Kantara IMDb Rating: వావ్‌ కాంతారా.. అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు-kantara imdb rating is now the highest in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Imdb Rating: వావ్‌ కాంతారా.. అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు

Kantara IMDb Rating: వావ్‌ కాంతారా.. అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 02:14 PM IST

Kantara IMDb Rating: సంచలనాలు సృష్టిస్తున్న కాంతారా మూవీ మరో అరుదైన ఘనత సాధించింది. అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా ఈ మూవీ నిలవడం విశేషం.

కాంతారా మూవీలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ
కాంతారా మూవీలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ

Kantara IMDb Rating: కన్నడ సినిమా కాంతారాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటూ కొనియాడుతుండటంతో కాంతారా క్రేజ్‌ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ సినిమా శనివారం (అక్టోబర్‌ 15) తెలుగు, తమిళంలోనూ రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే కాంతారా మరో ఘనతనూ సొంతం చేసుకుంది.

అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా నిలిచింది. ప్రేక్షకులు సినిమాలకు ఇచ్చే రేటింగ్‌కు ప్రామాణికంగా భావించే ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌)లో మరో కన్నడ సినిమా కేజీఎఫ్‌ 2ను వెనక్కి నెట్టి కాంతారా ఈ రికార్డు సృష్టించింది. కాంతారాకు ప్రస్తుతం ఐఎండీబీలో 9.4 రేటింగ్ ఉండటం విశేషం. ఇన్నాళ్లూ ఈ రికార్డు 8.4తో కేజీఎఫ్‌ 2 పేరిట ఉండేది. ఆ తర్వాత ఆర్ఆర్‌ఆర్‌ 8 రేటింగ్‌తో ఉంది.

కన్నడ స్టార్‌ రిషబ్‌ శెట్టి డైరెక్ట్‌ చేసి నటించిన ఈ కాంతారా మూవీ సెప్టెంబర్‌ 30న రిలీజైంది. అదే రోజు పొన్నియిన్‌ సెల్వన్‌లాంటి భారీ బడ్జెట్‌ మూవీ రిలీజైనా కూడా కాంతారా దానిని తట్టుకొని నిలబడింది. ఈ సినిమాకు వస్తున్న క్రేజ్‌తో కర్ణాటకలో క్రమంగా షోల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లారు. హిందీ, తెలుగు, తమిళంలలోనూ డబ్‌ చేసి రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లు వసూలు చేసింది. ఈ వీకెండ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఒక్క కర్ణాటకలోనే రూ70 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం. ఈ మూవీ శుక్రవారం (అక్టోబర్‌ 14) హిందీ రిలీజ్‌ కాగా.. శనివారం (అక్టోబర్‌ 15) తెలుగు, తమిళంలలో రిలీజ్‌ కాబోతోంది.

కాంతారా.. కచ్చితంగా చూడాల్సిన సినిమా: ధనుష్‌

ఇక ఈ కాంతారా సినిమా చూసిన తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ప్రశంసలు కురిపించాడు. మైండ్‌ బ్లోయింగ్‌ సినిమా.. కచ్చితంగా చూడాల్సిందే అని ధనుష్‌ శుక్రవారం ట్వీట్‌ చేశాడు. ఈ సినిమాను డైరెక్ట్‌ చేసి, యాక్ట్‌ చేసిన రిషబ్‌ శెట్టిని కూడా ఆకాశానికెత్తాడు.

"కాంతారా.. మైండ్‌ బ్లోయింగ్‌!! కచ్చితంగా చూడాల్సిన సినిమా.. రిషబ్‌ శెట్టి, నువ్వు చాలా గర్వపడాలి. హోంబలె ఫిల్మ్స్‌కు శుభాకాంక్షలు.. హద్దులను చెరిపేస్తూ ఉండండి. ఈ సినిమాలో నటించిన నటులు, టెక్నీషియన్స్‌ అందరికీ ప్రేమపూర్వక ఆలింగనం" అంటూ ధనుష్‌ ట్వీట్‌ చేయడం విశేషం.

IPL_Entry_Point

టాపిక్