PS-2 Collections: పొన్నియిన్ సెల్వన్ 2 వసూళ్ల వర్షం.. అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు-ponniyin selvan 2 becomes highest grossing tamil film of 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ps-2 Collections: పొన్నియిన్ సెల్వన్ 2 వసూళ్ల వర్షం.. అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు

PS-2 Collections: పొన్నియిన్ సెల్వన్ 2 వసూళ్ల వర్షం.. అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు

Maragani Govardhan HT Telugu
May 12, 2023 07:07 PM IST

PS-2 Collections: మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 వసూళ్ల వర్షాన్ని సృష్టించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్సే స్వయంగా తెలియజేశారు.

పొన్నియిన్ సెల్వన్-2 కలెక్షన్లు
పొన్నియిన్ సెల్వన్-2 కలెక్షన్లు

PS-2 Collections: మణిరత్న ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూళిపాల లాంటి భారీ తారాగణం ఇందులో నటించింది. గతేడాది రిలీజైన పీఎస్-1 బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. దీంతో పొన్నియిన్ సెల్వన్ రెండో భాగంపై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పీఎస్-2కు పాజిటివ్ టాక్ లభించినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

భారీ తారాగణం నటించినప్పటికీ పొన్నియిన్ సెల్వన్-2కు అనుకున్న స్థాయిలో వసూళ్లు దక్కలేదు. పీఎస్-2కు ముందు పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో అది వసూళ్లపై ప్రభావం పడింది. ఈ మూవీ 400 కోట్ల మార్కును అందుకోవడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. ఇటీవల మేకర్స్ పీఎస్-2 300 కోట్ల మార్కును అందుకున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ ఏడాదికి తమిళంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచినట్లు పోస్టర్‌ను విడుదల చేశారు.

కోలీవుడ్‌లో ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో పొన్నియిన్ సెల్వన్-2 అత్యధిక గ్రాస్‌ను అందుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు విజయ్ నటించిన వారిసు/వారసుడు ముందుండగా.. తాజాగా ఈ రికార్డును పీఎస్-2 అధిగమించినట్లు సదరు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఈ మల్టీ స్టారర్ ఫ్యామిలీ డ్రామా ఎంగేజింగ్‌గా ఉన్నప్పటికీ వసూళ్లపై మాత్రం ప్రభావం పడింది. అయితే ఇంకా థియేటర్లలో ఆడుతున్న ఈ సినిమా 350 కోట్లను మార్కును అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దగ్గరలో కోలీవుడ్ స్టార్ల సినిమాలు విడుదల కావట్లేదు. దీంతో పీఎస్-2కు అనుకూలించే అవకాశముంది.

ఈ ఏడాది కోలీవుడ్‌లో రానున్న మరో పెద్ద సినిమా విజయ్ లియో. ఇది అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మినహా ఈ ఏడాది కోలీవుడ్ నుంచి పెద్ద సినిమాలేవి లేవు. ఒకవేళ ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ అయ్యే అవకాశముంది.

ఇక పొన్నియిన్ సెల్వన్-2 విషయానికొస్తే.. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ లాంటి భారీ తారాగణం ఇందులో నటించింది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాతృక తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది.