Puri Jagannadh vs Distributors: లైగర్ సినిమా నష్టాలకు సంబంధించి గత కొన్నాళ్లుగా దర్శకనిర్మాత పూరి జగన్నాథ్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో తాము నష్టపోయిన డబ్బును పూరి జగన్నాథ్ తిరిగి చెల్లించాలంటూ కొంతకాలంగా డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు.
వారందరూ కలిసి పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నాకు సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నది. లైగర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో పాటు శోభన్‌బాబుపై దర్శకుడు పూరి జగన్నాథ్ పోలీసు కేసును పెట్టాడు. వరంగల్ శ్రీను, శోభన్‌బాబు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, తన కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎఫ్ఐఆర్ కాపీలో పూరి పేర్కొన్నాడు.
లైగర్ సినిమాకు సంబంధించి సబ్ డిస్ట్రిబ్యూటర్లకు వరంగల్ శ్రీనుతో పాటు శోభన్ బాబు డబ్బులు చెల్లించాల్సివుందని, కానీ ఆ డబ్బును ఎగవేయడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తానే సబ్ డిస్ట్రిబ్యూటర్లకు బాకీ ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని పూరి జగన్నాథ్ పేర్కొన్నాడు. తన గురించి సోషల్ మీడియాలో దుష్ఫ్రచారాలు చేస్తూ అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు.
తాను లేని సమయంలో తన కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నాడు. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమంగా డబ్బు వసూలు చేసేందుకు వరంగల్ శ్రీను, శోభన్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పాడు. వరంగల్ శ్రీనుతో పాటు శోభన్‌బాబుల నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పూరి జగన్నాథ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
మరోవైపు శోభన్‌బాబు, వరంగల్ శ్రీను వాదనలు భిన్నంగా ఉన్నాయి. కష్ట సమయాల్లో చాలా సార్లు పూరి జగన్నాథ్‌ను ఆదుకున్నామని, డబ్బులు ఎగవేయడానికే తమపై తప్పుడు కేసులు పెట్టారని వారు చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ (Vijay deverakonda), అనన్యా పాండే జంటగా నటించిన లైగర్ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. రొటీన్ కథ, కథనాల కారణంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది.