుతో ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నట్లు నితిన్ ప్రకటించాడు. కానీ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమాకు ప్యాకప్ పడింది.
నాగచైతన్య - పరశురామ్ మూవీ
నాగచైతన్య, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో రెండేళ్ల క్రితమే ఓ సినిమాను అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ మొదలవుతుందనుకుంటున్న తరుణంలో నాగచైతన్య ఈ సినిమా తప్పుకున్నాడు. దాంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టిన దర్శకుడు పరశురామ్ ...విజయ్ దేవరకొండతో మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు.
విశ్వక్ సేన్ - అర్జున్ సినిమా…
సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా రోడ్ జర్నీ లవ్‌స్టోరీ సినిమా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌ను హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రకటించారు.
షూటింగ్ ప్రారంభం కాకుండానే అర్జున్, విశ్వక్‌సేన్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాంతో విశ్వక్‌సేన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అతడిపై అర్జున్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇవే కాకుండా అఫీషియల్‌గా అనౌన్స్‌చేసిన తర్వాత యంగ్ హీరోలు తప్పుకోవడంతో పలు సినిమాలు ఆగిపోయాయి.