Rana on Bahubali: బాహుబలి కోసం రూ.400 కోట్ల అప్పు చేశాం.. అది కూడా 24 శాతం వడ్డీకి: రానా
Rana on Bahubali: బాహుబలి కోసం రూ.400 కోట్ల అప్పు చేశాం.. అది కూడా 24 శాతం వడ్డీకి అంటూ రానా దగ్గుబాటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. సినిమాలు చేయడానికి చాలా వరకూ అందరూ తమ ఇళ్లు, ఆస్తులు తాకట్టు పెడతారని వెల్లడించాడు.
Rana on Bahubali: బాహుబలి మూవీది భారీ బడ్జెట్. ఆ సినిమా అంతకంటే ఎక్కువే వసూలు కూడా చేసింది. కానీ ఈ సినిమా తీయడానికి మేకర్స్ పడిన శ్రమ ఎంతో తెలుసా? ముఖ్యంగా ఆర్థిక సవాళ్లు చాలానే ఎదురైనట్లు తాజాగా రానా కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.400 కోట్ల వరకూ అప్పు చేశారని, అది కూడా ఏడాదికి 24 శాతం వడ్డీ రేటు అని రానా చెప్పడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
2015లో బాహుబలి రిలీజైనప్పుడు అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా నిలిచింది. అయితే వసూళ్ల పరంగానూ రూ.600 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్లింది. ఈ సినిమా తీయడానికి మేకర్స్ పడిన కష్టాల గురించి ఈ మధ్య ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా వివరించాడు.
"మూడు, నాలుగేళ్ల కిందట సినిమాలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవి? ఆ సినిమా తీసేవాళ్లు తమ ఇల్లో, ఆస్తులో బ్యాంకులో తనఖా పెట్టి, వడ్డీకి డబ్బు తెచ్చేవాళ్లు. తర్వాత విడిపించుకునేవాళ్లు. మేము 24 నుంచి 28 శాతం వడ్డీ కట్టేవాళ్లం. సినిమాల్లో అప్పులు అలా ఉంటాయి. బాహుబలిలాంటి సినిమా కోసం రూ.300 నుంచి రూ.400 కోట్ల ఆ వడ్డీ రేటుకు తీసుకొచ్చారు" అని రానా వెల్లడించాడు.
బాహుబలి 1 రిలీజైన తర్వాత మేకర్స్ 24 శాతం వడ్డీ రేటుకు ఐదున్నరేళ్ల పాటు రూ.180 కోట్ల అప్పు తీసుకున్నట్లు కూడా అతడు చెప్పాడు. "పార్ట్ 1 చాలా కష్టంగా సాగింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కంటే కూడా రెట్టింపు ఖర్చు చేశాం. అందువల్ల మేం చేసిన అప్పు, సినిమా తీయడానికి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
రూ.180 కోట్లను 24 శాతానికి ఐదున్నరేళ్ల పాటు అప్పుగా తీసుకున్నారు. అప్పుడు కాస్త బాహుబలి 2 కూడా చేసేశాం. ఒకవేళ ఆ సినిమా ఆడకపోయి ఉంటే ఏం జరిగేదో అసలు ఊహించలేం" అని రానా అన్నాడు.
గతంలో రాజమౌళి కూడా బాహుబలికి ఎదురైన ఆర్థిక కష్టాల గురించి చెప్పాడు. ఒకవేళ ఆ సినిమా ఆడకపోయి ఉంటే తనను నమ్మి మూడేళ్ల పాటు తనతో నిలిచిన ప్రొడ్యూసర్ జీవితంలో మళ్లీ కోలుకోలేని పరిస్థితికి చేరేవారని రాజమౌళి అన్నాడు.
సంబంధిత కథనం